గంగమ్మ చెంతకు గణనాథులు
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:28 AM
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను 9వ రోజు నిమజ్జనాలకు తరలించారు.
తర్లుపాడు, సెప్టెంబరు 15: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను 9వ రోజు నిమజ్జనాలకు తరలించారు. తర్లుపాడులో యాదవ్ యూత్ ఆధ్వర్యంలో, ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని, సూరేపల్లి, నాగెళ్లముడుపు తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను ట్రాక్టర్‌లపై ఉంచి డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాటం చూపరులను ఆకట్టు కుంది. తర్లుపాడు పురవీధుల్లో గ్రామత్సోవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై పూజలు చేశారు. యువకులు కేరింతలు కొడుతూ ‘జై బోలో గణేష్ మాహారాజ్’ అంటూ నృత్య ప్రదర్శనలు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ విగ్రహాలను బొడిచర్ల వద్దనున్న గుండ్లకమ్మవాగులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ రాజ్‌కుమార్ పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మార్కాపురం వన్‌టౌన్ : పట్టణంలో వినాయక నిమజ్జన ఉత్స వం ఆదివారం వైభవంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలు మండపా ల వద్ద అన్నప్రసాద వినియోగం కల్పించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇంటివద్ద అన్నదాన కార్యక్రమం చేశారు. దీనిలో భాగంగా ఆదివారం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ పీవీ.కృష్ణారెడ్డి అన్న ప్రసాద వితరణ చేశారు. మార్కెట్ సెంటర్‌లో గొలమారి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వినా యక మండపం వద్ద అన్నదానాన్ని టీడీపీ పోల్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జ్ కందుల రామిరెడ్డి, సీఐ సుబ్బారావులు ప్రారంభించారు. పేరం బజార్‌లోని గణేష్ మండపం వద్ద నుంచి వినాయ కుని భక్తిశ్రద్ధలతో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు మేళ తాళాలు డీజేల సందడి మధ్య నిమజ్జనానికి తరలాయి.
భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలు
పెద్దదోర్నాల : దోర్నాలలో గణేశుని నిమజ్జన వేడుకలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నవరాత్రుల్లో భాగంగా దేవాలయాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రధానంగా స్థానిక శ్రీవిజయ గణపతి దేవాలయంలో, రజకవీధిలో ఏర్పాటు చేసిన గణేశునికిప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజున ఆలయ అర్చకులు మూర్తి ఆధ్వర్యంలో పలువురు దంపతులు హోమాలు తదితర క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ రథంపై స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గణేశున్ని నిమజ్జనం కోసం శ్రీశైలం తరలించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు బీవీఎల్.ప్రసాద్, మొగిలి సుబ్బారావు, వెచ్చా హర గోపాల్, పీ.రామారావు, సంకా ప్రసన్న, పోలిరెడ్డి తదితులు పాల్గొన్నారు.