నాడు భగభగ.. నేడు ధగధగ
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:11 AM
పందిళ్లపల్లెలో దశాబ్దం నుంచి శాంతి కుసుమాలు విరబూస్తున్నాయి. రక్తపుటేళ్లు పారిన వీధుల్లో చైతన్యపవనాలు వీస్తున్నాయి. యువత చైతన్యం, స్ఫూర్తితో గ్రామం అచ్చమైన పలె ్లఅందాలను అద్దుకుంటోంది.
రక్తపుటేరులు పారిన పందిళ్లపల్లెలో చైతన్య పవనాలు
తొలుత విద్యాభివృద్ధితో గ్రామ రూపురేఖలు మార్పు
పెద్దల ఫ్యాక్షనిజాన్ని తరిమికొట్టిన నేటి తరం
అందరూ ఏకమై పాఠశాలల అభివృద్ధికి రూ.90లక్షలు వసూలు
సేవా కార్యక్రమాల నిర్వహణ
ఆ గ్రామంలో ఒకప్పుడు ప్రత్యర్థి కనిపిస్తే చాలు చంపేయండ్రా అంటూ కేకలు ప్రతిధ్వనించేవి. ఒంటరిగా కాలు కదపాలంటే భయం, చీకటి పడిందంటే గుంపులు గుంపులుగా వెళ్లాల్సిందే.. ఒకవేళ తప్పనిసరై బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో, రారో అని ఆందోళన, తోడు లేకుండా పొలం వెళ్లాలంటే చావును కొని తెచ్చుకున్నట్లేనని భయం వెంటాడుతుండేది. ఈ క్రమంలో హత్యకు ప్రతి హత్యలు జరిగాయి. నడిరోడ్డుపై ఒకరిని.. బత్తాయి చెట్లకు నీరుపెట్టేందుకు వెళ్లిన మరొకరిని.. ఊరు బయటకు వెళ్లిన ఇంకొకరిని.. హత్య చేసి పెట్రోల్‌తో కాల్చి వేరొకరిని మాటు వేసి మట్టుబెట్టేవారు..! వరుస హత్యలతో కరుడు గట్టిన ఫ్యాక్ష్యనిజం గ్రామంగా జిల్లాలోనే చరిత్ర కెక్కిన బేస్తవారపేట మండలం పందిళ్లపల్లె పోలీసు రికార్డులోకి ఎక్కింది.
కక్షలతో చితికిపోయిన ఆ గ్రామంలో నేడు
పందిళ్లపల్లెలో దశాబ్దం నుంచి శాంతి కుసుమాలు విరబూస్తున్నాయి. రక్తపుటేళ్లు పారిన వీధుల్లో చైతన్యపవనాలు వీస్తున్నాయి. యువత చైతన్యం, స్ఫూర్తితో గ్రామం అచ్చమైన పలె ్లఅందాలను అద్దుకుంటోంది. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో ఉన్న వారందరినీ సుఫల్ వెల్ఫేర్ సొసైటి పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటుచేసి అందులో చేర్చారు. గతంలో హత్యకు గురైన కుటుంబాలు, బంధువులు, ప్రత్యర్థులు, గ్రామస్థులందరూ ఏకమై ఒకే మాటపై నిలిచారు. పిల్లల పుట్టిన రోజులు, పిల్లలకు ఉద్యోగాలు, పెళ్లి రోజు పేరుతో ఆ సొసైటికి చందాలు పంపడం ప్రారంభించారు. సూమారు ఇప్పటికి రూ. 90లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒకే బాటతో స్ఫూర్తిదాయకంగా నిలిచి పందిళ్లపల్లె స్వరూపాన్నే మార్చేసిన ఆ గ్రామ యువతపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. -బేస్తవారపేట
