Share News

మధ్యలోనే వదిలేశారు!

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:18 AM

మార్కాపురం మెడికల్‌ కాలేజీ నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా నిర్మాణ సామగ్రిని కాలేజీ ప్రాంతం నుంచి తరలించేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక ఆ సంస్థ నిర్మాణాన్ని వదిలేసినట్లే అన్న చర్చ స్థానికంగా నడుస్తోంది.

మధ్యలోనే వదిలేశారు!
కొంతమేర మాత్రమే పూర్తయిన మెడికల్‌ కాలేజీ అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌

నత్తనడకన మార్కాపురం మెడికల్‌ కాలేజీ పనులు

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 19 శాతమే పూర్తి

ఈ విద్యా సంవత్సరం తరగతులకు ఎన్‌ఎంసీ నో

కాంట్రాక్టు సంస్థ తాత్సారమే కారణం

మార్పు భయంతో తాజాగా చేతులెత్తేసిన వైనం

కళాశాల నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు

గత ప్రభుత్వ పాపాలు నేడు శాపాలుగా పరిణమిస్తున్నాయి. ఇందుకు మార్కాపురం మెడికల్‌ కళాశాలే ఉదాహరణ. కాలేజీ భవన నిర్మాణ పనులు కొంతకాలంగా నిలిచిపోయాయి. రెండు రోజుల నుంచి కాంట్రాక్టు సంస్థ తమ నిర్మాణ సామగ్రిని ఇక్కడి నుంచి తరలిస్తోంది. దీంతో ఇక బిచాణా ఎత్తేసినట్లే! అన్న ప్రచారం స్థానికంగా నడుస్తోంది. మార్కాపురం మండల పరిధి రాయవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని 2022 మేలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి నుంచి పనులు నత్తనడకన సాగాయి. అందుకు నిధుల సమస్య ప్రధాన కారణమైంది. గత కొన్ని నెలలుగా నిర్మాణ సంస్థ పనులను పూర్తిగా నిలిపివేసింది. సోమవారం నుంచి ఏకంగా సామగ్రిని కూడా లారీలలో తరలించే ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో మెడికల్‌ కాలేజీ పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది.

మార్కాపురం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం మెడికల్‌ కాలేజీ నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా నిర్మాణ సామగ్రిని కాలేజీ ప్రాంతం నుంచి తరలించేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక ఆ సంస్థ నిర్మాణాన్ని వదిలేసినట్లే అన్న చర్చ స్థానికంగా నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను ఒకేసారి 2022 మేలో ప్రారంభించింది. అప్పటికే 11 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను చేరువ చేయడం, కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటు చేసే వైద్యశాలల ద్వారా కార్పొరేట్‌ వైద్యం పేదలందరికీ అందించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు నాటి ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఘనంగా ప్రారంభాలైతే చేశారు కానీ కొన్నింటికి మాత్రమే ప్రాఽధాన్యం ఇచ్చి ఇప్పటివరకు ఐదు కాలేజీలను మాత్రమే ప్రారంభించారు.

పీపీపీ యోచన తెలిసి..

మిగిలిన కాలేజీల నిర్మాణాలకు గత ప్రభుత్వం సక్రమంగా నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడి పనులను అక్కడే కాంట్రాక్టర్‌ నిలిపివేశాడు. ఈ సంవత్సరం ఐదు కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. పనులు పూర్తికాలేదని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఈ సంవత్సరం జూన్‌లో తనిఖీలు చేపట్టి అడ్మిషన్లను నిలిపివేసింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం కాలేజీల నిర్మాణాలను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఉన్నతస్థాయిలో మేధోమథనం చేస్తున్నారు. పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) విధానం మెరుగైనదని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈక్రమంలో దాదాపు అన్ని కాలేజీల నిర్మాణాలను గంపగుత్తుగా తీసుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ మెగా ఇంజనీరింగ్‌ కాలేజీల వద్ద నుంచి నిర్మాణ సామగ్రిని తరలించే పనిలో పడింది. మార్కాపురం మెడికల్‌ కాలేజీ వద్ద నుంచి కూడా గత రెండు రోజులుగా నిర్మాణ సామగ్రిని తరలిస్తోంది.

మెడికల్‌ కాలేజీ పనులు పూర్తైంది 19 శాతమే..

మార్కాపురం మెడికల్‌ కాలేజీకి మండలంలోని రాయవరం వద్ద ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. మొత్తం రూ.475 కోట్లతో బోధనాసుపత్రిని నిర్మించాల్సి ఉంది. 2022లోనే అన్ని కాలేజీలకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేసినా నిర్మాణ కాంట్రాక్ట్‌ సంస్థ 2023 ఫిబ్రవరిలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేసంవత్సరం పనులు ప్రారంభించింది. కానీ మొదటి నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో తరగతులు నిర్వహించాలని యోచించి పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అప్పటికే ఉన్న 150 పడకలకు అదనంగా మరో 300 పడకల నిర్మాణాన్ని తాత్కాలిక పద్ధతిలో నిర్మాణం చేసింది. ఆపడకలు 2024 జూన్‌లో అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.8 కోట్లు కేటాయించినా కాంట్రాక్ట్‌ సంస్థ మెగా ఇంజనీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ రూ.3 కోట్ల పనులు మాత్రమే చేసింది. ఇంకా అక్కడ రూ.5 కోట్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి.


పునాదుల్లోనే వైద్యశాల పనులు

రాయవరంలోని మెడికల్‌ కాలేజీ వద్ద మొత్తం 28 రకాలైన నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది. వైద్యశాలకు సంబంధించి పునాదుల స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. కాలేజీకి సంబంధించిన పనులు మాత్రం 40శాతం మేర పూర్తయ్యాయి. విద్యార్థుల హాస్టల్‌ భవనాల ప్రగతికి కూడా ఓ మోస్తరుగానే ఉంది. మిగిలిన వాటిలో 15 విభాగాలకు చెందిన పనులు ఇంకా ప్రారంభించలేదు. మొత్తం మీద ఇప్పటివరకు 20శాతంలోపు మాత్రమే పనులు జరిగాయి. నిర్మాణం పూర్తిచేసేందుకు గడువు 2025 జూలై వరకు ఉన్నా పనుల తీరును చూస్తే మరో రెండేళ్లకు పైగానే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సామగ్రిని తరలిస్తున్న విషయం తెలియదు

విజయభాస్కర్‌, ఈఈ, ఏపీఎంఐడీసీ

మార్కాపురం మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు ఇప్పటి వరకు 19శాతం మాత్రమే పూర్తయ్యాయి. పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్‌ సంస్థకు పెండింగ్‌ బిల్లులు ఇవ్వాల్సి ఉంది. కాలేజీ వద్ద నుంచి వారికి సంబంధించిన సామగ్రిని ఇతర పనుల వద్దకు తరలించి ఉండొచ్చు. ఆ విషయం మా దృష్టికి రాలేదు. ప్రభుత్వం ఏజెన్సీని మార్చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుసుకుని సామగ్రిని తరలిస్తున్నారేమో.

Updated Date - Nov 06 , 2024 | 01:18 AM