సమగ్రాభివృద్ధి కోసమే ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:11 AM
మార్కాపురం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసమే పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు స్థానిక శాసన సభ్యుడు కందుల నారాయణరెడ్డి అన్నారు.
మార్కాపురం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసమే పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు స్థానిక శాసన సభ్యుడు కందుల నారాయణరెడ్డి అన్నారు. జవహర్‌నగర్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టణ జనాభా నానాటికి పెరుగుతోందన్నారు. ప్రస్తుతం లక్షకు పైచిలుకు చేరిందన్నారు. అదే సమయంంలో రహదారులు మాత్రం కుంచించుకుపోతున్నా యన్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య జఠిలమైంద న్నారు. అంతేకాక ఎక్కడా పార్కింగ్‌కు అవ కాశం లేకుండా పోయిందన్నారు. పారిశుధ్ధ్య కార్యక్రమాలు చేపట్టడం కూడా మున్సిపల్ పారిశుద్ధ్య విభాగానికి తలకు మించిన పనైంద న్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం 20 రోజుల క్రితమే సర్వేచేసి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చిందన్నారు. కానీ ఎవరూ పట్టించుకోక పోవడంతోనే చర్యలు తీసుకున్నామన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కొంతమేర సమయం ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేశార న్నారు. నోటీసులు ఇచ్చి బెదిరించి తాము లంచాలు తీసుకు న్నామని కొందరు విషప్రచారం చేశార న్నారు. ఈ పద్ధతులు మార్చుకోవాలన్నారు. త్వరలో మార్కాపురం పట్టణానికి రోజు మార్చి రోజు సాగర్ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణం లోని ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు రూ.62 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. అంతేకాక దూపాడు వద్ద సాగర్ కాలువ నుంచి ఎస్‌ఎస్ ట్యాంకులోకి నీటిని వేగంగా పంపింగ్ చేసేందుకు రూ.3.5 కోట్లతో రెండో పైప్‌లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతుంద న్నారు. మెడికల్ కాలేజీ తరలి పోతోందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయ న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారమే అయినా పీపీపీ పద్ధతిలో కళాశాలను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంద న్నారు.
జిల్లా ఏర్పాటే ప్రధాన లక్ష్యం
పశ్చిమ ప్రకాశ ప్రజల ఆకాంక్ష మేరకు నూతనంగా జిల్లా ఏర్పాటు, ఈ ప్రాంత ప్రజల వరప్రదాయిని అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వెలిగొండ విషయంలో ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నా నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టు పూర్తయినట్లు మాయమాటలు చెప్పి జాతికి అంకితం చేశారన్నారు. తాము ఇప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు చేసినా మరో రెండేళ్లు సమయం పడుతుందన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు జిల్లా ఏర్పాటుకు సముఖంగా ఉన్నాయని, సీఎం చంద్రబాబునాయుడు కూడా జిల్లా ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లిఖార్జున్, కనిగిరి బాలవెంకటరమణ, మాలపాటి వెంకటరెడ్డి, కందుల రామిరెడ్డి, దొడ్డా రవికుమార్, గొలమారి నాసర్‌రెడ్డి, రంగస్వామి, ఈవీఎల్ తదితరులు పాల్గొన్నారు.