పదేపదే అదే రైస్‌మిల్లు..!
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:24 AM
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి ఉప్పుగుండూరులోని గంగమ్మ హోటల్ సెంటర్ వద్ద మట్టిగుంటరోడ్డులో ఉన్న రైస్‌మిల్ అడ్డాగా మారింది. రేషన్‌మాఫియా తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు సదరు రైస్‌మిల్లును లీజుకు తీసుకొని తమ దందాను యఽథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
రేషన్‌మాఫియాకు అడ్డాగా ఉప్పుగుండూరు
దాడులు జరుగుతున్నా ఆగని బియ్యం దందా
నాగులుప్పలపాడు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి ఉప్పుగుండూరులోని గంగమ్మ హోటల్ సెంటర్ వద్ద మట్టిగుంటరోడ్డులో ఉన్న రైస్‌మిల్ అడ్డాగా మారింది. రేషన్‌మాఫియా తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు సదరు రైస్‌మిల్లును లీజుకు తీసుకొని తమ దందాను యఽథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు అక్రమ రేషన్‌బియ్యం వ్యాపారాన్ని ఉప్పుగుండూరులోని అదే రైస్‌మిల్లు ద్వారా కొనసాగించారు. అప్పట్లోనే అనేకసార్లు దానిపై విజిలెన్, పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున నిల్వ చేసిన రేషన్‌బియ్యం బస్తాలను సీజ్ చేసి స్వాధీనం చేసుకొన్నారు. ఉప్పుగుండూరులో గత వైసీపీ ప్రభుత్వం నుంచి రేషన్ మాఫియాకు అడ్డాగా మారిన అదే రైస్‌మిల్లును తాజాగా కొందరు వ్యక్తులు లీజుకు తీసుకొని ఒంగోలు, చీరాలతో పాటు నాగులుప్పలపాడు మండలంలోని కొన్ని గ్రామాలలో సేకరించిన రేషన్ బియ్యాన్ని అందులోకి తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని రీపాలీష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకొంటున్నారు. ఈనేపథ్యంలో గురువారం రాత్రి ఈ అక్రమ రేషన్‌దందా విషయాన్ని అజ్ఞాతవ్యక్తులు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గోతాలు మార్చకుండా పెద్దఎత్తున నిల్వచేసిన రేషన్‌బియ్యం బస్తాలను గుర్తించి సీజ్‌చేశారు. ఉప్పుగుండూరులోని అదేరైస్ మిల్లులో పదేపదే అక్రమ రేషన్ బియ్యం దందాలపై దాడులు జరుగుతున్నా రేషన్ మాఫియాకు చెందిన వ్యక్తులు తమ అక్రమ వ్యాపారం కొనసాగించడం వెనక అధికార పార్టీ అండదండలతోనే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పట్టుబడిన రేషన్‌బియ్యం తరలింపు
నాగులుప్పలపాడు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉప్పుగుండూరులోని గంగమ్మ హోటల్ సెంటర్ వద్ద మట్టిగుంట రోడ్డులో గల ఓ రైస్‌మిల్‌లో అక్రమంగా పెద్ద ఎత్తున దాచి ఉంచిన రేషన్‌బియ్యం బస్తాలను గురువారం రాత్రి ఒంగోలు ఆర్డీడో లక్ష్మీప్రసన్న సీజ్ చేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదమం డీఎ్‌సవో పద్మశ్రీ, ఏఎ్‌సవో పుల్లారావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రాజ్యలక్ష్మి రైస్‌మిల్లులో పట్టుబడిన 1,537 రేషన్ బియ్యం బస్తాలను లారీలలో ఒంగోలులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. కాగా రైస్‌మిల్లులో దాడులు జరిగిన సమయంలో 3వేల బస్తాలకు పైగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరుసటి రోజు అధికారుల చెప్పిన లెక్కలలో వ్యత్యాసం ఉండటం పట్ల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లుగా ప్రజలు చర్చించుకొంటున్నారు.