Share News

గౌరవించండి.. పనులు చేయండి

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:31 AM

‘ప్రజాప్రతినిధులను గౌరవించండి. వారు చెప్పిన సంక్షేమ, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. చట్టాలు, నిబంధనలకు లోబడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినవి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జిల్లా అధికారుల నుంచి గ్రామస్థాయి వరకు అందరూ సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది’ అని ఉన్నతాధికారులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

గౌరవించండి.. పనులు చేయండి
టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కలెక్టర్‌, ఎస్పీలతో సమావేశమైన మంత్రులు ఆనం, స్వామి

అధికారులకు ఇన్‌చార్జి మంత్రి స్పష్టమైన ఆదేశాలు

జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి

రెవెన్యూ, పోలీసు శాఖలపరంగా ఇబ్బందులపై ఎమ్మెల్యేల ఆవేదన

ఆ సీఐ మాట విని మమ్మల్ని అనుమానించకండి

ఎస్పీతో చెప్పిన ఇద్దరు ఎమ్మెల్యేలు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘ప్రజాప్రతినిధులను గౌరవించండి. వారు చెప్పిన సంక్షేమ, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. చట్టాలు, నిబంధనలకు లోబడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినవి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జిల్లా అధికారుల నుంచి గ్రామస్థాయి వరకు అందరూ సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది’ అని ఉన్నతాధికారులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తొలుత అధికారపార్టీ ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఒంగోలు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి తొలుత ఎంపీ మాగుంట నివాసంలో తనను కలిసిన ఎమ్మెల్యేలతో మాట్లాడారు. అక్కడే మంత్రి స్వామిని అడిగి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అధికారుల పనితీరుపై సమాచారం తెలుసుకున్నారు. ఆతర్వాత డీఆర్సీ సమావేశంలో సమస్యలపై చర్చకు ప్రాధాన్యం ఇచ్చారు. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను గమనించారు. ఆతర్వాత పోలీసు అతిథి గృహంలో జిల్లా మంత్రి స్వామి, ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఇన్‌చార్జిలతో సమావేశమై కలెక్టర్‌ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లను ఆహ్వానించి పలు కీలక అంశాలపై సమీక్ష చేశారు.

కిందిస్థాయిలో మార్పు రావాలి

పాలనాధికారులుగా కలెక్టర్‌, ఎస్పీలు పనిచేయటమే కాదు కిందిస్ధాయి అధికారులు కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించినట్లు తెలిసింది. ఇటీవల ఒక ద్వితీయ స్థాయి జిల్లా అధికారి పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక రైతు సమస్యపై ఫోన్‌ చేస్తే సరిగా స్పందించకపోగా దూకుడుగా మాట్లాడినట్లు సమాచారం. ఆ విషయాన్ని వెంటనే జిల్లా మంత్రి స్వామి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లగా సదరు అధికారిని స్వామి పిలిపించి విషయం తెలుసుకొని పనులు చేస్తారా.. లేదా? ప్రజాప్రతినిధి ఫోన్‌ చేస్తే గౌరవంగా మాట్లాడకపోవటం తగదని హెచ్చరించారు. ఆ అంశాన్ని ఇన్‌చార్జి మంత్రి ప్రస్తావిస్తూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లోకి వచ్చిన అధికారులు గౌరవంగా వ్యవహరించే విధంగా చూడాల్సిన బాధ్యత పాలనాధికారులపై ఉందని చెప్పినట్లు తెలిసింది. ఇదేసమయంలో పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్‌ పదేపదే తమ ప్రాంతానికి వచ్చి రేషన్‌ షాపులపై దాడులు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ఆకాశ రామన్న పేరుతో వచ్చే ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని పనిగట్టుకొని కొన్ని షాపులపై దాడులు చేస్తున్నారని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఆ షాపుల్లో ఒక్క లోపం కూడా కనిపించక వెనుతిరిగాడని సమావేశం దృష్టికి తెచ్చాడు. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం ప్రజలతో సంబంధం ఉన్న కీలకమైన పోస్టులో ఉండే అధికారికి ప్రజలు, ప్రజాప్రతినిధులతో ఎలా వ్యవహరించాలో తెలియకపోవటం తమ దురదృష్టకరమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఈ చిన్న పనులకు సహకరించరా..

రేషన్‌ డీలర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కుకింగ్‌ ఏజన్సీల మార్పు, కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలు ఇలాంటి విషయాల్లో తమ మాట చెల్లకపోతే అధికారపార్టీ ఎమ్మెల్యేకు విలువ ఏం ఉంటుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ చిన్న పనులు కూడా చేయలేని వారు మీరేమి ఎమ్మెల్యేలంటూ సొంత పార్టీ కార్యకర్తలు వెక్కిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొందరు అధికారులు చెప్పే కుంటిసాకులతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని అన్నట్లు తెలిసింది. ఆ వెంటనే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఇది ముమ్మాటికి నిజం ఈ విషయంలో మంత్రులు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు సమాచారం.


ఆ సీఐ చెప్పిందే వింటారా

పశ్చిమ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ‘ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చెప్పిన మాటలు విని మమల్ని అపార్థం చేసుకుంటున్నారు.. వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిపొందిన ఆయన కావాలని టీడీపీ ప్రజాప్రతినిధులపై మీకు అసత్యాలు చెబుతున్నాడు.’ అని ఎస్పీతో చెప్పినట్లు తెలిసింది. దానిపై ఎస్పీ స్పందిస్తూ సమాచారం ‘సేకరణకు నా సొంత వ్యవస్ధ ఉంది. మీరు అనుకున్నట్లు ఒక సీఐ మాట వింటున్నాడనే భ్రమ నుంచి బయటకు రండి’ అని వారికి సూచించినట్లు తెలిసింది. ఆ తర్వాత మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి కానిస్టేబుల్స్‌ బదిలీలను ప్రస్తావిస్తూ ఈ విషయంలోను తమకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పినట్లు తెలిసింది. తాము చెప్పినా ఏదో ఒక కారణంతో కానిస్టేబుళ్లను ఇష్టమొచ్చినట్లు బదిలీ చేస్తున్నారని గత ఐదేళ్లు వైసీపీలో ఆయా స్టేషన్లల్లో పెత్తనం చేసిన కానిస్టేబుళ్లకు ఉపయోగకరంగా బదిలీలు జరగబోతున్నట్లు తెలిసిందని అన్నట్లు సమాచారం. ఒక స్టేషన్‌లో ఐదేళ్లు పనిచేసిన కానిస్టేబుల్‌ను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. తర్జనభర్జన అనంతరం అలా బదిలీ చేయాల్సి వస్తే తాము సూచించిన వారిని అక్కడే ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌కు బదిలీచేయాలని కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. ప్రధానంగా మార్కాపురం, ఒంగోలు, దర్శి తదితర ప్రాంతాల్లో కొందరు కానిస్టేబుల్స్‌ బదిలీల అంశం చర్చకు రాగా అక్కడ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు సూచించిన వారిని ఆ ప్రాంతంలో మరొక స్టేషన్‌కు బదిలీ చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు ముక్తకంఠంతో ఎస్పీకి సూచించినట్లు తెలిసింది. ఇలా సాగిన సమావేశంలో చివరగా మంత్రి రామనారాయరెడ్డి మరోసారి మాట్లాడుతూ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ నిబంధలన మేరకు పనులు చేస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా వ్యవహరించక తప్పదని అలా మొత్తం యంత్రాంగం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలకు సూచించినట్లు తెలిసింది.

Updated Date - Nov 05 , 2024 | 01:31 AM