Share News

పనిచేయని సర్వర్‌!

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:23 AM

జిల్లాలో రేషన్‌ పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభమైనా కార్డుదారులకు అందాల్సిన కందిపప్పు మాత్రం కనిపించ లేదు.

పనిచేయని సర్వర్‌!
ఒంగోలులో రేషన్‌ వాహనం వద్ద పడిగాపులు కాస్తున్న కార్డుదారులు

రేషన్‌ వాహనాల వద్ద గంటల తరబడి ఎదురుచూపులు

ఈనెలలోనూ కందిపప్పు అరకొరే

ఒంగోలు (కలెక్టరేట్‌), మార్చి 1 : జిల్లాలో రేషన్‌ పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభమైనా కార్డుదారులకు అందాల్సిన కందిపప్పు మాత్రం కనిపించ లేదు. ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి అరకొరగానే సరఫరా చేస్తోంది. జిల్లాకు 590 టన్నుల రేషన్‌ కందిపప్పు అవసరం కాగా కేవలం 15 టన్నులు మాత్రమే అందుబాటులో ఉండటంతో దాని పంపిణీని నిలిపివేశారు. బియ్యం, పంచదారను మాత్రమే అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 6,70,571 కార్డులు ఉండగా ఒక్కో కార్డుకు కిలో చొప్పున కందిపప్పు, ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం, అర కిలో పంచదారను అందజేయాల్సి ఉంది. అయితే కందిపప్పు, గోధుమపిండి అవసరమైన మేర అందుబాటులో లేదు. జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు పలు ప్రాంతాల్లో సరుకుల పంపిణీకి సర్వర్‌ ఆటంకంగా మారింది. సర్వర్‌ పనిచేయక కార్డుదారులు గంటల తరబడి మొబైల్‌ వాహనాల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయానికి 22,787 (3.39శాతం) కార్డుదారులకు మాత్రమే సరుకులు అందాయి. పంపిణీలో రాష్ట్రంలో మన జిల్లా 18వ స్థానంలో ఉందంటే సర్వర్‌ ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Mar 02 , 2024 | 12:23 AM