Share News

నిర్లక్ష్యం వీడండి

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:33 AM

‘జిల్లా యంత్రాంగంలో అనేక శాఖల అధికారులు ఉంటారు. వారందరి తరఫున అంతిమంగా కలెక్టర్‌ అకౌంట్‌బులిటీగా ఉండాలి. ఇక్కడ చూస్తే ఇంకా పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిశాఖలపై సమీక్ష చేస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. కొందరు అధికారుల పనితీరు నాకైతే సంతృప్తికరంగా లేదు’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యం వీడండి
డీఆర్సీ సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి ఆనం, వేదికపై మరో మంత్రి డోలా, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ,ఎంపీ, కలెక్టర్‌ అన్సారియా, ఎమ్మెల్యేలు

అధికార యంత్రాంగానికి ఇన్‌చార్జి మంత్రి సూచన

అన్నిశాఖలకు కలెక్టర్‌ బాధ్యత వహించాలని స్పష్టం

పలు సమస్యలు, అభివృద్ధి అంశాలను ఏకరువు పెట్టిన ప్రజాప్రతినిధులు

డీసీసీబీ, డ్వామాలలో అవినీతిపై సమగ్ర విచారణకు ఎమ్మెల్యే జనార్దన్‌ డిమాండ్‌

వెలిగొండ, ఇతర సాగు, తాగునీరు, రోడ్లను ప్రస్తావించిన పలువురు

‘జిల్లా యంత్రాంగంలో అనేక శాఖల అధికారులు ఉంటారు. వారందరి తరఫున అంతిమంగా కలెక్టర్‌ అకౌంట్‌బులిటీగా ఉండాలి. ఇక్కడ చూస్తే ఇంకా పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిశాఖలపై సమీక్ష చేస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. కొందరు అధికారుల పనితీరు నాకైతే సంతృప్తికరంగా లేదు’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్సీ సమావేశం నిర్వహించారు. అధికారులంతా నిర్లక్ష్యం వీడి బాధ్యతగా పనిచేయాలని ఆనం సూచించారు. శాఖలపరంగా అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగంపై తనకు ఉన్న అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ సున్నితంగానే హెచ్చరికలు చేశారు.

ఒంగోలు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి డీఆర్‌సీ సమావేశం సోమవారం సుదీర్ఘంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావే శానికి జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారి యా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ దామోదర్‌, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. తొలుత మంత్రి స్వామి జిల్లా వెనుకబాటు తనం, అభివృద్ధి చేయాల్సిన వెలిగొండతోపాటు ఇతర పలు అంశాలు, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మొత్తం ఎనిమిది శాఖలకు సంబంధించి పలు విభాగాలను అజెండాలో చేర్చినా సమయం సరిపోక కొన్నింటిపైనే సమీక్ష చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్‌, ప్రాజెక్టులు, వ్యవసాయం, ఉద్యాన, మైక్రో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేశారు.

సత్వర చర్యలు తీసుకోవాలి

వెలిగొండ ప్రాధాన్యతను మంత్రి స్వామి, ఎంపీ మాగుంటతోపాటు పశ్చిమప్రాంత ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధి అంశాలను ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, డ్వామాలలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు.. వాటిపై జరుగుతున్న విచారణల గురించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. విచారణ తీరు సరిగా లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేయంచాలని కోరారు. కాగా అందరూ ప్రస్తావించిన అంశాలపై అధికారుల సమాధానాలపై స్పందించిన ఇన్‌చార్జి మంత్రి రామనారాయణరెడ్డి జిల్లా అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూనే కొందరు అధికారులు, శాఖల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలసత్వం వీడి పనిచేయాలని యంత్రాంగాన్ని సున్నితంగానే హెచ్చరించారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను వివరించారు.

Updated Date - Nov 05 , 2024 | 01:33 AM