గ్రానైట్ గనుల్లో భద్రత డొల్ల
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:04 AM
గ్రానైట్ గనుల్లో భద్రత డొల్లగా మారింది. గనుల యజమానుల ధనదాహం, మైన్స్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వెరసి పొట్టచేతపట్టుకొని వచ్చిన వలస కార్మికులకు ప్రాణసంకమవుతోంది. 2010లో హంసా క్వారీలో హైవాల్ విరిగిపడి 14మంది మృత్యువాత పడిన ఘటన దేశవ్యాపం్తగా సంచలనమైంది.
ఈ వారం రోజులే హడావుడి
ముగిశాక కనపడని మైన్స్‌సేఫ్టీ అధికారులు
‘ఓరియంట్’లో భారీ ప్రమాదం
చోటుచేసుకున్నా కన్నెత్తి చూడని వైనం
నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు
తరలిన డీడీఎంఎస్ కార్యాలయం
దాదాపు ఎనిమిది క్వారీల్లో
పొంచి ఉన్న హైవాల్స్ ముప్పు
నేటి నుంచి భద్రతా వారోత్సవాలు
చీమకుర్తి, నవంబర్ 3 (ఆంధ్రజ్యోతి) : గ్రానైట్ గనుల్లో భద్రత డొల్లగా మారింది. గనుల యజమానుల ధనదాహం, మైన్స్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వెరసి పొట్టచేతపట్టుకొని వచ్చిన వలస కార్మికులకు ప్రాణసంకమవుతోంది. 2010లో హంసా క్వారీలో హైవాల్ విరిగిపడి 14మంది మృత్యువాత పడిన ఘటన దేశవ్యాపం్తగా సంచలనమైంది. అనంతరం కొన్నాళ్లు హడావుడి చేసిన అధికారులు ఆతర్వాత భద్రతా ప్రమాణాల పెంపు గురించి పూర్తిగా విస్మరించారు. దీంతో క్వారీల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓరియంట్ క్వారీలో హైవాల్ కూలింది. ఆసమయంలో కార్మికులు ఎవ్వరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎస్పీ దామోదర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కానీ బాధ్యత కలిగిన మైన్స్‌సేఫ్టీ అధికారులు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందే మూడు క్వారీల్లో ఒకేసారి జరిగిన పేలుళ్లతో రాళ్లు ఎగిరిపడి పక్కనున్న జయ మినరల్ క్వారీలో పనిచేస్తున్న కార్మికుని చేతిని తెగిపడేలా చేశాయి. కానీ దీనిపై ఎలాంటి విచారణను అధికారులు చేపట్టలేదు. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరుగుతున్నా మైన్స్‌సేఫ్టీ అధికారులు మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది.
క్వారీయింగ్‌లో నిబంధనలు తూచ్
రామతీర్థం పరిసర ప్రాంతాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ క్వారీలు దాదాపు 40కిపైన ఉన్నాయి. వీటికి సంబంధించిన 150 లీజుల ద్వారా యజమానులు అనునిత్యం ముడిరాళ్లను వెలికితీస్తుంటారు. ఈ రాళ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా క్వారీ యజమానులు భారీగా లాభాలు గడిస్తుంటారు. క్వారీల్లో స్థానికులతోపాటు, ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు దాదాపు 10వేల మందికిపైగా వివిద రకాల పనులను చేస్తున్నారు. వారి భద్రతకు యజమానులు ప్రాధాన్యం ఇవ్వాలి. భద్రతా ప్రమాణాల పర్యవేక్షణకు మైన్స్, మైన్స్‌సేఫ్టీ అధికారులున్నారు. నిబందనలను ఉల్లంఘించి క్వారీయింగ్ చేపడితే తక్షణమే లీజును రద్దుచేయడంతోపాటు కేసులు నమోదు చేసే అధికారం సైతం వీరికి ఉంది. కానీ ఆదిశగా అధికారుల అడుగులు పడకపోవడంతో క్వారీల యజమానులు కార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్నారు.
హైపవర్ కమిటీ సూచనలు కొద్దిరోజులే అమలు
హంసా గ్రానైట్స్‌లో ఘటన అనంతరం అప్పటి ప్రభుత్వం క్వారీల్లో భద్రతా ప్రమాణాల పెంపుకు హైపవర్ సైంటిఫిక్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనలను గనుల్లో పక్కాగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. అప్పటి వరకూ ఇష్టారీతిన క్వారీయింగ్ చేస్తున్న వారు కొంతమేర పద్ధతి మార్చుకున్నారు. ఆతర్వాత కొద్ది రోజులకు షరామామూలే అయ్యింది. క్వారీ యజమానులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదం జరిగితే పరిహారం చెల్లించడానికి అలవాటుపడ్డారు. హైపవర్ కమిటీ సూచనలు పాటిస్తే ఆదాయం తగ్గుతుందన్నదే అందుకు కారణం. కమిటీ సూచనల్లో మరో కీలకమైనది ర్యాంపుల ఏర్పాటు. బెంచ్‌ఫార్మేషన్‌తో క్వారీయింగ్ చేయాలి. కానీ అలా జరడం లేదు. ఇక మిగతా వాటిలో ఫస్ట్ క్లాస్ మేనేజర్లను నియమించుకొని వారి పర్యవేక్షణలోనే క్వారీయింగ్ చేయాలి. కానీ మేనేజర్ల నియామకం జరిగినా వారి సూచనలను క్వారీ యజమానులు అమలు చేయడం లేదు.
భయపెడుతున్న హైవాల్స్
హైపవర్ కమిటీ సూచనల్లో ప్రధానమైనది హైవాల్స్ తొలగించడం. వాటిని అలాగే ఉంచితే కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. కానీ హైవాల్స్ తొలగింపు విషయంలో యజమానులు, అధికారులు మౌనముద్ర దాల్చారు. ఏ క్షణాన్నైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న హైవాల్స్ ఎనిమిది క్వారీల్లో ఉన్నాయని మూడేళ్లక్రితం ఇక్కడ క్వారీల్లో భద్రతపై సర్వే చేసిన చెన్నై బృందం అధికారులకు తేల్చిచెప్పింది. కానీ ఇప్పటి వరకూ చలనం లేదు.
తెలంగాణాకి తరలిన నెల్లూరు కార్యాలయం
మైన్స్‌సేఫీ అధికారుల కార్యకలాపాలు, కార్యాలయ నిర్వహణ కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. గతంలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని గనుల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ కార్యాలయం నెల్లూరులో ఉండేది. దాన్ని కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా తగ్గిపోయింది.
10వ తేదీ వరకూ భద్రతా వారోత్సవాలు
ఉమ్మడి జిల్లాలో ఉన్న గ్రానైట్ క్వారీల్లో 22వ భద్రతా వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 10వతేదీ వరకూ జరగనున్నాయి. క్వారీలను ఉత్పత్తినిబట్టి ఐదు గ్రూపులు (ఏ1,ఏ2,ఏ,బీ1,బీ2)గా విభజించారు. వీటిని తనిఖీ బృందం నిర్దేశించి తేదీల్లో సందర్శిస్తుంది. రికార్డులు, క్వారీయింగ్ కార్యకలాపాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తుంది. మైన్స్‌సేఫ్టీ అధికారులు వీరందరినీ పర్యవేక్షిస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తతంగమంతా పండుగ వాతావరణంలో జరుపుకొనేందుకు క్వారీలను ముస్తాబుచేశారు.