Share News

పచ్చదనం లేదు.. పరిశుభ్రత లేదు..

ABN , Publish Date - May 30 , 2024 | 12:24 AM

దేశవ్యాప్తంగా పట్టణాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా సప్లైచానల్‌ అభివృద్ధి పనులకు రూ.1.20కోట్ల నిధులు మంజూరు చేశాయి.

పచ్చదనం లేదు.. పరిశుభ్రత లేదు..

మార్కాపురం రూరల్‌, మే 29: దేశవ్యాప్తంగా పట్టణాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా సప్లైచానల్‌ అభివృద్ధి పనులకు రూ.1.20కోట్ల నిధులు మంజూరు చేశాయి. కానీ ఆచరణలో మాత్రం అదేం జరగలేదు. పచ్చదనం, పరిశుభ్రత అంతకన్నా లేదు. పైగా నివాసాల నుంచి వచ్చే మురుగు నీటితో ఆ ప్రాంతంతా దుర్వాసన వెదజల్లుతోంది.

గుండ్లకమ్మ నది నుంచి మార్కాపురం చెరువులోకి వరద నీటి సరఫరా కోసం గతంలో సప్లై చానల్‌ ఏర్పాటు చేశారు. మార్కాపురం పట్టణం మధ్యలో నుంచి ఇది వెళుతోంది. గుండ్లకమ్మ నదిలో నీటిప్రవాహం అధికంగా ఉన్న సమయంలో మార్కాపురం చెరువులోనికి ఆ నీటిని పంపిస్తారు. జనావాసాల మధ్య ఉండే చానల్‌కు ఇరువైపుల మంచి ఆహ్లాదకరంగా మార్చాలన్న సదుద్దేశంతో అర్బన్‌ గ్రీన్‌ ప్రాజెక్టు కింద రూ.1.20కోట్లను మంజూరు చేశారు. ఆ నిధులతో అహ్లాదకరంగా కనిపించే వివిధ మొక్కలను పెంచి వాటికి రక్షణగా ఇనుపకంచెను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వాస్తవంగా సప్లై చానల్‌లో అటువంటి పనులు ఏమి జరగలేదని విమర్శలు వస్తున్నాయి. సప్లైచానల్‌కు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి కేవలం కంచెను మాత్రమే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా మొక్కలను నాటి వాటిని సంరక్షించిన దాఖలాలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. నామమాత్రంగా పనులు చేసి నిధులు కాజేశారని అర్బన్‌ గ్రీన్‌ప్రాజెక్ట్‌ అధికారులపై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

మురుగునీటి నిల్వతో దుర్గంధం

సప్లైచానల్‌కు ఇరువైపులా నివాసాలు ఉన్నాయి. గతంలో మాదిరిగా వృధా మురుగు నీరు సప్లై ఛానల్‌లోకి ప్రవేశించేలా స్థానికులు కొందరు పైపులు ఏర్పాటు చేసుకున్నారు. సప్లై ఛానల్‌కు కొంత దూరంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ నుంచి కూడా మురుగనీరు సైతం సప్లై ఛానల్‌ లోనికి మళ్లించారు. దీంతో ఈ కాలువ మురుగునీటి కాలువగా మారింది. బాగా వచ్చిన మురుగు నీరు అంతా నివాసాల మధ్యలోనే నిల్వ ఉండడంతో ఆ ప్రాంతంలో వెళ్లాంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా గ్రీనరీ పనులు పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Updated Date - May 30 , 2024 | 12:24 AM