Share News

నిధులే ప్రధానం.. గళం విప్పితేనే ఫలితం

ABN , Publish Date - Nov 10 , 2024 | 02:24 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలకమైన అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. తొలుత జూన్‌ ఆఖరులో రెండు రోజులపాటు నిర్వహించి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియలను ముగించారు. జూలై ఆఖరులో మరోసారి ఐదు రోజులపాటు నిర్వహించి రెండో ఓటాన్‌ అకౌంట్‌ ఆమోదం, ఇతర అంశాలపై చర్చించారు. ఈసారి ఈనెల 11 నుంచి నిర్వహించే సమావేశాలలో వార్షిక బడ్జెట్‌ ఆమోదం, పలు కీలక అంశాలపై చర్చతోపాటు బిల్లులను ఆమోదించనున్నారు.

నిధులే ప్రధానం.. గళం విప్పితేనే ఫలితం

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

తొలిరోజు బడ్జెట్‌ ప్రతిపాదనలు

వివిధ అంశాలపై చర్చకు అవకాశం

సాగు, తాగునీరు, విద్య వైద్యం, రోడ్లు, పారిశ్రామిక, ఉపాధి రంగాలు కీలకం

మార్కాపురం జిల్లా ఏర్పాటు, ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ అత్యవసరం

ఒంగోలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలకమైన అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. తొలుత జూన్‌ ఆఖరులో రెండు రోజులపాటు నిర్వహించి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియలను ముగించారు. జూలై ఆఖరులో మరోసారి ఐదు రోజులపాటు నిర్వహించి రెండో ఓటాన్‌ అకౌంట్‌ ఆమోదం, ఇతర అంశాలపై చర్చించారు. ఈసారి ఈనెల 11 నుంచి నిర్వహించే సమావేశాలలో వార్షిక బడ్జెట్‌ ఆమోదం, పలు కీలక అంశాలపై చర్చతోపాటు బిల్లులను ఆమోదించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి రెండు వారాలపాటు సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజైన సోమవారం బడ్జెట్‌ ప్రతిపాదనలు పెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే శాఖల వారీ నిధుల కేటాయింపు, అభివృద్ధి, సంక్షేమ అంశాలు, కీలక ప్రజాసమస్యలపై విస్తృత చర్చ సాగుతుంది. ఒకవైపు పద్దుల వారీ, మరోవైపు ప్రశ్నల రూపంలో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై మాట్లాడి నిధులు రాబట్టుకొనే అవకాశం ఉంటుంది. అలాంటి కీలక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలను సద్వినియోగం చేసుకొని గళం విప్పాలని ప్రజానీకం కోరుతున్నారు.

నిధుల సాధనే లక్ష్యం

ప్రధానంగా ఆయా శాశ్వత అభివృద్ధి, ఉపాధి రంగాలు, మౌలిక సదుపాయాలకు నిధులు సాధించడంతోపాటు వైసీపీ పాలనలో అదుపులేకుండా సాగిన అవినీతి, అక్రమాల అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కీలకమైన వెలిగొండ, గుండ్లకమ్మతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు, జలజీవన్‌ మిషన్‌తోపాటు ఇతర తాగునీటి పథకాలు, యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ, డ్రైవింగ్‌ స్కూలు, మార్కాపురం మెడికల్‌ కాలేజీ వంటి నిర్మాణాలు చేపట్టాలి. రోడ్లు, పారిశ్రామిక అభివృద్ధి రంగాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కీలకమైన ఒంగోలు డెయిరీని ఏకంగా మూసేయగా అడ్డగోలుగా జిల్లాను విభజించి పశ్చిమ ప్రాంతవాసులను ఇబ్బంది పెట్టారు. వాటన్నింటిపై చర్చించి పరిష్కారం సాధించాలి.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు

ఈసారి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్‌ ప్రధాన అంశంగా నిర్వహిస్తున్న తరుణంలో జిల్లా అభివృద్ధి, పెండింగ్‌ ప్రాజెక్టులు, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఎమ్మెల్యేలపై ఉంది. ప్రధానమైన వెలిగొండకు నిధులు లేక కదలడం లేదు. తొలిదశ పూర్తిచేయాలన్నా రూ.1,420కోట్లు కావాలి. గుండ్లకమ్మ గేట్లు, కాలువల పనులకు రూ.200 కోట్లు, ఇతర సాగునీటి వనరులకు మరో రూ.300 కోట్లు అవసరం. తాగునీటి సరఫరా పరిస్థితి జిల్లాలో దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జలజీవన్‌ మిషన్‌, పట్టణ ప్రాంతాల్లో అమృత్‌ పథకం పనులు పడకేశాయి. సుమారు రూ.250 కోట్ల వరకు వాటికి అవసరం. కాగా జిల్లాలోని 27 సామూహిక నీటి పథకాల పరిధిలో పూర్తిస్థాయి నీటి సరఫరాకు అవసరమైన పనులకు రూ.159.92కోట్లు కోరుతూ కలెక్టర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.

చాలా పనులు పెండింగ్‌

టీడీపీ ప్రభుత్వ కాలంలో శంకుస్థాపన చేసిన ఏకేయూ యూనివర్సిటీ, ట్రిపుల్‌ఐటీ, డ్రైవింగ్‌ స్కూల్‌తోపాటు వైసీపీ చేపట్టిన మార్కాపురం మెడికల్‌ కాలేజీ, దోర్నాలలో గిరిజన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణాలు ముందుకు పడలేదు. దొనకొండ కారిడార్‌, కనిగిని నిమ్జ్‌ల పరిస్థితీ అంతే. కీలకమైన రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. సాగర్‌ కాలువల్లో నీరు పారే పరిస్థితి లేకపోగా, నీరు-చెట్టు, ఉపాధి అనుసంధాన, మైక్రో ఇరిగేషన్‌ పథకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాకు తలమానికమైన ఒంగోలు డెయిరీని వైసీపీ ప్రభుత్వం మూసేసింది. దాదాపు రూ.1,500 కోట్ల విలువైన ఆ సంస్థ ఆస్తులు నిరుపయోగంగా మారాయి. అధికారంలోకి వస్తే డెయిరీని పునరుద్ధరిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ప్రకటించారు. పలుసభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.


మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలి

మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటును పలుసార్లు స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత, అలాగే త్వరితగతిన వాటి ప్రక్రియ సాగేలా ఈ సమావేశాల్లోనే ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టాల్సి ఉంది. అలాగే డీసీసీబీ, డ్వామా, జగనన్న కాలనీలు, ఇతరత్రా పలు శాఖల పరిధిలో అవినీతి, అక్రమాలపై విచారణలు జరుగుతున్నా ఆశించిన స్థాయిలో లేవు. అలాంటి వాటిపై ఉన్నతస్థాయి చర్యలపై చర్చపెట్టడం ద్వారా వేగవంతం చేయాలి. ఇదిలాఉండగా జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా మంత్రి స్వామి మరో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించడంతో వారిరువురూ అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పాత్రలు రెండింటినీ టీడీపీ ఎమ్మెల్యేలు కొనసాగించి జిల్లా ప్రజల గళం వినిపించాల్సి ఉంది.

Updated Date - Nov 10 , 2024 | 02:24 AM