ఉద్యోగోన్నతుల్లోనూ అక్రమాలు
ABN , Publish Date - Nov 12 , 2024 | 01:43 AM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఉద్యోగోన్నతుల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఇదేవిషయమై ఇద్దరు ఉద్యోగులు సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి ఫిర్యాదు చేశారు.
లంచాలు ఇచ్చిన వారికే ప్రాధాన్యం
కలెక్టర్‌కు పీడీసీసీ బ్యాంకు ఉద్యోగుల ఫిర్యాదు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఉద్యోగోన్నతుల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఇదేవిషయమై ఇద్దరు ఉద్యోగులు సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి ఫిర్యాదు చేశారు. అనేకమంది నిజాయితీ కలిగిన ఉద్యోగులు పాలకవర్గాలకు లంచాలు ఇవ్వలేక ఉద్యోగోన్నతులు కోల్పోయారని బ్యాంకు ఉద్యోగి అయిన మంచికలపాటి లలిత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అందులో తాను కూడా ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో స్టాఫ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 2015లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగోన్నతి పొంది పనిచేస్తున్నానని తెలిపారు. 2022 మే, జూన్ నెలల్లో ఒకసారి, అదే సంవత్సరంలో నవంబరు, డిసెంబరుల్లో మరోసారి ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. తన తర్వాత చేరిన కొంతమంది ఉద్యోగులకు, జూనియర్లకు మేనేజర్లుగా, చీఫ్ మేనేజర్లుగా ఆరునెలల వ్యవధిలోనే ఉద్యోగోన్నతి ఇచ్చారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు. బ్యాంకులో జరిగిన అవినీతిలో పాలకవర్గాలే కాకుండా అందులో పనిచేసే అనేకమంది ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని ఆమె కలెక్టర్‌కు చెప్పారు.
సమగ్ర విచారణ చేయాలి
గతేడాది సెప్టెంబరు, ఈ ఏడాది ఫిబ్రవరి నెలల్లో పీడీసీసీ బ్యాంకులో ఇచ్చిన ఉద్యోగోన్నతుల్లో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ మహబూబ్ సుభాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియారిటీ జాబితాలో తనకన్నా జూనియర్స్ దగ్గర లంచాలు తీసుకొని తనకు అన్యాయం చేశారన్నారు. బ్యాంకులో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఉద్యోగుల ప్రమోషన్లతో పాటు బ్యాంకులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.