Share News

మహిళా మార్టు.. మోసాలకు అడ్డా

ABN , Publish Date - Dec 05 , 2024 | 02:04 AM

పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వెలుగు ఉద్యోగులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. ఇందుకు మద్దిపాడులోని మహిళా మార్ట్‌నే ఉదాహరణ. పొదుపుసంఘాల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏడాదిన్నర క్రితం రూ.35 లక్షలతో మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ డబ్బును ఆ మండలంలోని పొదుపు సంఘాల నుంచి వసూలు చేశారు.

మహిళా మార్టు.. మోసాలకు అడ్డా
మద్దిపాడులోని మహిళా మార్టు

మద్దిపాడులో రూ.లక్షల్లో గోల్‌మాల్‌

లెక్కతేల్చిన వెలుగు అధికారులు

నాలుగు రోజులుగా నిలిచిన అమ్మకాలు

సరుకు విక్రయించి సొమ్మును జేబుల్లో వేసుకున్న సిబ్బంది

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరుతో రూ.70వేల నిత్యావసరాలు పక్కదారి

ఒంగోలు నగరం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వెలుగు ఉద్యోగులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. ఇందుకు మద్దిపాడులోని మహిళా మార్ట్‌నే ఉదాహరణ. పొదుపుసంఘాల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏడాదిన్నర క్రితం రూ.35 లక్షలతో మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ డబ్బును ఆ మండలంలోని పొదుపు సంఘాల నుంచి వసూలు చేశారు. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకే వినియోగదారులకు సరుకులు అందించాలన్నదే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా మండలంలోని వెలుగు అధికారులు మద్దిపాడు సెంటర్‌లో రూ.25వేల నెల అద్దెకు ఒక భవనం తీసుకున్నారు. అందులో మార్ట్‌ పెట్టి, దాని నిర్వహణ బాధ్యతలను చూసేందుకు మహిళా సంఘాలతో సబ్‌ కమిటీని నియమించారు. కానీ ఈ కమిటీని డమ్మీ చేసి వెలుగు ఏపీఎం, సీసీలే మార్ట్‌ నిర్వహణను చూసినట్లు తెలిసింది. మార్ట్‌లో ఉన్న సరుకులను అమ్మగా వచ్చిన సొమ్మును ఉద్యోగులు తమ జేబుల్లో వేసుకున్నారు. రూ.35లక్షలతో ఏర్పాటు చేసిన మార్ట్‌ ప్రస్తుతం పూర్తి నష్టాల్లో కూరుకుపోయింది.

రూ.5లక్షలు స్వాహా

మార్ట్‌లో సరుకులు అమ్మగా వచ్చిన రూ.5లక్షలకుపైగా సొమ్ము వెలుగు ఉద్యోగుల జేబుల్లోకి వెళ్ళినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కటంతో రెండు రోజుల క్రితం జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేక బృందం మద్దిపాడులోని మార్ట్‌లో విచారణ చేపట్టింది. ప్రత్యేకంగా ఆడిటర్‌ను కూడా పంపించారు. ఈ బృందం విచారణలో అనేక అక్రమాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మార్ట్‌లో విక్రయించేందుకు సరుకులను పెద్ద కంపెనీల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఒంగోలులోని బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసినట్లు తేలింది. అ యితే కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు కూడా అందుబాటులో లేవు. మార్ట్‌లో సరుకులు అమ్మగా వచ్చిన సొమ్మును మార్ట్‌ మేనేజర్‌ ఫోన్‌పే నుంచి ఏపీఎం ఫోన్‌పేకు కూడా బదిలీ జరిగినట్లు సమాచారం. మేనేజర్‌ ప్రతిరోజు సరుకులు అమ్మగా వచ్చిన సొమ్మును బ్యాంకులో జమచేయాల్సి ఉంది. అయితే ఈ సొమ్మును ఏ రోజుకారోజు సంబంధిత వెలుగు ఉద్యోగులు మేనేజర్‌ నుంచి తీసుకుని తమ సొంతానికి వాడేసుకున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఇలా రూ.35లక్షలతో ఏర్పాటు చేసిన ఈ మార్ట్‌ బ్యాంకు ఖాతాల్లో రూ.20వేలలోపే ఉన్నట్లు సమాచారం. మిగిలిన సొమ్మంతా ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరుతో రూ.70వేల విలువైన సరుకులు పక్కదారి

