మోటారుసైకిల్‌పై నేతల సవారీ
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:22 AM
రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు సందర్శన పండుగ వాతావరణాన్ని తలపించింది.
పెద్దదోర్నాల, అక్టోబర్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు సందర్శన పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రాజెక్టు సందర్శన జలవనరులశాఖదే అయినప్పటికీ వెనుకబడ్డ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించిన జిల్లా ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి 9 గంటలకే దోర్నాలకు వచ్చారు. అదేక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కూడా రాత్రి 12 గంటలకు దోర్నాలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, మార్కాపురం సబ్‌కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్‌లు కూడా వచ్చారు. టన్నెల్ సందర్శన అనంతరం ఫీడర్ కెనాల్‌ను పరిశీలించేందుకు కడపరాజుపల్లె సమీపంలోని పనుకుమడుగు గిరిజన గూడెం వద్దకు చేరుకున్నారు. అయితే రహదారి సక్రమంగా లేదు. రోడ్డంతా చిల్లకంపతో నిండి బైకులపై మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో మంత్రుల ఉత్సాహంతో అప్పటికప్పుడు కార్యకర్తల బైకులపై కరకట్టపై ప్రయాణించారు. ఈ క్రమంలో తొలుత స్థానిక కార్యకర్త బైకు నడుపుతుండగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెనుక కూర్చుని మిగిలిన వారికి ఉత్సాహాన్ని నింపారు. జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు ఒక్కరే ఒక బైకును తీసుకుని కరకట్ట వెంబడి ముందుకు కదిలారు. తదనంతరం కందుల నారాయణరెడ్డి బైకు నడుపుతుండగా సాంఘీక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి వెనుక కూర్చున్నారు. దర్శి ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ స్కూటీ నడపగా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెనుక కూర్చున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బైకు నడుపుతుంటే వెనుక కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర కూర్చున్నారు. మరొక కార్యకర్త మోటారుసైకిలుపై వై.పాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు ప్రయాణించారు. రయ్ మంటూ వారే స్వయంగా బైకులు నడుపుతూ కరకట్టపై ప్రయాణించారు.