వెలిగొండను పూర్తి చేయకుంటే ప్రజాఉద్యమమే
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:13 AM
వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశానికి వరప్రసాదిని అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హెచ్చరించారు.
గత వైసీపీ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసింది
ప్రస్తుత కేటాయింపులు జీతభత్యాలు, పెండింగ్ బిల్లులకు సరిపోవు
సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
మార్కాపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశానికి వరప్రసాదిని అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హెచ్చరించారు. ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపోరుయాత్రలో భాగంగా మంగళవారం ఆ పార్టీ నాయకులు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ 1996లో నేటి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. మూడు దశాబ్దాలు కావస్తున్నా నేటికీ ఒక్క చుక్క కూడా నీరు కూడా పారని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లను ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారన్నారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందన్నారు. పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం, బడ్జెట్‌లలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ ప్రాంత భూగర్భ జలాల్లో ఎంతో ప్రమాదకరమైన ఫ్లోరిన్, స్టోనియంలాంటి దాతువులతో ప్రజలు కిడ్నీ వ్యాధులు, కీళ్లు పెలుసుబారిపోవడంలాంటి వ్యాధుల బారినపడుతున్నారన్నారు. ఈ సమస్యలన్నింటికీ వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే పరిష్కార మార్గమన్నారు. గత ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల్ని నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నా మొదటి దశ పూర్తి చేసినట్లు శిలాఫలకాలు వేసి జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. రెండు టన్నెల్స్‌లో గత ఐదేళ్లలో ఇష్టారీతిన పనులు జరిగాయని చెప్పారు. నిబందనలకు విరుద్ధంగా ఒకటో టన్నెల్ నుంచి రంద్రాలు వేసి రెండో టన్నెల్‌లో తవ్విన మట్టిని పోశారన్నారు. అంతేకాక రెండో టన్నెల్ పనుల్లో కూడా చాలా అవినీతి చోటు చేసుకుందన్నారు. ఈ మధ్యనే ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఆశలు చిగురించాయని చెప్పారు. రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రులు చెప్పారన్నారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు వారి వివక్ష పూరిత వైఖరిని చాటి చెప్పిందని విమర్శించారసు. ఆ నిధులు ఉద్యోగులు జీతభత్యాలు, పెండింగ్ బిల్లులకే సరిపోతాయన్నారు. ప్రధానంగా మొదటి టన్నెల్‌లో చివర 1.5 కిలోమీటర్ల మేర లైనింగ్, ఫీడర్ కెనాల్‌ను పటిష్టంగా నిర్మించడం, నిర్వాసితులకు ప్యాకేజీలాంటి వాటికి రూ.1,500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన మొదటి దశ పనులు పూర్తిచేసి జలాశయంలో నీటిని నింపాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పోలవరం కంటే వెలిగొండకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిర్వాసితుల్లో ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.