Share News

నేటి నుంచి బంగారు బాలోత్సవాలు

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:05 AM

జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి వారం రోజులపాటు బంగారు బాల్యం కార్యక్రమం కింద బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. ఈ వారోత్సవాల నిర్వహణ, భాగస్వామ్యం, ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

నేటి నుంచి బంగారు బాలోత్సవాలు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

వారంరోజులు నిర్వహణ

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి వారం రోజులపాటు బంగారు బాల్యం కార్యక్రమం కింద బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. ఈ వారోత్సవాల నిర్వహణ, భాగస్వామ్యం, ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వారంరోజులపాటు బంగారు బాల్యానికి శ్రీకారం-బాలోత్సవాలతో ప్రారంభం, మన హక్కులు తెలుసుకుందాం, మన కోసం మనం, మా పిల్లలు- మా బాధ్యత, సదా బాలల సేవలో, మా కళలు- మా స్వప్నాలు, చేయిచేయి కలుపుదాం-బంగారు బాల్యాన్ని అందిద్దాం అనే ఇతివృత్తాలతో ప్రత్యేక కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ ర్యాలీలు, కమ్యూనిటీ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కులు, వాటి పరిరక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ పథకాలు, వాటిని పొందేందుకు అర్హతలు తదితర అంశాలపై విస్తృత స్థాయిలో అన్నివర్గాలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి పోటీలలో విజేతలకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించి ఈనెల 20న ఒంగోలులోని మినీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అలాగే జిల్లాలోని జీరో నుంచి 18ఏళ్ల బాలల హక్కుల పరిరక్షణ, వారి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేసేలా సంబంధిత శాఖల అధికారులతో గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతినెలా మొదటి శుక్రవారం గ్రామస్థాయి కమిటీ సమావేశం ఉంటుందన్నారు. రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం డివిజన్‌, నాల్గో శుక్రవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఉంటుందన్నారు. డ్రాప్‌ అవుట్‌, బాలకార్మిక, బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు అనారోగ్య బాలలను గుర్తించి ప్రతి ఒక్కరి పరిస్థితికి తగినట్లుగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. విద్యావంతమైన, ఆరోగ్యకరమైన, బాల్య వివాహ రహితమైన, బాల కార్మిక రహితమైన ప్రకాశం జిల్లా ఆవిష్కృతమయ్యేలా ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ప్రతి డివిజన్‌లోనూ ఒక మండలాన్ని ఎంపిక చేసి అందులోని గ్రామాలను చైల్డ్‌ ఫ్రెండ్లీగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేషు, వివిధ శాఖల అధికారులు మాధురి, కిరణ్‌కుమార్‌, రవికుమార్‌, వసుంధర, డాక్టర్‌ సురేష్‌కుమార్‌, సూరిబాబు, గాయత్రీదేవి, చిరంజీవి, అంజల, జమున పాల్గొన్నారు.


ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టర్‌ సమావేశం

పిల్లల బంగారు బాల్యం కోసం జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంతోపాటు బాల్య వివాహ రహిత జిల్లా ఆవిష్కృతమవడంలో ప్రైవేటు పాఠశాలలు కూడా కలిసిరావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో బుధవారం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బంగారు బాలోత్సవాలను పండుగ వాతావరణంలో అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు. విద్యతోపాటు బాలల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలన్నారు. సమావేశంలో డీఈవో కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 01:05 AM