బేస్తవారపేట మండలం పందిళ్లపల్లె ఒకప్పుడు ఫాక్షన్ హత్యలతో అభివృద్ధి ఊసే లేకుండా పోయింది. చివరకు గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్‌కు పిల్లలను పంపాలన్నా తల్లిదండ్రులు భయపడి మాన్పించారు. ఈ దశలో పిల్లలు లేక హైస్కూల్‌ను రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే చివరకు ఎవరూ బతికి బట్టకట్టలేరని యువత ఆలోచించింది. వారందరూ ఏకమై ఫ్యాక్షనిజం అంతానికి నడుం బిగించారు. ముందుగా గ్రామంలో అభివృద్ధి పనులతో అందర్నీ మార్చాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో రచ్చబండ వద్ద సమావేశమై హైస్కూల్, ఎంపీపీ స్కూల్‌ను కాపాడాలని తీర్మానించారు. ఆ మేరకు ఇరువర్గాల పెద్దలందరినీ ఒప్పించారు. ముందుగా మీ బడి పిలుస్తొంది అనే లోగోతో గ్రామ యువకులతో కలిసి వ్యాట్సప్ గ్రూప్, ఫేస్‌బుక్‌ను ఏర్పాటు చేశారు. అందులో విద్యార్థులు లేరని స్కూల్ ఎత్తివేస్తున్నారని, మనం చదివిన హైస్కూల్‌ను కాపాడాలంటే సౌకర్యాలు కల్పించి విద్యార్థుల రోల్ పెంచాలని చేసిన పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇతర దేశాల్లో, ఉద్యోగాల్లో ఉన్న యువకులతోపాటు గ్రామంలో ఉన్న యువకులు కలసి సుఫల్ వెల్ఫేర్ సొసైటి ఏర్పాటు చేసి చందాలు సేకరించగా సుమారు రూ.కోటికి పైగా పోగయ్యాయి. ఆ నిధులతో హైస్కూల్ ఆట స్థలం అభివృద్ధి చేశారు. అదే సమయంలో గ్రామంలోకి బేస్తవారపేట నుంచి ప్రైవేట్ స్కూల్ బస్సులను నిషేధించారు. గ్రామంలో తిరిగి పిల్లలందర్నీ హైస్కూల్‌కే పంపేలా ఒప్పించారు. అంతేగాక హైస్కూల్‌కు ఒక ప్రైవేట్ బస్సును కొనుగోలు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి అక్కడి విద్యార్థులను కూడా ఒప్పించి రప్పించారు. ఉచితంగా రవాణా సౌకర్యం, యూనిఫాం, బూట్లు, బ్యాగులు, బుక్స్‌లు అందిస్తున్నారు. విద్యాబోధన చక్కగా సాగుతుండడంతో 20 మంది ఉన్న హైస్కూల్‌లో 130 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. స్వచ్ఛందంగా డిజిటల్ తరగతి గది, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు.
వివిధ హోదాల్లో ఉండి గ్రామాభివృద్ధికి సహకారం
కర్నాటి రవీంద్రారెడ్డి తహసీల్దార్, మల్లెల శ్రీనివాసరెడ్డి చార్టర్ అకౌంట్, కొత్తకొట రాజశేఖర్ రైల్వే ఉద్యోగి, కర్రాటి వెంకటరెడ్డి బ్యాంక్ ఉద్యోగి, ఆవుల కోటేశ్వరరెడ్డి, మార్తాల జగదీశ్వరరెడ్డి ఆర్‌ఆర్‌బీ, ఉప్పులూరి చంద్రమౌలేశ్వరరెడ్డి ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్, పల్నాటి మహేశ్వరరెడ్డి లేబర్ ఆఫీసర్, మార్తాల వెంకటేశ్వరరెడ్డి లెక్చరర్, కర్నాటి సాయి కుమార్‌రెడ్డి ఎన్డీఏ, మండ్ల రంగస్వామి, పల్నాటి సందీ్‌పరెడ్డి రైల్వే డ్రైవర్లు, పొలక బాలకృష్ణారెడ్డి, మండ్ల నెమిలిగుండం పోలీస్, ఆవుల మౌనిక, కర్నాటి తిరుపతిరెడ్డి టీచర్, రైల్వే ఉద్యోగాలు, పోస్టల్ ఉద్యోగాలు అనేక మందితో పాటు గ్రామంలోని మరో 10మంది ఉపాద్యాయులు, 20మంది ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు, 40 మంది సాప్ట్‌వేర్లు, ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్స్, వివిధ ఉద్యోగాల్లో ఉన్న మరో 30 మంది, 20 మంది ఉద్యోగ విరమణ పొందిన వారందరు కలసి గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు.
