ఇష్టారాజ్యం
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:18 PM
జిల్లాలో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ అక్రమ వ్యాపారం నెలలో మొదటి పక్షం రోజులు మాత్రమే జరుగుతోంది.
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
జిల్లావ్యాప్తంగా యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
ఒకే రోజు రెండు చోట్ల 2వేలకు పైగా బస్తాలు పట్టివేత
అధికారుల దాడుల్లో భారీగా వెలుగుచూస్తున్న అక్రమాలు
కొత్త, పాత వ్యాపారులు కుమ్మక్కై తరలిస్తున్న బియ్యం
రేషన్‌షాపుల తనిఖీల్లోనూ వెలుగుచూస్తున్న అక్రమాలు
ఇప్పటికే 20కిపైగా దుకాణాలపై కేసులు
సంతనూతలపాడులోని మద్దులూరు రోడ్డులో ఉన్న నాగరాజ ట్రేడర్స్ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ ఆదిలక్ష్మి బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. సరుకు విలువ రూ.75లక్షలకుపైనే ఉంటుందని అంచనా. పక్కా సమాచారంతో రైస్‌మిల్లుపై దాడి చేసి అక్కడ బయట వాహనాల్లో లోడ్‌చేసి ఉన్న బస్తాలను, అలాగే లోపల కుప్పలుగా పోసిన బియ్యాన్ని పట్టుకున్నారు. వెంటనే డీఎస్‌వో పద్మశ్రీకి సమాచారం ఇచ్చారు. సీజ్ చేసిన రేషన్ బియ్యం బస్తాలను వారికి అప్పగించారు.
తాళ్లూరు మండలం బొద్దికూరప్పాడు వద్ద గురువారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ రామారావు నేతృత్వంలో దాడిచేసిన 400 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ప్రతి నెలా రేషన్ పంపిణీని ప్రారంభించిన వెంటనే అక్రమార్కులు దందాకు తెరలేపుతున్నారు. మొదటి వారంలోనే చాలావరకు బియ్యాన్ని రాత్రికిరాత్రే తరలించేందుకు చూస్తున్నారు. భారీగా సరుకును ఆటోల్లో తమ రైసుమిల్లులకు తరలించి బస్తాలు మార్చి వేస్తున్నారు. వాటిని పోర్టులకు పంపుతున్నారు. కొంతవరకు పాలిష్ పట్టి మామూలు బియ్యం మాదిరిగా బయట మార్కెట్‌కు తరలిస్తున్నారు. మొత్తంగా రేషన్ మాఫియా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ అక్రమ వ్యాపారం నెలలో మొదటి పక్షం రోజులు మాత్రమే జరుగుతోంది. ఈ సమయంలోనే కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతుందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని అక్రమార్కులు.. ఆదాయ వనరుగా మార్చుకొని మరింత రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలుచూసుకొని ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల పట్టుబడిన ఉదంతాలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది.
జిల్లావ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు రేషన్ దందాపై దాడులు చేస్తుండడంతో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వారంరోజుల వ్యవధిలోనే జిల్లావ్యాప్తంగా సుమారు మూడువేల బస్తాల బియ్యం పట్టుకోవడంతోపాటు పలు రేషన్‌షాపులను తనిఖీలు చేయడంతో వాటిల్లో జరిగిన అక్రమాలతో 20 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారంతో బుధవారం అర్ధరాత్రి సంతనూతలపాడులోని నాగరాజ ట్రేడర్స్‌లో భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీఎ్‌సవో పద్మశ్రీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రాజ్యలక్ష్మిలు దాడి చేసి 1,624 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ అదే మిల్లుపై దాడులు
ఎస్‌ఎన్‌పాడులోని మిల్లుపై సెప్టెంబరు 11న విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 600 బస్తాలు బియ్యం స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆ మిల్లు నిర్వాహకుడు రాజేష్ గుప్తాపై కేసు నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే మిల్లుపై అధికారులకు అందిన సమాచారంతో దాడిచేయడంతో అక్కడ రేషన్ బియ్యం భారీగా నిల్వలు ఉండటంతో అధికారులు కూడా అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మిల్లు నుంచి ఒకవైపు లారీలతో తరలించేందుకు లోడింగ్ చేయగా, మరోవైపు రేషన్‌బియ్యాన్ని గోతాలు మార్చేందుకు రాసులుగా పోసి పెట్టారంటే ఈ వ్యాపారం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఆ మిల్లులోని బియ్యం మొత్తాన్ని మరొక రైస్‌మిల్లుకు తరలించి ఎం.రాజే్‌షగుప్తా, ఎం.శ్రీనివాసులు, చిరంజీవి అనే వ్యక్తులపై అధికారులు 6ఏ కింద కేసు నమోదు చేశారు. కాగా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు వద్ద గురువారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని విజిలెన్స్ సీఐ రామారావు నేతృత్వంలో పట్టుకున్నారు. 400 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనేక అక్రమాలు వెలుగులోకి..
ఇలా జిల్లావ్యాప్తంగా ఈ వారం రోజుల వ్యవధిలోని మూడువేల బస్తాలకుపైగా అధికారులు పట్టుకున్నారు. చీమకుర్తిలో వంద బస్తాలు, మద్దిరాలపాడులో వంద బస్తాలతో పాటు కనిగిరి, కంభం, మార్కాపురం, దోర్నాల సమీపంలో ఆటోల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ పంపిణీ ప్రారంభం నాటి నుంచి పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రేషన్ షాపులను తనిఖీలు చేయగా అనేక అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆ షాపులపై 6ఏ కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా ఆ విధంగా ఈ వారంరోజుల వ్యవధిలోనే 20కిపైగా షాపులపై కేసులు నమోదు అయ్యాయంటే ఈ వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా రేషన్ అక్రమ వ్యాపారంలో కొత్త, పాత వారు కలిసి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.