Share News

రోగులు ఫుల్‌- వసతులు నిల్‌

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:30 AM

కంభం ప్రభుత్వ వైద్యశాలకు వివిధ సమస్యలపై వచ్చే రోగుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ, కనీస వసతులు మాత్రం అందుబాటులో ఉండడం లేదు.

రోగులు ఫుల్‌- వసతులు నిల్‌

కంభం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కంభం ప్రభుత్వ వైద్యశాలకు వివిధ సమస్యలపై వచ్చే రోగుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ, కనీస వసతులు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. నిత్యం 200కు పైనే ఓపీలు నమోదవతున్నాయి. ఇన్‌పేషంట్లు ఎక్కువ మందే ఉంటున్నారు. ప్రభుత్వ వైద్యసేవలను చిరు నామాగా కంభం వైద్యశాల ఉన్నప్పటికీ, వసతుల లేమి ఇక్కడ వెక్కిరిస్తోంది.

వైద్యశాలలో తాగునీరు, విద్యుత్‌ జనరేటర్‌, అంబు లెన్స్‌ వంటి మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఈ సమస్యలు పరిష్కరంచేందుకు కనీసం వైద్యశాల అభివృద్ధి కమిటీ కూడా లేకపోవడం గమ నార్హం. కంభం ప్రభుత్వ వైద్యశాలకు కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల నుంచి నిత్యం వందలాది మంది వివిధ వైద్యపరీక్షల కోసం వస్తుం టారు. ఈ 50 పడకల వైద్యశాలకు అనుగుణంగా వైద్య సిబ్బందిని పెంచకపోవడం, కంభంలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను బేస్తవారపేట పీహెచ్‌సీకి బదిలీ చేయడం, వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాలంటే అవసర మైన హెచ్‌డీఎస్‌ ఫండ్స్‌ లేక పోవడం దీనికి శాపంగా మారింది.

నీరు లేక అవస్థలే..

ముఖ్యంగా బోరు ఎండిపోవడంతో ఐదేళ్ల క్రితం ఆర్‌వో ప్లాంటును ఏర్పాటు చేయగా మరమ్మతులకు గురికావడంతో ఏడాదికాలంగా అలంకారప్రాయంగా ఉండిపోయింది. రోగులు బయట నుంచి నీరు తెచ్చు కుంటుకున్నారు. మరుగుదొడ్లకు కూడా నీరు లేక ఇన్‌పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అదనంగా నూతన బోరును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జనరేటర్‌ చెడిపోవడంతో రాత్రివేళ కరెంటు పోతే ఇబ్బందే. ఇక్కడ ప్రతిరోజూ ప్రసవాలు జరుగుతుంటాయి. ఆపరేషన్‌ చేసే సమయంలోనూ, కరెంటు పోతే సెల్‌ఫోన్ల లైట్ల సహాయంతో పని చేయాల్సి వస్తోంది. పోస్టుమార్టంలది అదే పరిస్థితి. దశాబ్దకాలం క్రితం అంబులెన్స్‌ చెడిపోయింది. దాన్ని ఇటీవలే పూర్తిగా తుక్కు చేసి విక్రయించేరు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు ప్రైవేటు వాహనాలపై ఆధారపడ వలసి వస్తోంది. ఇక అత్యవసర అపరేషన్లకు రక్తనిల్వ కేంద్రాలు లేవు. 15 మంది వైద్యులకు గాను కేవలం 10 మంది ఉన్నారు. అత్యవసరమైన జనరల్‌ సర్జన్‌, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు ఇక్కడ అందుబాటులో లేరు. కేవలం తల్లీ బిడ్డకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

కంభం వైద్యశాలలో వసతుల లేమిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వైద్యశాలలో నెలకొన్న సమస్యలపై జిల్లా వైద్యాధికారులు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం.

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శిరీష

Updated Date - Nov 15 , 2024 | 12:30 AM