Share News

వైసీపీ నిర్లక్ష్యం.. జనానికి శాపం!

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:30 AM

అనుకున్నంతా అయ్యింది.. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. గ్రామీణవాసుల తాగునీటి కష్టాలకు ఇప్పట్లో శాశ్వత పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం)కు సకాలంలో రాష్ట్రప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయక పథకం నత్తనడకన సాగింది.

వైసీపీ నిర్లక్ష్యం.. జనానికి శాపం!
మల్టీ విలేజ్‌ స్కీం కింద గొట్టిపడియ వద్ద నిర్మాణంలో ఉన్న ఇన్‌టేక్‌ వెల్‌ (ఫైల్‌)

రూ.412.89 కోట్ల జలజీవన్‌ మిషన్‌ పనులు రద్దు

పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్ల ఎంవీఎస్‌ పనులు కూడా క్యాన్సిల్‌

గత ఐదేళ్లలో పట్టించుకోని ఫలితం

తిరిగి కొత్త ప్రతిపాదనలు సిద్ధం

అనుకున్నంతా అయ్యింది.. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. గ్రామీణవాసుల తాగునీటి కష్టాలకు ఇప్పట్లో శాశ్వత పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం)కు సకాలంలో రాష్ట్రప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయక పథకం నత్తనడకన సాగింది. జిల్లాలో మూడో వంతు పనులు కూడా ముందుకు సాగలేదు. నిజానికి వర్షాకాలంలోనూ తాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి ఉన్న మన జిల్లాలాంటి ప్రాంతానికి వరంలాంటిది జేజేఎం పథకం. అయితే గత వైసీపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరితో ఆ పథకాన్ని పెద్దగా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో రూ.412.89 కోట్ల పనులు రద్దయ్యాయి.

ఒంగోలు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ పథకం పనులు పూర్తిచేయడంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో గొంతెండుతున్న ప్రజలకు శాపంగా మారింది. వారి దాహార్తిని తీర్చేందుకు ఈ పథకం కింద చేపట్టిన పనులలో మూడో వంతు కూడా కేంద్రం ఇచ్చిన గడువు ముగిసేలోపు పూర్తిచేయలేకపోయింది. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పనులను రద్దు చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు అధికారులకు అందాయి. అందులో జిల్లాలో రూ.412.89 కోట్ల విలువైన 1,102 పనులు ఉన్నాయి. అలాగే పశ్చిమప్రాంతంలోని నాలుగు నియోజకవర్గాల్లో తాగునీటి సరఫరా కోసం వైసీపీ ప్రభుత్వం రూ.1,290 కోట్లతో ఆర్భాటంగా ప్రకటించిన మల్టీ విలేజ్‌ స్కీం(ఎంవీఎస్‌)కు కూడా టెండర్లు పిలిచి పనులు చేయని కారణంగా ప్రస్తుత ప్రభుత్వం రద్దుచేసింది.

రాష్ట్రం వాటా ఇవ్వకనే..

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా కోసం జలజీవన్‌ మిషన్‌ పేరుతో భారీ పథకాన్ని చేపట్టింది. ఇందుకు అవసరమైన నిధుల్లో 50శాతం రాష్ట్రాలు భరిస్తే మిగిలిన 50శాతం గ్రాంటుగా కేంద్రం ఇచ్చింది. ఐదేళ్లలో మొత్తం పనుల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి చేసిన పనులకు అనుగుణంగా నిధులను కేంద్రం ఇచ్చింది. ఈ పథకాన్ని పలు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోగా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. వాటా నిధులు ఇవ్వకపోవడంతో చాలావరకు పనులు ముందుకు సాగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులేత్తేశారు.

16శాతం మాత్రమే పూర్తి

అప్పట్లో జిల్లాకు జలజీవన్‌ మిషన్‌ కింద రూ.696.77 కోట్లతో 2,571 పనులను మంజూరు చేశారు. అత్యధిక గ్రామాల్లో భూగర్భ జలాలు, కొన్నిచోట్ల ఇతర వనరుల ఆధారంగా ప్రతిపాదించారు. అయితే 2019-24 మధ్య కాలంలో ఈ పనులు పూర్తిచేయాల్సి ఉండగా కేవలం రూ.110.39 కోట్లు విలువైన 1,103 పనులు మాత్రమే చేశారు. అంటే మంజూరుచేసిన పనుల విలువలో కేవలం 16శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయి. మరో 294 పనులు వివిధ దశల్లో ఉండగా వాటి విలువ రూ.200 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అంటే తక్కువ వ్యయం చేసే పనులు మాత్రమే పూర్తిచేశారని స్పష్టమవుతోంది. కాగా 291 పనులకు టెండర్లు ఖరారు చేసినా పనులు చేపట్టకపోగా మరో 883 పనుల విషయం అసలు పట్టించుకోలేదు.

రద్దుచేస్తే నిధులతోపాటు గడువు పెంచవచ్చు

ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జలజీవన్‌ మిషన్‌ పనులపై సీఎం స్థాయిలో సమీక్ష చేయగా అత్యధిక శాతం పనులు చేయకుండానే పథకం కాలం ఐదేళ్లు పూర్తయింది. దీంతో కేంద్రప్రభుత్వాన్ని మరికొంత గడువు కోరగా వచ్చే ఏడాది వరకు సమయం పెంచింది. అది కూడా సరిపోదని 2027 వరకు గడువు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్రప్రభుత్వం లేఖ రాసింది. ఈలోపు రాష్ట్రంలో జేజేఎం పనులు ముందుకు సాగక పోవడానికి కారణాలను పరిశీలించింది. కొత్త పనులను ప్రతిపాదిస్తే కేంద్రం నుంచి తాజా అంచనాల ప్రకారం నిధులు, సమయం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో అందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వ కాలంలో జేజేఎం కింద మంజూరైన ప్రారంభంకాని పనులను అలాగే 25శాతంలోపు మాత్రమే జరిగిన పనులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది.


పనులు చేయని కాంట్రాక్టర్లు

వాస్తవానికి ఎంవీఎస్‌ పథకాన్ని 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కనిగిరితోపాటు మరో రెండు నియోజకవర్గాలకు కలిపి వెలిగొండ నీరు ఆధారంగా ప్రతిపాదనలు తయారయ్యాయి. అప్పట్లో రూ.వెయ్యి కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నాటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దుచేసి నాలుగు నియోజకవర్గాలకు కలిపి రూ.1,290 కోట్లతో తిరిగి మంజూరు చేశారు. టెండర్లను కూడా పిలిచి తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టినా కూడా పనులు చేయలేదు. దీంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జేజేఎం పనులతోపాటు ఈ పథకం టెండర్లను కూడా రద్దుచేసింది. కాగా జేజేఎం పనులతోపాటు ఈ పథకాన్ని మరింత విస్తరించి కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా కలిపి సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Dec 24 , 2024 | 01:30 AM