Share News

ఖబడ్దార్‌!

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:17 AM

అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాలకు అధికార వైసీపీ తెరతీసింది. అవసరమైతే నేరుగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ నాయకులను పిలిపించుకుని ఖబడ్దార్‌ జాగ్రత్త! అని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

ఖబడ్దార్‌!

వైసీపీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయం

నేరుగా సీఎంనే రంగంలోకి..

కొందరికి పదవులు, మరికొందరికి బెదిరింపులు

అసమ్మతిని బుజ్జగించేందుకు జగన్‌ మార్క్‌ పంథా

చక్రం తిప్పుతున్న ఒంగోలు ఎంపీ అభ్యర్థి

అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాలకు అధికార వైసీపీ తెరతీసింది. అవసరమైతే నేరుగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ నాయకులను పిలిపించుకుని ఖబడ్దార్‌ జాగ్రత్త! అని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. కొందరి వ్యాపారాలు, అందులో లొసుగులను ప్రస్తావిస్తూ ముందుగా సంకేతాలు పంపుతున్నారు. అనంతరం వారితో నేరుగానే అధినాయకులు మాట్లాడి హెచ్చరికలు జారీచేస్తూ సరికొత్త రాజకీయానికి తెరలేపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల ఈ వ్యవహారం శ్రుతిమించింది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వైసీపీ అధిష్ఠానం సరికొత్త రాజకీయానికి తెరలేపింది. మాట వింటే ఓకే.. లేకుంటే బెదిరింపులకు తెగబడుతోంది. చిన్నాచితక పదవులతో సరిపెట్టుకోవడం లేదా భవిష్యత్‌లో న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి పనిచేస్తే సరి! లేకుంటే అసలుకే ఎసరు పెడతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అవకాశం లభించని పలువురు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. వారిలో కొందరిని పార్టీ, నామినేటెడ్‌ పదవులతో బుజ్జగించారు. అందుకు అవకాశం లేనివారిని, చిన్నాచితక పదవులకు లొంగని వారిని బెదిరించడం ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సిటింగ్‌ ఎమ్మెల్యేలలో ముగ్గురికి, మాజీలలో నలుగురికి పార్టీ టికెట్ల విషయంలో అధిష్ఠానం మొండిచేయి చూపింది. వారిలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి హడావుడిగా ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. అదే నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకుడు ఆలీబేగ్‌కు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు ఇచ్చేశారు. టికెట్ల లభించక అసమ్మతితో ఉన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఆ పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. తాజాగా ఆయన వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిసి ఆయన వ్యాపారాలపై దృష్టిసారించారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయకపోయినా వెళ్లిన పార్టీ నాయకులతో మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. ఆయనకు స్థానికంగా వ్యాపారాలు ఏమీ లేవు. వైసీపీ అద్దంకి మాజీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య టికెట్‌ లభించక అలకపాన్పు ఎక్కగానే ఆయన గ్రానైట్‌ క్వారీపై దాడులు నిర్వహించి నోటీసులు జారీచేశారు. క్వారీ మూసేసిన చైతన్య టీడీపీలో చేరిపోయారు.

కొత్త ఒరవడికి శ్రీకారం

బెదిరింపుల వ్యవహారం బెడిసికొట్టడంతో మిగిలిన నాయకులను నేరుగా జగనే పిలిపించి మాట్లాడేందుకు శ్రీకారం పలికారు. తొలుత కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావుపై బెదిరింపు అస్త్రం ప్రయోగించారు. టికెట్‌ లభించని ఆయన అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి వచ్చే ఊహాగానాలను బయటకు వదిలారు. తర్వాత తన మిత్రుడైన సినీనటుడు బాలకృష్ణ ద్వారా టీడీపీ వైపు దృష్టిసారించారని వార్తలొచ్చాయి. వెంటనే వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. బాబూరావును సీఎం వద్దకు తీసుకెళ్లారు. బాబూరావుకు కనిగిరి నియోజకవర్గంలో ఫార్మసీ కళాశాల ఉంది. ఆయన వియ్యంకుడికి విశాఖపట్నం వద్ద ఫార్మా కంపెనీలున్నాయి. ఈనేపథ్యంలో అనేక అంశాలను గుర్తుచేస్తూ అధిష్ఠానం నుంచి సంకేతాలు ఇచ్చి సీఎంను కలిపి ఆయనను సైలెంట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

