ఎస్సీ మహిళలకు వడ్డీలేని రుణాలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 01:20 AM
పొదుపు సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఉన్నతి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని కింద రూ.లక్షకుపైన రుణం తీసుకొని స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం అజయ్ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.50వేలు సబ్సిడీ కూడా ఇవ్వనుంది.
పొదుపు గ్రూపుల్లోని సభ్యులకు మంజూరు
ఉన్నతి పథకం ద్వారా ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఒక్కొక్కరికి రూ.50 వేల సబ్సిడీ
ఆ మొత్తం పీఎం అజయ్ పథకం కింద విడుదల
లబ్ధిదారుల ఎంపికలో అధికారుల జాప్యం
ఒంగోలు నగరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : పొదుపు సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఉన్నతి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని కింద రూ.లక్షకుపైన రుణం తీసుకొని స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం అజయ్ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.50వేలు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని ఎస్సీ మహిళల ఖాతాలకు నేరుగా కేంద్రమే జమచేయనుంది. ఉన్నతి పథకం కింద వడ్డీలేని రుణం తీసుకున్న వారు దాన్ని పూర్తిగా తీర్చిన తర్వాతనే కేంద్రం ఇచ్చే సబ్సిడీ బ్యాక్ ఎండ్ విధానంలో అందుతుంది. ఈ పథకం కింద జిల్లాలోని 109 మంది ఎస్సీ మహిళలకు లబ్ధిచేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరికి ముందుగా వెలుగు ద్వారా ఉన్నతి పథకం కింద రుణాలు మంజూరు చేసి ఆ వివరాలను ఎస్సీ కార్పొరేషన్‌కు అందజే స్తారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పీఎం అజయ్ పథకం కింద సబ్సిడీని చెల్లిస్తారు. ఉన్నతి పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలోని 38 మండలాల్లో 109 మంది మహిళలను గుర్తించాల్సి ఉండగా ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఈ విషయంలో డీఆర్‌డీఏ, వెలుగు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.