Share News

మూడుచోట్ల ముచ్చెమటలే..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:01 PM

అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలలో అధికార వైసీపీ అసమ్మతులు ఏమాత్రం చల్లబడలేదు. రోజులు గడిచేకొద్ది ఆ పార్టీని కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాలలోనూ వై సీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీలోకి వలసలు పెరిగిపోతుండడం గమనార్హం. దీంతో అసమ్మతులలో వలసలను కట్టడి చేసేందుకు బెదిరింపు రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇరుపార్టీల అభ్యర్థులు ప్రకటించగా వారు ప్రచార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. రోజురోజుకూ టీడీపీలోకి వలసలు పెరుగుతుండగా వైసీపీలో అసమ్మతి రగడ తగ్గకపోగా రోజుకోకొత్త సమస్య ఎదురవుతోంది. పార్టీలోని అసమ్మతి నాయకులను తొలి నుంచి కట్టడి చేసేందుకు దిగినా ఇప్పటికయితే ఆశించిన ఫలితం లభించలేదు.

మూడుచోట్ల ముచ్చెమటలే..!

అద్దంకిలో అదుపుకాక వైసీపీ బెదిరింపులు

పర్చూరులో వైసీపీ అసమ్మతి సైలెంట్‌

టీడీపీలోకి పొలోమని వలసలు

ఆమంచి కట్టడికి వ్యూహం, ఫలించిన వైనం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు :

అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలలో అధికార వైసీపీ అసమ్మతులు ఏమాత్రం చల్లబడలేదు. రోజులు గడిచేకొద్ది ఆ పార్టీని కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాలలోనూ వై సీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీలోకి వలసలు పెరిగిపోతుండడం గమనార్హం. దీంతో అసమ్మతులలో వలసలను కట్టడి చేసేందుకు బెదిరింపు రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇరుపార్టీల అభ్యర్థులు ప్రకటించగా వారు ప్రచార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. రోజురోజుకూ టీడీపీలోకి వలసలు పెరుగుతుండగా వైసీపీలో అసమ్మతి రగడ తగ్గకపోగా రోజుకోకొత్త సమస్య ఎదురవుతోంది. పార్టీలోని అసమ్మతి నాయకులను తొలి నుంచి కట్టడి చేసేందుకు దిగినా ఇప్పటికయితే ఆశించిన ఫలితం లభించలేదు.

అదుపుకాని అద్దంకి

అద్దంకి నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికలోనే వైసీపీ అధిష్ఠానం తడబాటుకు గురైంది. అధిష్ఠాన నిర్ణయాన్ని వ్యతిరేకించిన బాచిన క్రిష్ణచైతన్యను బెదిరించి కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన క్వారీలలో తనిఖీలు చేసి భారీ జరిమానాలు వేసి మూతపడే విధంగా చేశారు. చివరకు ఆయన టీడీపీలో చేరిపోవడంతో తొలి దెబ్బ తగిలింది. అనంతరం వైసీపీ అభ్యర్థి వ్యవహార శైలిని జీర్ణించుకోలేని కొందరు నాయకులు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. వలసల పర్వం ఆగకపోవడంతో కిందిస్థాయి వరకు నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మరోవైపు మైనింగ్‌ అధికారులను ఉపయోగించి పార్టీని వీడే వారిపై కట్టడి ప్రయోగం చేశారు. ఇసుకను అక్రమంగా అమ్ముకోండి, గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేసుకోండి, అధికారులు అడ్డురాకుండా చూస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో అక్రమ రవాణాలు జరుగుతున్నా అధికారులు ఆ వైపు చూడకుండా కట్టడి చేసుకున్నారు. ఇంకోవైపు ఎంతైనా డబ్బులు ఇస్తాం రండహో అంటూ ఊరూవాడా ప్రచారం చేశారు. ఇన్ని చేసినా ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు ఆగలేదు. పైగా అసమ్మతితో సైలెంట్‌ అయిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీ జెండా పట్టలేదు. దీంతో పోలీసుల ద్వారా బెదిరింపులకు శ్రీకారం పలికారు. చివరకు వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి బహిరంగంగా బెదిరింపు మాటలకు దిగారు. నిబంధనలు ఉల్లంఘించిన వలంటీర్లను రక్షించే పనిలో పడ్డారు. అవసరమైతే వలంటీర్లందరి చేత రాజీనామా చేయించి పార్టీ ప్రచారానికి వాడుకుంటామని ప్రకటించారు. ఇంకోవైపు మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపే, అప్పుడు మీ అంతు చూస్తామంటూ పరోక్ష బెదిరింపులకు దిగారు. అయినా సమన్వయంతో ముందుకు పోతున్న టీడీపీ అభ్యర్థి రవికుమార్‌ స్థానికంగా తన పనులు తాను చేసేస్తున్నాడు.

