మనబడి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:21 AM
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా జిల్లాలోని 2,407 ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త ఒరవడి
నేడు ఒకే వేదికపైకి తల్లిదండ్రులు, గురువులు
ఏర్పాట్లు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు
ఆ ఊరు మనది..
ఆ వాడ మనది..
ఆ బడీ మనది..!
మన ఇంటి ముందున్న బడి బాగోగులు
మనం చూద్దాం..
మన కళ్లెదురు కనిపిస్తున్న స్కూల్
ప్రతిష్టను మరింతగా
ఇనుమడింపజేద్దాం..
ఆ చదువుల కోవెలను తీర్చిదిద్ది
భావితరాలకూ బాసటగా నిలుపుదాం..
ఇదే స్ఫూర్తితో.. ఇదే ఆకాంక్షతో చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మమేకంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలో పండుగ వాతావరణం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయులు, పేరెంట్స్ సమావేశాలను నిర్వహిస్తుంది.
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా జిల్లాలోని 2,407 ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించి విద్యార్థులకు స్ఫూర్తిని నింపే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా పాఠశాలల్లో జరిగే సమావేశాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపారు. శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో జరిగే ఈ మీటింగ్‌కు ఏదో ఒక పాఠశాలలో పాల్గొనే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా వారు ఎంపిక చేసిన పాఠశాలల్లో పాల్గొననున్నారు.
ప్రజాప్రతినిధులు హాజరయ్యే పాఠశాలలు...
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గిద్దలూరులోని జడ్పీ బాలికోన్నత పాఠశాల, ముండ్లపాడు హైస్కూలులో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కంచర్లవారిపల్లి జడ్పీ హైస్కూలులో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో జడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలలో, ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కొత్తపట్నం జిల్లా పరిషత్ హైస్కూలు, ప్రకాశం కాలనీలోని ఎంపీపీఎస్ స్కూలులో, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు జడ్పీ హైస్కూలు, మద్దిపాడు మండలం గుళ్ళాపల్లి హైస్కూలులో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలులోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో పాల్గొంటారు. కాగా ఆయా పాఠశాలల్లో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.