శిద్దా సైలెంట్‌

తాజాగా మాజీమంత్రి శిద్దా రాఘవరావును కూడా జగన్‌ వద్ద హాజరుపరిచారు. గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన శిద్దా గ్రానైట్‌ సంస్థలపై జగన్‌ ప్రభుత్వం ఆరంభంలోనే దాడి చేసింది. సుమారు రూ.300 కోట్ల జరిమానాలను విధించింది. క్వారీలలో పనులు నిలిపివేసింది. టీడీపీ ఎమ్మెల్యే అయిన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలపైనా అలాంటి చర్యలే తీసుకున్నారు. వెంటనే శిద్దా వైసీపీలో చేరడంతో జరిమానా నోటీసులు పక్కనపెట్టి క్వారీలు నడుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. పార్టీ మారని రవికుమార్‌, రామారావుల క్వారీలు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తాజాగా టీడీపీలో చేరాలన్న ఆలోచనతో శిద్దా కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వైసీపీలో దర్శి టికెట్‌ ఆశించి విఫలమైన ఆయన టీడీపీలో వచ్చే అవకాశం ఉండటంతో మంతనాలు ప్రారంభించారు. బుధవారం ఆయన టీడీపీ అధినాయకులను కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హడావుడిగా మంగళవారం ఆయన్ను సీఎంవో అధికారులు పిలిపించి జగన్‌ ముందు హాజరుపరిచారు. గ్రానైట్‌ క్వారీలకు, కంపెనీలకు గతంలో ఇచ్చి పెండింగ్‌లో ఉన్న నోటీసుల వ్యవహారం చర్చకు తెచ్చినట్లు తెలిసింది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆర్థిక వనరులకు ఎదురయ్యే సమస్యలను కూడా పరోక్షంగా ముందుగానే ఆయన దృష్టికి తీసుకెళ్లి తర్వాత సీఎం ముందు ప్రవేశపెట్టినట్లు సమాచారం. సీఎం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి అవకాశం ఇస్తానంటూ పరోక్షంగా కొన్ని సమస్యలను ప్రస్తావించి పంపినట్లు తెలిసింది. దీంతో శిద్దా, ఆయన కుటుంబసభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ ఆలోచన విరమించుకుని సైలెంట్‌ అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే ఆమంచిపైనా కన్ను

చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి స్వంతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి వ్యవహారాలను, చీరాలలో ఆయన సంస్థలలో ఉన్న లొసుగులను అప్పట్లోనే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సొంత పార్టీ వారే జగన్‌కు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. అయినా పట్టించుకోని అధిష్ఠానం ఇప్పుడు చీరాలలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి రాబోతున్న తరుణంలో కొరడా ఝులిపిస్తోంది. ఆమంచికి చెందిన క్రిస్టల్‌ సీ ఫుడ్స్‌, ఆయన సమీప బంధువులకు చెందిన హేచరీలకు సంబంఽధించి సుమారు రూ.5.82కోట్ల విద్యుత్‌ బకాయి ఉంది. గతంలో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టి దశలవారీ బకాయి చెల్లింపునకు అనుమతి తెచ్చుకున్నారు. అప్పుడు చేయూతనిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్‌ శాఖ ద్వారా బకాయిల వసూళ్లకు ఒత్తిడి పెంచింది. మరోవైపు ఆయన ఆక్వా భూములు, ఇతర అంశాలకు సంబంధించి కూడా లొసుగుల కోసం అధికారులు పరిశీలన ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి శిద్దా, మాజీ ఎమ్మెల్యే బాబూరావులు వెనక్కు తగ్గినప్పటికీ బహిరంగంగా వైసీపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆమంచి మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ ఆలోచనతోనే అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. అసమ్మతి నేతలపై బెదిరింపు వ్యవహారాలకు పాల్పడుతున్న వైసీపీ పోకడను నాయకుల అనుచరులు మాత్రం తీవ్రంగా ద్వేషిస్తున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 02:17 AM