Share News

అవినీతి లెక్కతేల్చిన అధికారులు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:32 AM

ఎక్సైజ్‌ శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై జిల్లా అధికారులు లెక్కతేల్చారు. కమిషనర్‌కు మంగళవారం నివేదిక పంపారు. ఆ ప్రకారం ఒంగోలులో ఉన్న రెండు ఎలైట్‌ మాల్స్‌లో రూ.2.34 కోట్లు గోల్‌మాల్‌ అయ్యాయి.

అవినీతి లెక్కతేల్చిన అధికారులు
కమిషనరేట్‌కు చేరిన ఎక్సైజ్‌ గోల్‌మాల్‌

రూ.30 లక్షలు రికవరీ

మాల్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు

మధ్యవర్తుల ద్వారా కానిస్టేబుల్‌ రమణతో చర్చలు

ఒంగోలు క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఎక్సైజ్‌ శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై జిల్లా అధికారులు లెక్కతేల్చారు. కమిషనర్‌కు మంగళవారం నివేదిక పంపారు. ఆ ప్రకారం ఒంగోలులో ఉన్న రెండు ఎలైట్‌ మాల్స్‌లో రూ.2.34 కోట్లు గోల్‌మాల్‌ అయ్యాయి. ఆ విషయాన్ని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ మొత్తంలో ఆ మాల్స్‌ వెరిఫికేషన్‌ అధికారి అయిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రమణ సూత్రధారిగా ఉన్నప్పటికీ ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు అక్కడ పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్ల పాత్రను కూడా లెక్కతేల్చారు. మొత్తం ఎనిమిది మంది ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తుండగా వారికి నోటీసులు జారీ చేశారు. వారు సుమారు రూ.50లక్షలు మాయం చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మిగిలిన రూ.1.74 కోట్లు రమణ దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కొంతమంది మధ్యవర్తుల ద్వారా అధికారులు అజ్ఞాతంలో ఉన్న రమణతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి రూ.1.20కోట్లు దశలవారీగా ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. ఈమేరకు సోమ, మంగళవారాల్లో రూ.30 లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ప్రైవేటు ఉద్యోగుల నుంచి నగదు రాబట్టే ప్రయత్నంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కమిషనర్‌ వద్దకు పంచాయితీ

విజయవాడలో ఉన్న ఎక్సైజ్‌ కమిషనర్‌ వద్దకు మంగళవారం ఒంగోలు ఈఎస్‌, ఒంగోలు ఎక్సైజ్‌ సీఐలు వెళ్లారు. శాఖలో దుర్వినియోగమైన నగదు గురించి నివేదిక ఇచ్చి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు. అయితే ప్రైవేటు ఉద్యోగుల మాత్రం తమకు ఏమి సంబంధం లేదు, మొత్తం రమణనే బాధ్యుడని చెబుతున్నారు. ఇదిలాఉండగా అతను అజ్ఞాతంలో ఉండి మధ్యవర్తుల ద్వారా రూ.30లక్షలు జమ చేసినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారులు గోల్‌మాల్‌ అయిన నగదు రికవరీపై దృష్టిపెట్టారు. అందుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్నను విచారణ అధికారిగా నియమించారు. ఈమేరకు ఆమె విచారణ చేసి నివేదిక ఇచ్చారు. అదేక్రమంలో ఒంగోలు ఏఈఎస్‌ ఈ.వెంకట్‌ శాఖాపరమైన విచారణ చేశారు. చర్యల కంటే కూడా నగదు రికవరీపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు సమాచారం. కాగా కమిషనర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Oct 23 , 2024 | 01:33 AM