Share News

బదిలీల ఆర్డర్లలో భారీ అవినీతి

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:38 AM

జిల్లా పంచాయతీ పరిధిలోని గ్రేడ్‌-5, 6 (సచివాలయ ఉద్యోగుల) బదిలీల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు త్రిసభ్య కమిటీ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కమిటీ చైర్మన్‌ అయిన ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ లోకేశ్వరరావు, ఇద్దరు సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి బదిలీలు పొందిన ఉద్యోగులతో మాట్లాడి వివరాలను సేకరించారు.

బదిలీల ఆర్డర్లలో భారీ అవినీతి
గ్రేడ్‌ 5,6 ఉద్యోగులను విచారిస్తున్న త్రిసభ్య కమిటీ

చేతులు మారిన రూ.లక్షలు

ఫోన్‌పే, గూగుల్‌పే, ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్లు

ఉత్తర్వులు పొందేందుకు పడిన పాట్లును ఏకరువు పెట్టిన సచివాలయ కార్యదర్శులు

రెండో రోజూ విచారణను కొనసాగించిన త్రిసభ్య కమిటీ

పూర్వ డీపీవో వ్యవహారశైలిపై విచారణాధికారుల అసంతృప్తి

మేడం చేప్పినట్లే చేశాం... ఇందులో మా తప్పేమీ లేదు

అధికారుల ఎదుట కార్యాలయ ఉద్యోగుల ఆవేదన

నేడు నివేదికను కలెక్టర్‌కు అందజేసే అవకాశం

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ పరిధిలోని గ్రేడ్‌-5, 6 (సచివాలయ ఉద్యోగుల) బదిలీల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు త్రిసభ్య కమిటీ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కమిటీ చైర్మన్‌ అయిన ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ లోకేశ్వరరావు, ఇద్దరు సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి బదిలీలు పొందిన ఉద్యోగులతో మాట్లాడి వివరాలను సేకరించారు. మరోవైపు కలెక్టరేట్‌లోని ఫారెస్టు సెటిల్‌మెంట్‌ కార్యాలయంలో సోమవారం ప్రారంభించిన విచారణను మంగళవారం కూడా కొనసాగించారు. పూర్వ డీపీవో ఉషారాణితోపాటు బదిలీలు పొందిన వారు, ఇప్పటివరకు బదిలీ ఉత్తర్వులు పొంది మండలాల్లో చేరకుండా ఉన్న ఉద్యోగులు హాజరయ్యారు. జరిగిన పరిణామాలన్నింటినీ త్రిసభ్య కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఇంకోవైపు విచారణ కమిటీ ముందు చెప్పేందుకు భయపడుతున్న ఉద్యోగుల నుంచి రాతపూర్వకంగా సమాచారాన్ని తీసుకున్నట్లు తెలిసింది. బదిలీల ఆర్డర్లు పొందేందుకు భారీగా చేతులు మారినట్లు విచారణాధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఎవరికిచ్చారు.. ఎందుకిచ్చారు?

ఫొన్‌ నంబర్ల ఆధారంగా ఎవరి ఫోన్‌ నంబర్లకు ఎంత అమౌంట్‌ ఇచ్చారు? అది బదిలీల కోసమే ఇచ్చారా? తదితర అంశాలపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. బదిలీల సమయంలో ఉద్యోగులు డబ్బులను పూర్వ డీపీవో ఉషారాణి కుటుంబ సభ్యులకు ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు విచారణాధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఉషారాణి మాత్రం తాను నిజాయితీగా పనిచేశానని, బయట జరిగే పరిణామాలకు తనకు ఏమి సంబంధమని కమిటీనే ఎదురుప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో విచారణాధికారులు బ్యాంకు లావాదేవీలను నేరుగా ప్రస్తావించడంతో ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. అయితే జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులపై కూడా ఆ నెపం నెట్టివేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే విచారణాధికారులు అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం బదిలీల కోసం మార్గదర్శకాల జారీచేసిన నాటి నుంచి బదిలీల ఆర్డర్లు ఇచ్చేంతవరకు జరిగిన పరిణామాలపై ప్రశ్నిస్తుంటే ఇతర అంశాల ప్రస్తావించడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది.

