Share News

పెరల్‌ డిస్టిలరీలో తనిఖీలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:25 AM

మండ లంలోని పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన పెరల్‌ డిస్టిలరీలో సీఐడీ, ఎక్సైజ్‌ అధికారులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ సీఐడీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 10 మంది సిబ్బంది ఉదయం 9 గంటలకు సోదాలను ప్రారంభించి రాత్రి వరకూ కొనసాగించారు.

పెరల్‌ డిస్టిలరీలో తనిఖీలు
పాత సింగరాయకొండ సమీపంలోని పెరల్‌ డిస్టిలరీ

డీఎస్పీ ఆధ్వర్యంలో 15 మంది సిబ్బంది ముమ్మర సోదాలు

రాత్రి వరకూ కొనసాగింపు

వైసీపీ ప్రభుత్వంలో చేసిన మద్యం ఉత్పత్తిపై ఆరా

క్షుణ్ణంగా రికార్డుల పరిశీలన

ముఖ్యమైనవి కొన్ని స్వాధీనం

సింగరాయకొండ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన పెరల్‌ డిస్టిలరీలో సీఐడీ, ఎక్సైజ్‌ అధికారులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ సీఐడీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 10 మంది సిబ్బంది ఉదయం 9 గంటలకు సోదాలను ప్రారంభించి రాత్రి వరకూ కొనసాగించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఉత్పత్తికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వం (2019-24)లో మద్యం తయారీ కంపెనీల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. వైసీపీ అధినేతలు కొందరు బినామీల ద్వారా కొన్ని లిక్కర్‌ కంపెనీలను స్వాధీనం చేసుకొని నాసిరకం మద్యాన్ని ఉత్పత్తిచేసి అధిక ధరలకు అమ్మి రూ.వేలకోట్లు కొల్లగొట్టారు. వైసీపీకి చెందిన వారి బినామీ కంపెనీలలో పెద్దఎత్తున మద్యం ఉత్పత్తి చేశారు. వారికి లొంగని కంపెనీల్లో మాత్రం ఉత్పత్తి అమాంతంగా పడిపోయింది. దీంతో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల నిగ్గుతేల్చడానికి తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎంపీ మాగుంటకు చెందిన పెరల్స్‌ డిస్టిలరీలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు 10 లక్షల కేసుల మద్యం ఉత్పత్తి జరిగేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేవలం రోజుకు 1 లక్ష నుంచి 2 లక్షల మద్యం కేసులు మాత్రమే ఉత్పత్తి చేశారు. దాదాపు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ 80 శాతం ఉత్పత్తి తగ్గిపోయింది. నాటి సర్కారు బినామీ కంపెనీలకు పలురకాల బ్రాండ్ల ద్వారా నాసిరకం మద్యం ఉత్పత్తికి విరివిగా అనుమతివ్వగా మిగతా కంపెనీలకు వారి పాత బ్రాండ్ల ఉత్పత్తికి అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు కారణమైంది. దీంతో కంపెనీ ఉత్పాదక సామర్థ్యంలో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. ఆనాటి వైసీపీ ప్రభుత్వం అనైతిక నిర్ణయాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రంలో పలు డిస్టిలరీలలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో వైసీపీ కీలక నేతల్లో కలవరం మొదలైంది.

Updated Date - Oct 23 , 2024 | 01:25 AM