Share News

ఎర్రజెండా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే...

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:26 PM

ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటోందని, ప్రభుత్వాలు మారుతున్నా పేదల బతుకులు మారడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు.

ఎర్రజెండా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే...
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రభుత్వాలు మారుతున్నా పేదల బతుకులు మారడంలేదు

సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

చీరాలటౌన్‌, డిసెంబరు30 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటోందని, ప్రభుత్వాలు మారుతున్నా పేదల బతుకులు మారడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. సోమవారం చీరాల పట్టణంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యేల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగ సమస్య పరిష్కారంవైపు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు. రైతన్నలు కూడా సమస్యలతో కుమిలిపోతూ ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. బాలికలు, స్ర్తీలపై దాడులు పేట్రేగిపోతున్నట్లు పేర్కొన్నారు. దేశమంతా పర్యటిస్తున్న ప్రధాని మోదీకు మణిపూర్‌ గోడు కానరాలేదా అని ప్రశ్నించారు. సాక్షాత్తు పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానిస్తే అఽధికార పార్టీ లేక ప్రతిపక్ష నేతలు ఎవరూ కూడా పన్నెత్తి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. జగన్‌ పాపాలు శాపాలుగా మారి స్మార్ట్‌ మీటర్లు ఏర్పడినట్లు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వెంటనే స్మార్ట్‌ మీటర్లు నిరోధించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యను పరిష్కరించాలని కోరారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు అర్జీలు స్వీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పారు. స్థానిక వైద్యులు గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ శ్రామికుల శ్రమను గుర్తించిన పార్టీ సీపీఐ అని చెప్పారు. ఇటీవల జాతీయస్థాయిలో అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన అడిగోపుల సాంబశివరావును సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వెంకట సుబ్బయ్య, జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, మేడా వెంకటరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:26 PM