Share News

జిల్లాపై తుఫాన్‌ ప్రభావం

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:34 AM

జిల్లాకు ఫెంగల్‌ తుఫాన్‌ ముప్పు తప్పినప్పటికీ ప్రభావం మాత్రం కనిపిస్తోంది. రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి చలిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం మరింత అధికమైంది. అదేసమ యంలో సాయంత్రం నుంచి జిల్లాలో ప్రత్యేకించి తూర్పు, దక్షిణ ప్రాంతాలలో జల్లులు ప్రారంభమయ్యాయి.

జిల్లాపై తుఫాన్‌ ప్రభావం
ఒంగోలులో కురుస్తున్న వర్షం

పలుచోట్ల జల్లులు

నేడు ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం

చలి వాతావరణంతో పంటలపై తెగుళ్ల దాడి

ఆందోళనలో అన్నదాతలు

ఒంగోలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు ఫెంగల్‌ తుఫాన్‌ ముప్పు తప్పినప్పటికీ ప్రభావం మాత్రం కనిపిస్తోంది. రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి చలిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం మరింత అధికమైంది. అదేసమ యంలో సాయంత్రం నుంచి జిల్లాలో ప్రత్యేకించి తూర్పు, దక్షిణ ప్రాంతాలలో జల్లులు ప్రారంభమయ్యాయి. శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్నిచోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే శ్రీలంక, తమిళనాడు మధ్య అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలపడుతూ తుఫాన్‌గా మారింది. దానికి ఫెంగల్‌ అని పేరు పెట్టారు. తొలుత చెన్నైకి సమీపంలో ఉత్తర ప్రాంతంలో తుఫానుగా మారి తీరం దాటుతుందని, దీనివల్ల జిల్లాలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తద్వారా జిల్లాపై ఫెంగల్‌ ముప్పు ఉంటుందని భావించారు. అయితే తుఫాన్‌ దిశ మారడంతో జిల్లాకు ముప్పు తప్పిందని శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు చెన్నైకి ఆగ్నేయంగా 38కి.మీ దూరంలో ఉంది. శనివారం మధ్యాహ్యానికి తమిళనాడులోని కరైకల్‌-మహాబలిపురం ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉండగా రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలపై అధిక ప్రభావం చూపనుంది.

ప్రారంభమైన జల్లులు

ఒక రకంగా జిల్లాకు ఫెంగల్‌ తుఫాన్‌ ముప్పు తప్పిపోగా శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లాలో వర్షం ప్రారంభమైంది. ఒంగోలు, కొండపి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాలతోపాటు కనిగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. శనివారం ఒక మోస్తరు వానలే పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారం. అయితే వర్షం కొన్ని ప్రాంతాలలో అవసరం కాగా కొద్దిపాటిగా పడితే ఉపయోగమేకాని ఎక్కువగా కురిస్తే మాత్రం తీవ్రంగా నష్టపోతామని రైతులు చెప్తున్నారు భారీ వర్షం కురిస్తే ఇటీవల వేసిన పొగాకు, శనగ దెబ్బతినే అవకాశంతో పాటు తూర్పు ప్రాంతంలో ఆ పంటలు సాగు మరింత ఆలస్యం కానుంది.


పెరిగిన చలి తీవ్రత

తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో నాలుగు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. తెల్లవారుజాము నుంచి చలి అధికంగా ఉంటుండగా తూర్పు దక్షణ ప్రాంతంలో పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గి మబ్బులు కమ్మి చలిగాలులు వీస్తున్నాయి. అదేసమయంలో పొలంలో ఉన్న పంటలపై తెగుళ్లు దాడి పెరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి, పొగాకు వంటి పంటలపై తెగుళ్లు తీవ్రత పెరిగింది. పూతకు వచ్చిన కంది పంటపై కూడా పలు ప్రాంతాలలో పురుగు తాకిడి పెరిగినట్లు చెప్తున్నారు. మొత్తం మీద పంటలపై వర్షాల కన్నా చలి వాతావరణం ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

Updated Date - Nov 30 , 2024 | 01:34 AM