ఈ మార్ట్‌ను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ప్రారంభానికి అప్పటి స్థానిక ఎమ్మెల్యే సుధాకర్‌బాబు హాజరయ్యారు. ఆయన సూచన మేరకు ప్రారంభోత్సవం రోజునే రూ.70 వేల విలువైన నూనె ప్యాకెట్లను మహిళలకు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బును ఆయన ఉద్యోగులకు అందజేశారు. అయితే ఈ సొమ్మును కూడా మార్ట్‌ బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా వారే దిగమింగేశారు. ఇలా మహిళా మార్టులో అందిన కాడికి వెలుగు ఏపీఎం, సీసీ సొంతానికి వాడుకోవటంతో మార్ట్‌ మూత దశకు చేరుకుంది. సరుకులను బహిరంగ మార్కెట్లో కంటే అధిక ధరలకు అమ్మటం, విక్రయించగా వచ్చిన సొమ్మును వెలుగు సిబ్బంది పక్కదారి పట్టించటం, మార్ట్‌లో సరుకులు నిండుకోవటం వంటి కారణాలతో మూతదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ది, వెలుగు పీడీ వసుంధర విచారణకు ఆదేశించగా మూడు రోజుల క్రితం జరిగిన విచారణలో అ క్రమాలు నిగ్గుతేలినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై పీడీ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విచారణ నివేదిక ఇంకా అందలేదన్నారు. అందగానే అ క్రమార్కులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ముగ్గురు ఏపీఎంలకు షోకాజ్‌ నోటీసులు

విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న వెలుగు ఉద్యోగులపై ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ముగ్గురు అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లకు ఆమె షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. జిల్లాలో వెలుగు పథకం కింద అమలుచేస్తున్న పలు పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. పలుమార్లు హెచ్చరించినా కొంతమంది ఏపీఎంల్లో మార్పు లేదు. రాష్ట్రస్థాయిలో ప్రస్తుతం ఎస్‌హెచ్‌జీ ఇన్‌కమ్‌ ప్రొఫైల్‌ సర్వే జరుగుతోంది. గ్రామస్థాయిలో వీవోఏలు ప్రతి ఇంటికి పోయి ఆ కుటుంబాలకు ఎంతమేరకు ఆదాయం వస్తుంది అనే వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఈ సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రాష్ట్రస్థాయిలో చూస్తే జిల్లా అట్టడుగున ఉంది. ఇవి మాత్రమే కాకుండా స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఇచ్చిన రుణాల రికవరీలోనూ జిల్లా వెనుకంజలో ఉంది. ఎస్‌హెచ్‌జీల గ్రేడింగ్‌, వీవో గ్రేడింగ్‌ తదితర కార్యక్రమాల్లో కూడా రాష్ట్రస్థాయిలో చూస్తే జిల్లా బాగా వెనుకబడిపోయింది. దీంతో సిబ్బందిని దారిలో పెట్టేందుకు పీడీ వసుంధర చర్యలు చేపట్టారు. ఎస్‌హెచ్‌జీ ఇన్‌కం ప్రొఫైల్‌ సర్వే తక్కువగా ఉన్న మండలాల ఏపీఎంలకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. పుల్లలచెరువు ఏపీఎం వెంకటయ్య, పీసీపల్లె ఏపీఎం సత్యానందంతోపాటు ఒంగోలు ఏపీఎం శ్రీనివాసప్రసాదుకు నోటీసులు జారీచేశారు. పుల్లలచెరువు, పీసీపల్లె మండలాల ఏపీఎంలు విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు గాను షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా ఒంగోలు ఏపీఎంకు క్రమశిక్షణరాహిత్యం కింద నోటీసు జారీచేశారు. మూడు రోజుల క్రితం జరిగిన టెలీకాన్ఫరెన్సులో పీడీని ధిక్కరిస్తూ ఒంగోలు ఏపీఎం మాట్లాడారు. ఇందుకుగాను ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ అయ్యింది. మూడురోజులలోపు తగిన సమాధానం ఇ వ్వాలని కోరారు.

Updated Date - Dec 05 , 2024 | 02:04 AM