వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి ప్రతిష్ఠోత్సవం
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:49 PM
మండలంలోని కొండమంజులూరు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిన కొండమంజులూరు గోవింద నామంతో హోరెత్తింది.
గోవింద నామ స్మరణతో పులకించిన కొండమంజులూరు
కల్యాణాన్ని తిలకించి తరించిన భక్తజనం
పంగులూరు, డిసెంబరు, 23 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొండమంజులూరు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిన కొండమంజులూరు గోవింద నామంతో హోరెత్తింది. నిర్ణీత దివ్య ముహూర్తంలో ప్రముఖ వేద పండితులు శ్రీ రొంపిచర్ల వెంకట సత్యనారాయణాచార్యులు వారి పరివారంతో ఆలయ మూలవిరాట్ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారు, ద్వారపాలకులు, విమాన శిఖర కలశ, జీవద్దజ పీఠారోహనం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గాలి గోపురం, కలశ ప్రతిష్ఠాపనతో శోభను సంతరించుకున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంను తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంతో పూజలు చేశారు.
వేద మంత్రోచ్ఛారణతో మహాపూర్ణాహుతి స్వామివారి శాంతి కల్యాణం
దేవతామూర్తుల ప్రతిష్ఠాపన అనంతరం పీరబంధనం, ప్రాతఃసవనం, వాస్తుశుద్ధి ప్రధాన హోమం, కలాన్యాసం, దృష్ఠికుంభం దేనుదర్శనం, కుంభాభిషేకం, శ్రీ స్వామివారి దివ్యమంగళ విగ్రహ సందర్శనం, మహర్నివేదన, హారతి, ఆచార్యాది దక్షిణాదానం నిర్వహించి మహాపూర్ణాహుతిని గావించారు. అనంతరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి శాంతి కల్యాణ మహోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శాంతి కల్యాణ మహోత్సవంలో 20 మంది సతీసమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. వేద పండితులు శ్రీ రొంపిచర్ల వెంకట సత్యనారాయణాచార్యులు, వారి శిష్య బృందంతో పాటు ఆలయ అర్చక స్వాములు ప్రసాద్‌బాబు, శ్రీనివాస్, రాంబాబులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన హర్షవర్ధన్
కొండమంజులూరు గ్రామంలో సోమవారం జరిగిన ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పున ర్ నిర్మాణ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈవో కోటిరెడ్డితో పాటు చింతల సహదేవుడు, బత్తుల వెంకటరావు, రావుల బాపయ్య, కల్లూరి కోటేశ్వరరావు, బొప్పూడి నాగేశ్వరరావు, దొప్పలపూడి వీరయ్య, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుక్కపల్లి ఏడుకొండలు, మస్తాన్‌వలి, ఓబుల్‌రెడ్డి, గుర్రం ఆదిశేఖర్, రావూరి రమేష్, భానుప్రకాష్ అశోక్, అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి, జంపని రవిబాబు, రవిబాబు, పానెం నరసింహారెడ్డి, మన్నె రామారావు, రాజేష్ , హరిబాబు పాల్గొన్నారు.
భారీ అన్నదానం
ప్రతిష్ఠోత్సవానికి గ్రామస్థులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధువులు, స్నేహితులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీవారు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.