వీడని వాన
ABN , Publish Date - Dec 05 , 2024 | 02:06 AM
జిల్లాను వాన వీడలేదు. ఆదివారం రాత్రి నుంచి అత్యధిక ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. ఐదురోజులు ముందు నుంచి తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పు వచ్చి పంటలపై తెగుళ్లు, పురుగుల దాడి పెరిగింది. మూడు రోజులుగా పడుతున్న వర్షాలు, తాజా వాతావరణ పరిస్థితితో అవి మరింత ఉధృతమ య్యాయి.
మూడు రోజుల్లో 45.10 మి.మీ సగటు వర్షపాతం
సగం మండలాల్లో భారీ వర్షం
దక్షిణ, తూర్పుప్రాంతంలో అధికం
దెబ్బతింటున్న పొగాకు, శనగ, ఇతర పైర్లు
మరింత ఉధృతంకానున్న తెగుళ్లు
పంట దిగుబడులపైనా తీవ్ర ప్రభావం
ఒంగోలు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి)/కలెక్టరేట్ : జిల్లాను వాన వీడలేదు. ఆదివారం రాత్రి నుంచి అత్యధిక ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. ఐదురోజులు ముందు నుంచి తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పు వచ్చి పంటలపై తెగుళ్లు, పురుగుల దాడి పెరిగింది. మూడు రోజులుగా పడుతున్న వర్షాలు, తాజా వాతావరణ పరిస్థితితో అవి మరింత ఉధృతమ య్యాయి. ప్రధానంగా కంది, మిర్చి, ముదురు పొగతోటలు, మినుము వంటి పంటలపై చీడపీడల తీవ్రత అధికంగా ఉంది. దాని వల్ల పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో లేత పొగాకు తోటలు, శనగ, వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఆదివారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మూడు రోజుల్లో 45.10 మి.మీ సగటు వర్షపాతం జిల్లాలో నమోదైంది.
సీఎస్‌పురం మండలంలో అత్యధికం
సాధారణంగా డిసెంబరులో పెద్దగా వర్షాలు ఉండవు. కానీ ఈసారి నెల మొత్తం సగటు కన్నా అధికంగా పడింది. ప్రత్యేకించి జిల్లా దక్షిణ, తూర్పు ప్రాంతంలోని కనిగిరి, కొండపి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాలతోపాటు గిద్దలూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో భారీ వర్షాలే కురిశాయి. అత్యధికంగా సీఎస్‌పురం మండలంలో ఈ మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 139.40 మి.మీ వర్షపాతం నమోదైంది. వెలిగండ్లలో 128.60, పీసీపల్లిలో 91.8, పామూరులో 91.20, కొమరోలులో 89.20, కనిగిరిలో 78.40, హెచ్‌ఎంపాడులో 75.70, కొండపిలో 75.6, పొన్నలూరులో 74.60, గిద్దలూరులో 73.0, మద్దిపాడులో 70.7, ఎన్‌జీపాడులో 58.20, సింగరాయకొండలో 54.80 మి.మీ నమోదైంది. కొత్తపట్నం 54.40, జరుగుమల్లి 47.90, కంభంలో 46.35, ఎస్‌ఎన్‌పాడులో 46.0, ఒంగోలులో 41.20 మి.మీ కురిసింది. మరో పది మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొగాకు మొక్కలు, శనగ పైరు నీటిలో మునిగిపోయాయి. పొట్టదశలో ఉన్న వరి నేల వాలింది. కొన్నిచోట్ల వరినాట్లు కూడా నీట మునిగాయి. మినుము, అలసందలో కూడా అక్కడక్కడా నీరు నిలిచింది. దీంతో వేలాది ఎకరాల్లో పైర్లు ఉరకెత్తి దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వర్షం కాస్తంత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం మిర్చి, కంది ఇతర పంటలపై తెగుళ్లు, పురుగుల ఉధృతి మరింత పెరిగాయి. దీంతో దిగబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముదురు పొగతోటలలో వర్షాలకు ఆకులపై ఉన్న మడ్డి కారిపోయి నాణ్యత గణనీయంగా తగ్గి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. బుధవారం పగటిపూట కూడా జిల్లాలోని పలుప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది.
జిల్లాలో 2,198 హెక్టార్లలో పంటలకు నష్టం
జిల్లాలో తాజా వర్షాలతో పలురకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, వెలిగండ్ల, సీఎస్‌పురం, పామూరు, గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలాల్లో పలు రకాల పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 64 గ్రామాల్లోని 2,115 మంది రైతులకు చెందిన 2,198 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు గుర్తించారు. అందులో శనగ 1,547 హెక్టార్లు, వరి 54 హెక్టార్లు, మినుము 512 హెక్టార్లు, కంది 85 హెక్లార్లు ఉంది. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించారు.
---------------------------------