3న గృహప్రవేశాలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:12 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాలు ప్రారంభించి పూర్తిచేసిన పక్కా గృహాల్లో ప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 3వతేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లక్ష ఇళ్లల్లో ప్రవేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో 2,750 ఇళ్లు సిద్ధం
ఏర్పాట్లలో హౌసింగ్ అధికారులు
ఎక్కడికక్కడ హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
ఒంగోలు నగరం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాలు ప్రారంభించి పూర్తిచేసిన పక్కా గృహాల్లో ప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 3వతేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లక్ష ఇళ్లల్లో ప్రవేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం జిల్లాలో 2,750 ఇళ్లను అధికారులు సిద్ధం చేశారు. కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో మంజూరైన పక్కాగృహాల నిర్మాణాలను కూడా వేగంగా చేపట్టే దిశగా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం జిల్లాలో 17,170 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా 2,750 పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల 3న చేపట్టే కార్యక్రమంలో ఆయా గృహాల్లో ప్రవేశాలు జరిపించి ఇంటి తాళాలను లబ్ధిదారులకు అప్పగించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొననున్నారు.