భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు
ABN , Publish Date - Nov 04 , 2024 | 11:43 PM
పవిత్రమైన కార్తీకమాసంలో వచ్చిన సోమవారాన్ని మార్కాపురం పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్, నవంబరు 4 ఆంధ్రజ్యోతి: పవిత్రమైన కార్తీకమాసంలో వచ్చిన సోమవారాన్ని మార్కాపురం పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక శ్రీజగదాంబ సమేత మార్కండేశ్వరస్వామి ఆలయం వద్ద తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామి దర్శనానికి బారులు తీరారు. అర్చకులు ఏలూరి ఆంజనేయశర్మ, రెంటచింతల వరుణ్‌తేజశర్మలు మార్కండేశ్వరస్వామి, జగదాంబ మాతలకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. నాగ శిలలకు పాలపోసి కార్తిక దీపాలు వెలిగించి నోములు నోచారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలు ఆలయాలు, ఇళ్ల వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.
కార్తీక మాస పూజలు
గిద్దలూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కార్తీక మాస తొలి సోమవారం శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణకాశిగా పేరొందిన గిద్దలూరులోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వచ్చారు. దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకున్నారు. పాతాళ నాగేశ్వరస్వామి వారికి పలువురు దంపతులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. దేవస్థాన ఈవో శ్రీనివాసులు ఆయా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కే.ఎస్‌పల్లిలోని శ్రీభీమలింగేశ్వరస్వామి దేవస్థానంలో, పలుపులవీడు, ముండ్లపాడు శివాలయాలలో కార్తీక సోమవార పూజలు నిర్వహించారు. గిద్దలూరులోని కుసుమ హరనాథ మందిరంలో సామూహికంగా అభిషేక కార్యక్రమాలు చేశారు. వాసవి కన్యకాపరమేశ్వరి, వేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలలో గంగమ్మ, గౌరమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయాంజనేయస్వామి దేవాలయం, షిర్డిసాయిబాబా దేవాలయంలలో సైతం కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు.
ఘనంగా కార్తీక సోమవారం పూజలు
కంభం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కంభం, అర్ధవీడు మండలాలలో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలు వద్ద భక్తులు బారులు తీరారు. సోమవారం తెల్లవారుజామున 4గంటల నుంచే మండలంలోని చిన్నకంభం వీరభద్రస్వామి ఆలయం, రావిపాడు కోటేశ్వరస్వామి దేవాలయం, తురిమెళ్లలోని కనక సురభేశ్వరస్వామి దేవాలయాలలో భక్తులు స్వామి వార్లకు అభిషేకాలు చేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా శివాలయాల వద్ద భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు అన్నప్రసాదాలు అందించారు.