Share News

వైభవంగా కార్తీక సోమవారం

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:22 AM

కార్తీక సోమవారం పురస్కరించుకుని పట్టణంలోని జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు.

వైభవంగా కార్తీక సోమవారం

మార్కాపురం వన్‌టౌన్‌, నవంబరు 11 ఆంధ్రజ్యోతి: కార్తీక సోమవారం పురస్కరించుకుని పట్టణంలోని జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. అర్చకులు ఏలూరి ఆంజనేయశర్మ, వరుణ్‌ తేజ శర్మలు జగదాంబ, మార్కండేశ్వరస్వాములకు అభిషే కాలు, అర్చనలు, అలంకరణ నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి బారులు తీరారు. ఆలయంలోని నాగశిలలకు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యం లో కార్యక్రమాలు పర్యవేక్షించారు.

కంభం : కార్తీక సోమవారం సందర్భంగా అర్ధవీడు, కంభం మండలాలు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కంభం మండలంలోని రావిపాడులోని భీమేశ్వరాలయం, తురిమెళ్ళలోని కనక సురభేశ్వరాలయం, కంభంలోని కోటేశ్వరాలయం, చిన్నకంభంలోని వీరభద్రస్వామి ఆలయం, కంభం పట్టణంలోని శివాలయం, అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం, యాచవరం శివాల యాలలో అభిషేకాలు, పూజలు, కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్దలతో భక్తులు ఆధ్యాత్మిక భావనలో నిండిపోయారు. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాల యాల్లో బారులు తీరారు.

గిద్దలూరు : కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజాము నుంచే మహిళలు కార్తీక దీపాలు వెలిగించి సామూహిక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు చేశారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అధ్యక్షులు వాడకట్టు రంగసత్యనారాయణ ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గంగమ్మ, గౌరమ్మలకు మహిళలు కుంకుమార్చన చేశారు. కే.ఎస్‌.పల్లె సమీపంలోని భీమాలింగేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో శివాలయాలలో సైతం కార్తీక సోమవారం సందర్భంగా పూజలు నిర్వహించారు.

తర్లుపాడు : తర్లుపాడులో వెలసియున్న సహస్త్ర లింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం పూజలు నిర్వహించారు. అర్చకులు దేవులపల్లి శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామున కార్తీకదీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నేరెళ్ల కుమార్‌ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రసాదాలు పంపిణీ చేశారు.

Updated Date - Nov 12 , 2024 | 12:22 AM