Share News

ఇంటింటికీ పింఛన్లు

ABN , Publish Date - Oct 31 , 2024 | 02:41 AM

జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారులకు నవంబరు ఒకటో తేదీన ఉదయం 5 గంటల నుంచే నగదు పంపిణీ చేయనున్నారు. అందుకు అవసరమైన నిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది.

ఇంటింటికీ పింఛన్లు

నేడు సెలవు.. రేపు వేకువజామున 5 గంటల నుంచి పంపిణీ

జిల్లాలో 2,87,127 మంది లబ్ధిదారులు

రూ.122.21 కోట్లు విడుదల

నవంబర్‌లో కొత్త వాటికి దరఖాస్తుల స్వీకరణ

జనవరిలో మంజూరు

ఒంగోలు నగరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారులకు నవంబరు ఒకటో తేదీన ఉదయం 5 గంటల నుంచే నగదు పంపిణీ చేయనున్నారు. అందుకు అవసరమైన నిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో మొత్తం పింఛన్‌దారులు 2,87,127 మంది ఉండగా వీరికి పంపిణీ చేసేందుకు అవసరమైన రూ.122.21 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకు విడుదల చేసింది. గురువారం దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు కావటంతో పండుగ ముందురోజే పింఛన్‌ సొమ్మును సచివాలయం సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయనున్నారు. ఆయా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సిబ్బంది ముందుగానే సమాచారం అందించే పనిలో ఉన్నారు. పింఛన్లను పంపిణీ చేసేందుకు జిల్లాలో 5,687 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 90 శాతం సచివాలయం ఉద్యోగులు ఉండగా మిగిలిన వారు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఉన్నారు.

నవంబర్‌లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. పైగా దరఖాస్తులు కూడా తీసుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లను మంజూరుచేస్తామని చెప్పి మోసం చేసింది. పాతవే 10వేల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నవంబర్‌లోనే కొత్తగా దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ ద్వారాగానీ, సచివాలయాల్లో గానీ కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందని డీఆర్‌డీఏ, వెలుగు అధికారులు భావిస్తున్నారు. ఈ దరఖాస్తులను డిసెంబర్‌లో విచారణ జరిపి జనవరిలో పింఛన్లను అందజేయనున్నట్లు ప్రభుత్వం నుంచి అందిన సమాచారం. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికే మంజూరు చేసి మిగిలిన వారికి మొండిచేయి చూపకుండా అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి జనవరి నుంచి ఫింఛన్‌ను మంజూరుచేసి అదే మాసంలో సొమ్ము కూడా అందజేయనున్నారు.


బోగస్‌ లబ్ధిదారులకు చెక్‌

జిల్లాలో సామాజిక పింఛన్ల కింద ప్రతినెలా సొమ్ము అందుకుంటున్న వారిలో వందల సంఖ్యలో బోగస్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీటిపై డిసెంబర్‌లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి బోగస్‌ పింఛన్లను రద్దు చేయనున్నారు. జిల్లాలో మొత్తం పింఛన్లు 2,87,127 ఉండగా ఇందులో 33,463 దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయి. వీరు నెలనెలా రూ.6వేలు తీసుకుంటున్నారు. ఈ పింఛన్లలో అధికంగా బోగస్‌ లబ్ధిదారులు ఉన్నారంటూ ఇప్పటికే జిల్లాలో అనేక ఫిర్యాదులందాయి. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సదరమ్‌ సర్టిఫికెట్లు తీసుకుని దొడ్డిదారిలో ఎక్కువమంది దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా చెవిటి, మూగ కేటగిరీ కింద సదరమ్‌ సర్టిఫికెట్లు తీసుకుని పింఛన్‌ పొందుతున్నారనేది ప్రధాన ఆరోపణ, వీటితోపాటు ఒంటరి మహిళ, వితంతు పింఛన్లలో కూడా అధికంగానే బోగస్‌ లబ్ధిదారులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అర్హులను పక్కనపెట్టి వైసీపీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు అక్రమంగా పింఛన్లు మంజూరుచేశారమే విమర్శలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అనర్హులను ఏరివేసి అర్హులకే పింఛన్లను అందించే దిశగా బోగస్‌ పింఛన్లను ఏరివేసే కార్యక్రమాన్ని కూడా డిసెంబర్‌లో చేపట్టి జనవరి నాటికి అర్హులైన అందరికీ పింఛన్లను అందించేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - Oct 31 , 2024 | 06:45 AM