Share News

వైసీపీ కబ్జా చేసిన భూములకు విముక్తి

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:14 AM

వైసీపీ పాలనలో ఆపార్టీ నేతల నిర్వాకంతో భూములు కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి వాటిని విడిపించి అసలు యజమానులకు అప్పగిస్తామన్నారు. శనివారం మండలంలోని నందనవనంలో జరిగిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు.

వైసీపీ కబ్జా చేసిన భూములకు విముక్తి
నందనవనం రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి స్వామి, వేదికపై కలెక్టర్‌ న్సారియా, ఆర్డీవో లక్ష్మీప్రసన్న

బాధితులందరికీ న్యాయం చేస్తాం

గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఆక్రమణలు

రికార్డులు సైతం మార్పు

వాటిని సరిదిద్దేందుకే రెవెన్యూ సదస్సులు

నందనవనంలో మంత్రి డాక్టర్‌ స్వామి

జరుగుమల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో ఆపార్టీ నేతల నిర్వాకంతో భూములు కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి వాటిని విడిపించి అసలు యజమానులకు అప్పగిస్తామన్నారు. శనివారం మండలంలోని నందనవనంలో జరిగిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలపై గ్రీవెన్స్‌ నిర్వహిస్తే అందులో వచ్చిన 60శాతం అర్జీలు భూ సంబంధమైనవేనన్నారు. వాటిలో వైసీపీ హయాంలో జరిగిన భూదారుణాలు అధికంగా ఉన్నాన్నారు. ఆపార్టీ నాయకులు అనేక మంది నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారని, రికార్డులను సైతం ఇష్టానుసారం మార్పించారని మంత్రి విమర్శించారు. బాధితులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకోసమే రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరికి భూ సమస్య ఉన్నా నిర్భయంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామస్థులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కరించాలన్నారు. పలు గ్రామాల్లో గర్భకండ్రికలు, ఎర్ర కండ్రిగలు రైతుల అనుభవంలో ఉన్నా పాస్‌ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌ దృష్టికి మంత్రి స్వామి తెచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నూతన సంవత్సరం రోజున ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండకూడదన్న ఉద్దేశంతో ముందురోజు ఈనెల 31నే పింఛన్‌ల పంపిణీకి ముఖ్యమంత్రి ఆదేశించారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా విద్యుత్‌ చార్జీలు పెంచి ఇప్పుడు తగ్గించాలని ఆ పార్టీ నేతలు ధర్నాలు చేయడం ‘దొంగే.. దొంగ’ అన్నట్లు ఉన్నదని మంత్రి ఎద్దేవా చేశారు. స్థానికులు సభ దృష్టికి తెచ్చిన పలు సమస్యల పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. ఉపాధి పథకం నిధులతో పొలాలకు వెళ్లే డొంకరోడ్లను మార్చి నుంచి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నందనవనం నుంచి మండల కేంద్రమైన జరుగుమల్లికి దగ్గరి దారి కల్పించాలని ప్రజలు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పాలేరుపై మల్టీలెవల్‌ చెక్‌డ్యాంను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సభలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్‌ జనార్దన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 01:14 AM