పర్చూరులో పెరిగిన వలసలు

పర్చూరులో మూడో కృష్ణునిగా రంగంలోకి తెచ్చిన బాలాజీకి పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించకుండా నాయకులను కలవడం, ఆయా కార్యక్రమాలకు ఆహ్వానం పలికిన నాయకుల ఇళ్లకు వెళ్లి ఫంక్షన్‌లలో పాల్గొంటానికే పరిమితమయ్యారు. గతంలో ఆమంచి క్రిష్ణమోహన్‌కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి వర్గంలో ఒకరిని మినహా మిగిలిన వారంతా సైలెంట్‌ అయ్యారు. ఆమంచితోపాటు అంతకుముందు ఇన్‌చార్జిగా పని చేసిన డీసీఎంఎస్‌ చైర్మన్‌ రామనాథంబాబు పార్టీ కార్యక్రమాలలో కనిపించడం లేదు. మరో మాజీ ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్‌ ఇంటికి ప్రారంభంలో వెళ్లి ఆయన ఏర్పాటు చేసిన అనుచరుల సమావేశంలో బాలాజీ పాల్గొన్నారు. ఆ తరువాత ఇక స్వగ్రామమైన యద్దనపూడిలో జరిగిన పార్టీ కార్యక్రమానికి కూడా ఆయనను ఆహ్వానించలేదు. దీనితో ఆయనతోపాటు ఆయన అనుచరులంతా అలకపాన్పు ఎక్కారు. అటుచూస్తే టీడీపీలోకి గ్రామ, వార్డు స్థాయిలో ఓటర్లపై పట్టు ఉన్న నాయకులంతా పొలోమని వలసలు పోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ వలసల పర్వం అధికంగా ఉండడం విశేషం. ఎన్నికల ప్రణాళిక నిర్వహణలో ఆరితేరిన టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ఎక్కడికక్కడ పార్టీలోని పాత నాయకత్వం, కొత్తగా చేరే వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవడంలో నిమగ్నమయ్యారు.

చీరాలలో కుదుటపడని కుంపటి

చీరాల నియోజకవర్గంలో వైసీపీ నేతల ఐక్యతకు పార్టీ అధిష్ఠానం చేసిన ప్రయోగాలు ఏవీ ఫలించడం లేదు. ఆ పార్టీలో ఉన్న బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు టీడీపీలో చేరిపోయారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్‌ను పార్టీ అభ్యర్థితో సమన్వయం చేసేందుకు రంగంలోకి దిగిన కొందరు పెద్దలు చివరికి చేతులు ఎత్తివేశారు. అడపాదడపా రోజు మార్చిరోజు ఆయన నియోజకవర్గంలోని అనుచరులతో భవిష్యత్తు రాజకీయంపై మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఆమంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి వచ్చే అవకాశాలు పెరిగాయి. దీంతో అధిష్ఠానం ఆయనను కట్టడి చేసేందుకు బ్రహ్మాస్తం ప్రయోగించింది. ఆయన, వారి బంధువుల వ్యాపార సంస్థల విద్యుత్‌ బకాయిలు ఉండటాన్ని వెలుగులోకి తీసింది. పార్టీ లైన్‌ తప్పితే విద్యుత్‌ లైన్‌ కట్‌ అవుతుందంటూ హెచ్చరించింది. ఇతరత్రా ఉన్న కొన్ని వ్యవహారాలను వెలుగులోకి తీసే పనిలో యంత్రాంగం పడిపోయింది. ఈ రేసులో ఆమంచి వెనక్కు తగ్గుతారా, సమరానికి సై అంటారా అనేది తేలాల్సి ఉంది. అయితే చీరాలలో తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా వచ్చిన వైసీపీ అభ్యర్థి వెంకటే్‌షను గెలువనిచ్చే పని లేదంటూ ప్రజల్లో చెబుతున్నట్లు సమాచారం. టీడీపీ అభ్యర్థి ఎం.ఎం.కొండయ్య నియోజకవర్గంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా దూసుకుపోయే చర్యల్లో ముందున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 11:01 PM