Share News

డీసీసీబీలో విచారణ ప్రారంభం

ABN , Publish Date - Nov 07 , 2024 | 02:33 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి, అక్రమాలపై ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇందుకోసం నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ బుధ వారం సాయంత్రం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది.

డీసీసీబీలో విచారణ ప్రారంభం
ఒంగోలులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం

రంగంలోకి దిగిన త్రిసభ్య కమిటీ

పలు ఫైళ్ల పరిశీలన.. ఆరా తీసిన జేసీ

ఇన్‌చార్జి సీఈవోగా రాఘవయ్యకు బాధ్యతలు

ఒంగోలు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి, అక్రమాలపై ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇందుకోసం నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ బుధ వారం సాయంత్రం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది. బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ స్థాయిలో కదలిక వచ్చిన నేపథ్యంలో ప్రాథమికంగా ముగ్గురు సభ్యుల కమిటీని విచారణకు నియమించారు. అది సజావుగా సాగేందుకు సీఈవో కోటిరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ కోసం సెక్షన్‌ 51 విచా రణ చేయించాలని ప్రభుత్వాన్ని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా కోరిన నేపథ్యంలో కొంత ఆలస్యంగా అయినా తదనుగుణ చర్యలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటివరకు సీఈవోగా ఉన్న కోటిరెడ్డి మంగళవారం రాత్రి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజీనామా లేఖను బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి అయిన జేసీ గోపాలకృష్ణకు అందజేశారు. దీంతో ప్రస్తుతం బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా ఉన్న కుంభా రాఘవయ్యకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

ముగ్గురు అధికారులతో విచారణ

కలెక్టర్‌ తన లేఖలో కోరిన సెక్షన్‌ 51 విచారణ వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు సమాచారం. అందుకు వీలుగా డీసీసీబీలో విచారణ ప్రారంభంఉన్నతాధికారులు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోరారు. సాధారణంగా అలాంటి నివేదికు జిల్లా సహకారశాఖ అధికారులు ఇస్తారు. అయితే బ్యాంకు సంబంధించిన వ్యవహారంలో ఇక్కడి సహకారశాఖ అధికారులు తనను తప్పుదోవ పట్టించారన్న ఆగ్రహంతో కలెక్టర్‌ ఉన్నారు. మరోసారి ప్రాథమిక విచారణ బాఽధ్యతను వారికి ఇస్తే ప్రమాదంగా భావించి ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించారు. రెవెన్యూలో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారైన లోకేశ్వరరావు నేతృత్వంలో జిల్లా ఆడిట్‌ అధికారి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ (ఎల్‌డీఎం) సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు.


ఫైళ్లను పరిశీలించిన కమిటీ

ప్రభుత్వానికి గతంలో అందిన ఫిర్యాదులతోపాటు తాజాగా మరికొన్ని ఆర్థికపరమైన అవకతవకలు కూడా కలెక్టర్‌ దృష్టికి రావడంతో వాటన్నింటినీ పరిశీలించాలని సూచించారు. తదనుగుణంగా లోకేశ్వరరావు నేతృత్వంలోని ముగ్గురు కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం డీసీసీబీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పలు పైళ్లను పరిశీలించారు. ఇదిలా ఉండగా పర్సన్‌ ఇన్‌చార్జి అయిన జేసీ గోపాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం బ్యాంకుకు వెళ్లి ఒకరిద్దరు కీలక అధికారులను పిలిచి గతంలో బ్యాంకులో జరిగిన బంగారు రుణాల అక్రమాలు, అప్పట్లో జరిగిన అవకతవకలు, విచారణలు, తదనంతర చర్యలు, ఇతరత్రా అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం.

Updated Date - Nov 07 , 2024 | 02:33 AM