రూ.5లక్షలతో బస్సు ఏర్పాటు
యువత పొగు చేసిన సొమ్ము రూ.90లక్షలు కావడంతో అందులో రూ.5లక్షలతో ప్రయివేట్ బస్సు కొనుగోలు చేశాం. ప్రతి నెలా రూ.25వేలు బస్సు ఖర్చు కింద కేటాయించాం.
సొసైటి తరఫున ఎంప్లాయిమెంట్ రిజిష్టర్ ఏర్పాటు
మీబడి పిలుస్తొంది స్ఫూర్తితో విద్యాభివృద్ధితోపాటు గ్రామాభివృద్ధిలో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో సుఫల్ వెల్ఫేర్ సొసైటి పవర్ బై మీబడి పిలుస్తొందిని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఏంప్లాయిమెంట్ రిజిష్టర్ ఏర్పాటు చేశారు.విద్యార్థులకు సంప్రాదాయ కళలపై ప్రత్యేక శిక్షణతోపాటు ఆపదలో ఉన్న 200 మందికి రక్తదానం చేశాం. 10వ తరగతిలో ప్రతిభ చూపిన వారి విద్యాభివృద్ధికి సహకారం అందిస్తున్నాం. ఏటా వేసవిలో విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారు.
సంక్రాంతి వచ్చిందంటే సంబరాలే సంబరాలు
ఐదు దశాబ్ధాలుగా గ్రామంలో సామూహికంగా పండుగలు జరుపుకున్న సందర్భాలు లేవు. అయితే యువత కలసి కట్టుగా గ్రామస్థులందరిని ఏకం చేయడంతో ఏటా సంక్రాంతి పండుగ రోజు గతంలో జరిగిన కక్షలు మరచి శ్రీరామాలయం వద్ద అందరూ కలసికట్టుగా ముచ్చటించుకోని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.
యువత ద్వారానే గ్రామాభివృద్ధి
పొలక వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్
మా గ్రామం యువత ద్వారానే అభివృద్ధి జరిగింది. గ్రామంలో పూర్వ విద్యార్థులు కలసి పెద్దలు పెంచుకున్న కక్షలను తరిమికొట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేదు. జిల్లా అధికారులు స్పందించి హైస్కూల్ అభివృద్ధికి సహకరించాలి. పాఠశాల బస్సు నిర్వహణకు ఏటా రూ.3లక్షలు ఖర్చు చేస్తున్నాం. అందరం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం.
యువతతోనే ఫ్యాక్షనిజం అంతం
మార్తాల శ్రీనివాసరెడ్డి
ముందుగా మీబడి పిలుస్తోంది అనే వ్యాట్సప్ రూపకర్త గ్రామంలోని శ్రీనివాసరెడ్డి సెల్ ద్వారా ప్రారంభించారు.నేడు 187 మంది వ్యాట్సప్, 800 మంది ఫేస్‌బుక్ ద్వారా సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు అందిస్తూ అభివృద్ధికి సహకరిస్తూన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. మోక్షగుండంలో ఒక పేద బీటెక్ విద్యార్థి క్యాన్సర్ బారినపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతుంటే మీబడి పిలుస్తొంది సోషల్ మీడియాలో అతని దీన గాథను పోస్ట్ చేస్తే పలు దేశాల నుంచి సూమారు రూ.25లక్షలు బ్యాంక్ అకౌంట్ జమకావడంతో అతని ప్రాణాలు కాపడగలిగారు. నిజంగా యువతకు అభినందనలు.