వీడని వర్షం.. ఆగిన మగ్గం
ABN , Publish Date - Nov 14 , 2024 | 10:50 PM
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మంగు వాతావరణంతో నేతన్నల మగ్గాలు ఆగాయి. పని కుంటుపడింది. చేనేత ఉపవృత్తుల పనులు ఆగాయి. దీంతో రోజువారీ మజూరీతో జీవనం సాగించే సగటు చేనేత కార్మికులు భృతికి ఇబ్బంది పడుతున్నారు.
ఆదుకోవాలని వేడుకుంటున్న నేతన్నలు
చీరాల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి) : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మంగు వాతావరణంతో నేతన్నల మగ్గాలు ఆగాయి. పని కుంటుపడింది. చేనేత ఉపవృత్తుల పనులు ఆగాయి. దీంతో రోజువారీ మజూరీతో జీవనం సాగించే సగటు చేనేత కార్మికులు భృతికి ఇబ్బంది పడుతున్నారు. వర్షం కురిసినా, మంగు వాతావరణం ఉన్నా మగ్గం పనికి ఆటంకమే. పోగు అతకదు. పని సాగదు. ఇక ఉప వృత్తులలో పడుగులు, పాగళ్లుకు సంబంధించిన పనులు పూర్తిగా ఆగిపోతాయి. పెద్ద రకాలు నేసే నేతన్నలకు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. కొన్ని రోజులు పని ఆగినా వారు తట్టుకోగలరు. అయితే సాధారణ కార్మికులు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు అన్నట్లు వారి భృతి ఉంటుంది. ఈ క్రమంలో పని ఆగితే వారు అప్పులు చేసే పరిస్థితే. ఇదిలావుంటే కొద్దిరోజులుగా వాతావరణ మార్పులతో జలుపు, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. అలా వ్యాధిన పడినవారి వైద్య ఖర్చులు, పని ఆగిపోవడంతో రెండు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తగిన సాయం అందించాలని నిరుపేద నేతన్నలు కోరుతున్నారు.