Share News

భక్తిశ్రద్ధలతో నాగులచవితి

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:41 AM

నాగులచవితి పండుగను మహిళలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలాత్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయం పుట్ట వద్ద మహిళలు పూజలు చేసేందుకు పోటీ పడ్డారు.

భక్తిశ్రద్ధలతో నాగులచవితి

త్రిపురాంతకం, నవంబరు 5 ( ఆంధ్రజ్యోతి ) : నాగులచవితి పండుగను మహిళలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలాత్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయం పుట్ట వద్ద మహిళలు పూజలు చేసేందుకు పోటీ పడ్డారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరై పుట్ట వద్ద పూజలు చేసి పాలు పోశారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని నాగేంద్రునికి, చెరువు కట్టపై ఉన్న నాగేంద్రుని శిలలకు మహిళలు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు పలు గ్రామాలలో ఆలయాల వద్ద పుట్టల్లో పాలు పోసి పూజలు నిర్వహించారు.

పెద్దారవీడు : నాగులచవితి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెద్దారవీడు, కొత్తపల్లి సరిహద్దులలోని పుట్టను నాగులచవితి సంద ర్భంగా సుందరంగా అలంకరించారు. చారిత్రక నేపథ్యంలో నాగులపుట్టలో భక్తులు పాలుపోసి మొక్కు లు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసా లున్నారు. ముఖ్యంగా ఈ పుట్ట వద్ద పూజలు చేస్తే సంతానలేమి సమస్య పరిష్కారమౌతుందని ప్రతీతి. దీంతో మండలంలోని గ్రామాలతోపాటు మార్కాపురం డివిజన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు.

కంభం : నాగులచవితి పండుగ సందర్భంగా మంగ ళవారం కంభం, అర్థవీడు మండలాలలో భక్తులు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని సత్యమ్మగుడి వద్ద, వీరాంజనేయస్వామి దేవాలయం వద్ద, రావిపాడు గ్రామానికి వెళ్లే దారిలో, అలాగే అర్థవీడు, నాగులవరం, మొహిద్దీన్‌పురం గ్రామాలలోని నాగులపుట్టల వద్దకు మహిళ భక్తులు పసుపు, కుంకుమ, పూలు, పాలతో ప్రత్యేక పూజలు చేశారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : కార్తికమాసంలోని నాగులచవితి పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాల్లో నాగమయ్యలకు పూజలు చేశారు. శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయంలో నాగశిలలకు పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. కళ్యాణ నాగమయ్య స్వామి ఆలయంలో నాగుల పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయంలో నాగశిలలకు పూజలు చేశారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు. పట్టణంలోని పలు ఆలయాల్లో నాగులచవితి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

పొదిలి : మండలంలోని కంభాలపాడు గ్రామంలో వెలసిన అంకాలపరమేశ్వరిదేవికి కార్తీకమాసం సందర్భంగా మంగళవారం మహాచండీహోమాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య చండీహోమాన్ని ప్రారంభిం చారు. ముందుగా గణపతి పూజ, కలశస్థాపన కార్యక్రమంతో కార్యాక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారి చండీహోమం కార్యక్రమంలో పాల్గొనేందకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని అమ్మవారికి చీర సారెతోపాటు మొక్కులు తీర్చుకు న్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్త్తెకుండా ఆలయ కమిటీ సభ్యులు బెల్లంకొండ విజయలక్ష్మీ సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా నాగులచవితి పండుగను మండల ప్రజలు మంగళ వారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలో విరాట్‌నగర్‌, నిర్మామహేశ్వరస్వామి దేవాలయంలో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి నాగమయ్యకు పాలపోసి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా కార్తీకమాసం, నాగుల చవితి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు.

Updated Date - Nov 06 , 2024 | 12:41 AM