Share News

స్వీయనియంత్రణ పాటించాలి

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:07 AM

దక్షిణాది ప్రాంతంలో పొగాకు పండించే ప్రతి రైతు ఈ ఏడాది పంట సాగు, ఉత్పత్తిలో స్వీయ నియంత్రణ పాటించాలని రైతు ప్రతినిధులు కోరారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించి గడిచిన రెండేళ్ల ధరలు చూసి మురిసిపోయి ఎక్కువ పంటను ఉత్పత్తి చేస్తే అందరూ నష్టపోతారని హెచ్చరించారు.

స్వీయనియంత్రణ పాటించాలి

కర్ణాటక మార్కెట్లో ఇప్పటికే ఒడిదొడుకులు

ఉత్పత్తి పెంచుకుంటే అందరం మునుగుతాం

బోర్డు, వ్యాపారులు ఏమీ చేయలేరు

సాగుదారులు వాస్తవ పరిస్థితిని గుర్తించి మసలుకోవాలని రైతు ప్రతినిధుల విజ్ఞప్తి

ఒంగోలు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది ప్రాంతంలో పొగాకు పండించే ప్రతి రైతు ఈ ఏడాది పంట సాగు, ఉత్పత్తిలో స్వీయ నియంత్రణ పాటించాలని రైతు ప్రతినిధులు కోరారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించి గడిచిన రెండేళ్ల ధరలు చూసి మురిసిపోయి ఎక్కువ పంటను ఉత్పత్తి చేస్తే అందరూ నష్టపోతారని హెచ్చరించారు. అధిక వ్యయ, ప్రయాసలతో పంట పండించి తీరా మార్కెట్లో సరైన ధరలు రాక ఇబ్బందిపడాల్సి వస్తే ఆ సమయంలో పొగాకు బోర్డు, వ్యాపారులు ఏమీ చేయలేరన్న విషయాన్ని అందరూ గమనించుకోవాలన్నారు. ఆ మేరకు బుధవారం స్థానిక బోర్డు ఆర్‌ఎం కార్యాలయంలో దక్షిణాది ప్రాంత వేలంకేంద్రాల రైతు కమిటీ ప్రతినిధులు సమావేశంలో తీర్మానించారు. గడిచిన రెండేళ్లు ఊహించని రీతిలో మార్కెట్‌ పరుగులు తీసి రైతులకు లాభాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది బ్యారన్లు, భూములకు రెట్టింపు అద్దెలు ఇచ్చి బోర్డు అనుమతి పట్టించుకోకుండా చాలా ప్రాంతాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. దాదాపు రెట్టింపు పంట ఉత్పత్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పెట్టుబడి ఖర్చులు కూడా ఇబ్బందిముబ్బడిగా పెరుగుతున్నాయి. అదేసమయంలో పలు ప్రపంచ దేశాలలో ఈ ఏడాది భారీగా పంట ఉత్పత్తి జరగడంతో దేశీయ పంటకు ధరలు తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కర్ణాటకలో మార్కెట్‌ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఆంధ్రా మార్కెట్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని అటు బోర్డు అధికారులు, ఇటు వ్యాపారులు చెప్తున్నారు. ఆ మేరకు వేలం కేంద్రాలు, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి పంట తగ్గించాలని చెప్తున్నారు. అయినా చాలాచోట్ల సాగు పెరుగుతోంది.


సాగు తగ్గించాలని తీర్మానం

ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులు కూడా సాగు తగ్గించాలని రైతులను కోరేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా దక్షిణాదిలోని పొగాకు వేలంకేంద్రాల రైతు ప్రతినిధుల సమావేశం బుధవారం ఒంగోలులో నిర్వహించారు. ప్రస్తుతం పంట సాగు తీరు, తదనుగుణంగా ఉత్పత్తి అంచనా, కర్ణాటకలో వేలం కొనసాగుతున్న తీరు, అంతర్జాతీయ పరిణామాలను చర్చించారు. అన్నికోణాల్లో రానున్న ఆంధ్ర మార్కెట్‌లో ధరలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన అందరూ వ్యక్తం చేశారు. ఇలా అయితే రైతులంతా తీవ్రంగా నష్టపోతారని ధరలు తగ్గిన సమయంలో ఎవరు ఆదుకునే అవకాశం ఉండదని తేల్చేశారు. దీంతో రైతులు స్వీయ నియంత్రణ పాటించి పంట సాగు, ఉత్పత్తి తగ్గించడం ఒక్కటే మార్గమని ఈ విషయాన్ని రైతులందరూ గుర్తించాలని సూచిస్తూ తీర్మానించారు. సమావేశంలో పొగాకు బోర్డు వైస్‌ చైర్మన్‌ పమ్మి భద్రిరెడ్డి, వడెళ్ల ప్రసాద్‌, గురువారెడ్డి, పోతుల నరసింహరావు, అబ్బూరి శేషగిరి, ఆళ్ళ సుబ్బారావుతోపాటు వివిధ వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 01:07 AM