Share News

జిల్లాపై అల్పపీడన ప్రభావం

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:23 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాపై కనిపిస్తోంది. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. రోజంతా తెరపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నా యి. చలి తీవ్రత కూడా పెరిగింది.

జిల్లాపై అల్పపీడన ప్రభావం

తూర్పు ప్రాంతంలో ముసురుపట్టి జల్లులు

అవస్థ పడుతున్న ప్రజలు

క్రిస్మస్‌ కొనుగోళ్లపైనా ప్రభావం

పంటలు దెబ్బతింటాయని రైతుల ఆందోళన

ఒంగోలు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాపై కనిపిస్తోంది. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. రోజంతా తెరపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నా యి. చలి తీవ్రత కూడా పెరిగింది. ఉదయం నుంచి ఒంగోలుతోపాటు టంగుటూరు, సింగరాయకొండ, కొండపి, మద్దిపాడు, కొత్తపట్నం, సంతనూ తలపాడు, చీమకుర్తి, నాగులుప్పల పాడు, పొదిలి, తాళ్లూరు తదితర మండలాల్లోని పలుగ్రామాల్లో జల్లులు పడుతుండటంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. ప్రత్యేకించి స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లేవారు, వీధి వ్యాపారులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. క్రిస్మస్‌ కొనుగోళ్లపైనా తీవ్ర ప్రభావం కనిపించింది. బుధవారం క్రిస్మస్‌ పర్వదినం కాగా సాధారణంగా ముందు రోజున పెద్దఎత్తున వస్త్రాలు, స్వీట్లు, చెప్పులు, క్రిస్మస్‌ అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధాన పట్టణాలలో ఈ తరహా వ్యాపార సంస్థలు కిటకిటలాడుతుంటాయి. కానీ జల్లులు ఇబ్బందికరంగా మారాయి. తెరపి లేకుండా కురుస్తున్న జల్లులతో జనం రోడ్లపై తిరిగేందుకు వీలుకాలేదు.


వణికిపోతున్న రైతులు

అల్పపీడన ప్రభావంతో జిల్లాలో బుధ, గురువారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రధాన పంటలన్నింటిపైనా వర్షాలు, ఆ తరహా వాతావరణంతో తెగుళ్లు, పురుగులు ఉధృతి పెరిగి నష్టపోతున్నారు. సాధారణంగా ఈ సమయంలో తెల్లవారుజామున మంచు కురవడం తప్ప వర్షాలు పడవు. అలాంటిది ముసురు పట్టి జల్లులు కురుస్తుండటంతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుప్రాంతాల్లో ఇటీవల వేసిన లేత పొగ తోటలు, శనగ మొలకలు ఉరకెత్తి దెబ్బతినే పరిస్థితి ఉండగా, కోతకు వచ్చిన మిర్చి, వరి ఇతర పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది.

Updated Date - Dec 25 , 2024 | 01:23 AM