Share News

రీసర్వేపై కదలిక

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:33 AM

గ్రామాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న రీసర్వే సమస్యపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ముందుగా రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

రీసర్వేపై కదలిక

గ్రామాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న రీసర్వే సమస్యపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ముందుగా రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సమస్యల పరిష్కారం ఎప్పుడనేది అధికారులకు స్పష్టత లేనప్పటికీ, ప్రజల నుంచి అర్జీలు మాత్రం స్వీకరిస్తు న్నారు. మరోవైపు రైతాంగం మాత్రం సమస్యలను తర్వగా పరిష్కరించాలని కోరుకొంటోంది.

మార్కాపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రీసర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. మండలానికి ఒక చిన్న గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని భూములను సర్వే చేసింది. ఆయా గ్రామాల్లోనే లోపాలు తలెత్తినా వాటిని సవరించకుండా మండలంలోని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వేనుకొనసాగించింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలు ముద్రించిన నూతన పాసుపుస్తకాల మంజూరు, సర్వే రాళ్ల ఏర్పాటుపైనే నాటి ప్రభుత్వం దృష్టిసారించింది. వాస్తవానికి ప్రజలకు సర్వేతో మేలు జరగాలి. కానీ రీసర్వేతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధానంగా భూముల విస్తీర్ణాలు తగ్గడం, ఒకరి భూమిని మరొకరి పేరున నమోదు చేయడం, పాతసర్వే నంబర్లస్థానే ఎల్‌పీ నంబర్లు కేటాయించడంతో రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారికి చిక్కులు ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల్లో క్రయ విక్రయాలు చేసుకునేందుకు తీవ్ర అవరోధం ఏర్పడింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వాళ్లు రీషెడ్యూల్‌ చేసుకోవడానికి లేకపోవడంతో రుణాలు మొత్తం చెల్లిచాల్సిన దుస్థితి ఏర్పడింది.

చిక్కులు తీర్చాలని రైతుల మొర

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్టును రద్దు చేసింది. రీసర్వేపై నిర్ణయం తీసుకోవడానికి నెలలపాటు వేచి చూసింది. సర్వేను కొనసాగిస్తామని నిర్ణయించినప్పటికీ, స్పష్టమైన విధి విధానాలు రాలేదు. దీనికి తోడు మీ కోసం కార్యక్రమానికి సైతం రీసర్వే సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం రీ సర్వే జరిగిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఇబ్బందులు పడుతున్న వారినుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా మంగళవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మండలస్థాయి రెవెన్యూ అధికారులు, సర్వే విభాగం మండల, సచివాలయ సిబ్బంది హాజరయ్యారు. ప్రధానంగా ఏ విభాగానికి సంబంధించిన సమస్యను ఆ విభాగంలో అర్జీల రూపంలో స్వీకరించి పొందుపరుస్తున్నారు. విస్తీర్ణంలో తేడాలు, ఎల్‌పీ నంబర్లలో తేడాలపై ఎక్కువగా అర్జీలు అందాయి. ఈ అర్జీలపై ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో మార్పులు చేర్పులు చేయడానికి మండల స్థాయి అధికారులకు అవకాశం రాలేదు. ఈ అర్జీలను ఎలా సరి చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని డివిజన్‌లోకి ఓ తహసీల్దార్‌ పేర్కొవడం గమనార్హం. ఏదిఏమైనా రీసర్వేతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నం దున త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తాం

