Share News

పోతే పోనీ.. ఇంకా వస్తారు

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:02 AM

‘పోతేపోనీ.. ఇంకా వస్తారు. జనం నుంచి నాయకులు పుడతారు’ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంపై ఆపార్టీ అధినేత జగన్‌ స్పందించారు. అంతేకాక వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని నియమించారు.

పోతే పోనీ.. ఇంకా వస్తారు

బాలినేని విషయంపై జగన్‌ వ్యాఖ్య

వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి

ఒంగోలు లోక్‌సభ పరిశీలకుడిగా చెవిరెడ్డి

బాపట్ల అధ్యక్షుడిగా వెంకటేష్‌?

పర్చూరు ఇన్‌చార్జిగా గాదె

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘పోతేపోనీ.. ఇంకా వస్తారు. జనం నుంచి నాయకులు పుడతారు’ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంపై ఆపార్టీ అధినేత జగన్‌ స్పందించారు. అంతేకాక వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని నియమించారు. ఒంగో లు లోక్‌సభ పరిశీలకుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం జిల్లా నాయ కులతో భేటీ అయిన జగన్‌ వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉండా లని కరణం వెంకటేష్‌కు సూచించారు. పర్చూరు ఇన్‌చార్జిగా మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్‌రెడ్డిని నియమించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకూ ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జంకెను సమావేశానికి పిలవకపోవడం, కనీసం మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.

ప్రకాశం, బాపట్ల జిల్లా నేతలతో జగన్‌ భేటీ

బాలినేని పార్టీకి గుడ్‌బై చెప్పిన నేపథ్యం లో శుక్రవారం తాడేపల్లి లో ప్రకాశం, బాపట్ల జిల్లాల నేతలతో జగన్‌ సమావేశమయ్యారు. సమావేశంలో బాలినేని అంశం ప్రస్తావనకు రాగా పోతే పోనివ్వండి. మనకు చాలామంది ఉన్నారు అని జగన్‌ ఈజీగా కొట్టి పారేసినట్లు తెలిసింది. మధ్యలో ఒకరిద్దరు నాయకులు బాలినేనితో మీరు మాట్లడలేదా అని అడగ్గా ‘నేను చెప్పాను. పైగా జనసేనకు భవిష్యత్తు కూడా ఉండదని చెప్పాను. ఆయినా ఆయన వెళ్లాడు’ అని చెప్పినట్లు సమాచారం. తదనంతరం జిల్లాకు కొత్త అధ్యక్షుడి నియామకాన్ని జగన్‌ ప్రస్తావించగా తాముంటామని ఎవ్వరూ ముందుకు రాలేదని తెలి సింది. సమావేశానికి హాజరైన ఒకరిద్దరు నాయ కులు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో బూచేపల్లి ఆ పదవికి అర్హులని సూచించారు. వారి ప్రతిపాద నపై బూచేపల్లి కూడా సానుకూలంగా స్పందిం చలేదంటున్నారు. అయితే జగన్‌ నేను చెబుతు న్నా జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి, ఒంగోలు లోక్‌సభ పార్టీ పరిశీలకుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉంటారని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ మేరకు వారి నియామకాలకు సంబంధించి అధికారిక సమాచారాన్ని కూడా రాష్ట్ర పార్టీ ప్రకటించింది. ఎస్‌ఎన్‌పాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాగార్జున సమావేశానికి హాజ రుకాలేదని తెలుస్తోంది. బూచే పల్లితోపాటు వైపాలెం ఎమ్మె ల్యే చంద్రశేఖర్‌, మాజీ మంత్రి సురేష్‌, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, నాగార్జునరెడ్డి, కనిగిరి ఇన్‌చార్జి నారాయణ తోపాటు జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, సజ్జల ఆ సమావేశానికి హాజరయ్యారు.

బాపట్లకు వెంకటేష్‌

బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సీనియర్‌ నాయకులు కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌ను నియమించాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ జిల్లా సమావేశానికి చీరాల ఇన్‌చార్జిగా ఉన్న వెంకటేష్‌తోపాటు అద్దంకి ఇన్‌చార్జి హనిమిరెడ్డి కూడా హాజరయ్యారు. పర్చూరు ఇన్‌చార్జి బాలాజీ విదేశాల్లో ఉన్నందున గైర్హాజరయ్యారు. వెంకటేష్‌ను బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని జగన్‌ సూచించారు. తన తండ్రి బలరాంతోపాటు నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడి చెబుతానని, రెండు రోజులు అధికారికంగా ప్రకటించవద్దని వెంకటేష్‌ చెప్పగా ఆ ప్రకటన ఆగిపోయింది. పర్చూరు ఇన్‌చార్జి బాలాజీ స్థానంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డి నియామకానికి జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నేడో.రేపో ఆయన నియామకం వెలువడనుంది.

Updated Date - Sep 21 , 2024 | 01:02 AM