Share News

ఇసుక అక్రమ తవ్వకాలపై కదిలిన యంత్రాంగం

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:40 PM

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వరుస కథనాలతో అధికార యంత్రాం గం కదిలింది. శనివారం తహసీల్దార్‌ పార్వతి, మైనింగ్‌ ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీకాంత్‌ల బృందం ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో తోటల్లో ఉన్న ఎక్స్‌కవేటర్‌ను గుర్తించారు. అధికారుల బృం దాన్ని చూచి ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు.

ఇసుక అక్రమ తవ్వకాలపై కదిలిన యంత్రాంగం
ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేస్తున్న తహసీల్దార్‌ పార్వతి, ఎస్సై వెంకటేశ్వర్లు

అధికారుల్లో వీడని సందిగ్ధత

బాపట్ల, అద్దంకి నుంచి కూడా చీరాల నియోజకవర్గానికి

సీఎం చంద్రబాబు చెప్పారు కదా అంటున్న ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు

వేటపాలలెం(చీరాల), నవంబరు 2(ఆంధ్రజ్యోతి) : ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వరుస కథనాలతో అధికార యంత్రాం గం కదిలింది. శనివారం తహసీల్దార్‌ పార్వతి, మైనింగ్‌ ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీకాంత్‌ల బృందం ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో తోటల్లో ఉన్న ఎక్స్‌కవేటర్‌ను గుర్తించారు. అధికారుల బృం దాన్ని చూచి ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. అక్కడ నుంచి సమీపంలో ఇసుక తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని అధికారుల బృందం పరిశీలించింది. ఆ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న తనతో వాదన పెట్టుకున్న అశోక్‌, ఎక్స్‌కవేటర్‌కు సంబంధించి ప్రసాద్‌ అనే వ్యక్తి, తవ్వకాలు జరిగిన ప్రదేశానికి సంబంధించి రామారావు, భిక్షవతికి నోటీసులు ఇచ్చి, ఎక్స్‌కేటర్‌ను సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి సంబంధీకులపై తగిన చర్యలు చేపట్టే విధంగా పోలీసు వారికి చెప్పినట్లు తహసీల్దార్‌ పార్వతి తెలిపారు.

సీఎం ట్రాక్టర్లతో తోలుకోవచ్చన్నారుగదా

సీఎం చంద్రబాబు ఇసుకను ట్రాక్టర్లతో ఉచిత ఇసుక విధానంలో తోలుకోవచ్చని చెప్పారు గదా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని ఇసుక తవ్వకాలు, రవాణా చేసే వ్యక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పదుల సంఖ్యలో క్వారీలను ఏర్పాటు చేసుకుని తవ్వకాలు, రవాణా జరుపుతున్న వారిని వదిలేసి కేవలం మమ్మల్నే ఎందుకు ఆపుతున్నారని, మిగిలిన వారిని ఎందుకు ఆపరని పట్టుబడినారు అధికారులను ప్రశ్నించడం వారికి తలనొప్పిగా మారుతోంది. అయి తే సీఎం చంద్రబాబు వాగులు, వంకలు, నదులు ఉన్న ప్రాంతాల్లో 5 కిలోమీటర్లు లోపు సొంత అవసరాలకు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా తోలుకోమన్నారన్న విషయాన్ని అధికారులు పదే పదే చెప్పాల్సి వ స్తోంది. కొందరు ఎందుకు తలనొప్పని అక్రమ తవ్వకాలు, రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

అద్దంకి, బాపట్ల ప్రాంతాల నుంచి

చీరాల నియోజకవర్గంలో ఇసుక భూములు ఎక్కువగా ఉండడం, పెద్ద ఎత్తున ఎక్స్‌కవేటర్లతో క్వారీలలో తవ్వకాలు సాగిస్తుండడంతో పాటు ధర తక్కువగా ఉండడంతో అద్దంకి, బాపట్ల ప్రాంతాల నుంచి ఇసుక కోసం చీరాల నియోజకవర్గానికి వస్తున్నారు. గతంలో ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.4,500 ఉంటే ప్రస్తుతం దూరాన్ని బట్టి రూ.1800 నుంచి రూ.4వేల మధ్య తోలుతున్నారు.

అధికారుల్లో వీడని సందిగ్ధత

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంఽధించి అధికారులు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నారని విషయం తెలిసిన వారు చెప్తున్నారు. ట్రాక్టరు యజమానులు, డ్రైవర్లు సీఎం చంద్రబాబు చెప్పారు, మీరెందుకు ఆపుతున్నారనే కోణంలో ప్రశ్నించడంతో, కేసులు కట్టేందుకు కూడా ఒకింత వెనకడుగు వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితులను, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అంశాలకు సంబంఽధించి స్పష్టమైన ప్రకటన చేసి స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 02 , 2024 | 11:40 PM