తర్లుపాడు : గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలను గ్రామసభల్లో పరిష్కరిస్తామని తహసీల్దార్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. మండలంలో మిర్జపేట పంచాయతీ కారుమానుపల్లె లో రీసర్వే జరిగిన గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది రైతులు తమ పొలం కంటే తక్కువ నమోదు అయిందని ఫిర్యాదు చేశారు. తప్పులు ఎందుకు జరిగాయంటూ తహసీల్దార్‌తో రైతులు వాగ్వివాదం చేశారు. ప్రస్తుతం సమస్య లు పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాయి ఈశ్వర్‌రెడ్డికి చెందిన సర్వేనెంబర్‌ 38-1లో 2.40 ఎకరాలు ఉండగా 40 సెంట్లు తక్కువగా నమోదైంది. మరో రైతు టి.ఈశ్వర్‌రెడ్డికి చెందిన 2.97 సెంట్ల భూమి ఉండవల్సి ఉండగా 5.31 ఎకరాల భూమి చూపుతూ ఎక్కువగా నమోదైనట్లు అర్జీలు ఇచ్చారు.

దొండపాటి నడిపి వెంకటేశ్వర్లుకు 11-1లో 3.75 ఎకరాల భూమికి గాను 3.02 ఎకరాల భూమి మాత్రమే నమోదైనట్లు వాపోయారు. సర్వే నెంబర్‌ 42-3లో 86సెంట్ల భూమి ఉండాల్సి ఉండగా అసలు ఆన్‌లైన్‌ లో కనిపించలేదు. ఇలాంటి సమస్యలపై మొత్తం 65 అర్జీలు వివిధ సమస్యలపై వచ్చినట్లు తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌వో నాగరాజుకుమారి, సర్వేయర్‌ జి.వాణి, గ్రామ సర్వేయర్లు శ్రీను, రవళి, రవీంద్ర, మస్తాన్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

కొనకనమిట్ల : మండలంలోని నాగంపల్లి, వింజవర్తిపాడు గ్రామాలలో మంగళవారం జరిగిన రీసర్వే గ్రామ సభలో తహసీల్దార్‌ సురేష్‌ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. రీసర్వేలో మీభూమికి సంబంధించిన కొలతలు, విస్తీర్ణంలో ఏటువంటి తేడాలు ఉన్నా, మీ గ్రామాలలో జరిగే రీసర్వే గ్రామ సభలలో వెల్లడించాలన్నారు. పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఆర్‌ఐ మహాదేవరెడ్డి, వీఆర్‌వోలు సుబ్బారెడ్డి, జానయ్య, నాయకులు తాతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, సర్వేయర్లు, పలువురు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రీసర్వే సమస్యలు త్వరితగతిన పరిష్కారం

పెద్దారవీడు : రీసర్వేలో తలెత్తిన సమస్యలను త్వరిత గతిన పరిష్కరించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్‌ ఖలీల్‌ అన్నారు. ప్రభుత్వం తలపెట్టిన రీసర్వే పూర్తయిన గ్రామాలలో గ్రామసభల నిర్వహణలో భాగంగా మంగళవారం మండలంలోని గొబ్బూరులో సభ నిర్వహించారు. రీ సర్వే సమస్యలపై వచ్చిన అర్జీలను 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. గొబ్బూరు గ్రామసభలో భూరీసర్వే సందర్భంగా 29 వినతిపత్రాలు రైతుల నుంచి రెవెన్యూ అధికారులు స్వీకరించారు. అందులో 18 ఎల్‌పీఎం నంబరు కేటాయింపులో తేడాలు, 8 భూ విస్తీర్ణంలో తేడాలు, 3 పేర్లు తప్పుగా నమోదైనట్లు అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో ఎంఆర్‌ఐ గోపీ వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

22 నుంచి రీసర్వేపై గ్రామసభలు

కంభం : కంభం మండలంలో గతంలో రీసర్వే పూర్తయిన గ్రామాలలో రీసర్వేకు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత గ్రామాలలో ఈ నెల 22 నుంచి 29 వరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు కంభం మండల తహసీల్దార్‌ కిరణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జంగంగుంట్ల గ్రామంలో ఈనెల 21వ తేదీ, 24న నడింపల్లి, 26న కాగితాలగూడెం, 29న కందులాపురంలలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 23 , 2024 | 12:33 AM