సీసీ ఫుటేజి సేకరణ

రెండోరోజైన మంగళవారం జరిగిన విచారణలో కూడా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు తాము ఎవరికి డబ్బులు ఇచ్చింది విచారణాధికారులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. కార్యాలయంలో పనిచేసే వివిధ హోదాల్లోని ఉద్యోగులను కూడా విచారించి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు సీసీ ఫుుటేజ్‌లో కొన్ని విషయాలు సేకరించినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ ముగియడంతో బుధవారం నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు సమాచారం. దాని ఆధారంగా ఎవరిపై వేటుపడుతుందో వేచిచూడాల్సి ఉంది.

మేడం చెప్పినట్లే చేశాం

బదిలీలను మేడం ఉషారాణి చెప్పినట్లే చేశామని, అందులో తమకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు విచారణ కమిటీ ఎదుట తెలిపినట్లు సమాచారం. తాము చిరు ద్యోగులమని, పై అధికారి ఏవిధంగా చెప్తే అలా మసలుకోవడమే తమ విధి అని అన్నట్లు తెలిసింది. ఆమె ఎవరికి ఇవ్వమంటే వారికి ఆర్డర్లు ఇచ్చామని, అందులో తమ తప్పేమీ లేదని కొంతమంది కన్నీరుపెట్టుకున్నట్లు సమాచారం. ఇదేవిషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించడంతో ఆ విధంగా ఉద్యోగులు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఒక సచివాలయ ఉద్యోగి ఫోన్‌పే ద్వారా తాను డబ్బులు చెల్లించిన తర్వాతనే తనకు ఆర్డర్‌ ఇచ్చారని విచారణాధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఉషారాణి.. ఎప్పుడు ఇచ్చావని ఫైర్‌ అయినట్లు తెలిసింది. ఆ ఉద్యోగి కార్యాలయంలో పనిచేస్తున్నట్లు కూడా తనకు తెలియదని ఉషారాణి చెప్పినట్లు సమాచారం.


ఉద్యోగులు సస్పెండయ్యాక ఆర్డర్లు

జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సస్పెండ్‌ అయ్యాక కార్యాలయంలో పనిచేసే ఒక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా ఆర్డర్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బహిర్గతమైనట్లు సమాచారం. ఆ ఉద్యోగి రూ. 2లక్షలకుపైగా నగదును నేరుగా ఉషారాణికి ఇచ్చినట్లు తెలిసింది. ఆయనకు ఈనెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్లు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ముందు ఆ ఉద్యోగి ఎవరో తెలియదని ఉషారాణి బుకాయించగా, తాను డీఎల్‌డీవో కార్యాలయానికి వచ్చి డబ్బులు ఇవ్వలేదా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు పూర్వ డీపీవో ఉషారాణి ఫీల్డ్‌ విజిట్‌ సమయంలో వాట్సాప్‌ గ్రూపుల్లో జరిగిన మెసేజ్‌లను కూడా విచారణాధికారులు ఆధారాలతో సహా ఆమె ముందు ఉంచినట్లు సమాచారం. కాగా మార్కాపురంలో మహిళా ఉద్యోగి వేధింపుల విషయంలో అక్కడి డీఎల్‌డీవో సస్పెండ్‌ అయ్యారు. ఆయనకు అనుకూలంగా నివేదిక ఇస్తానని పూర్వపు డీపీవో రూ.50వేలు తీసుకున్నట్లు సమాచారం. ఆ విషయమై సస్పెండ్‌ అయిన డీఎల్‌డీవోనే నేరుగా విచారణాధికారులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - Oct 23 , 2024 | 01:38 AM