Share News

వణికిస్తున్న వానలు

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:10 AM

గిద్దలూరు ప్రాంత రైతులను తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న అధిక వర్షాలు రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

వణికిస్తున్న వానలు

గిద్దలూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గిద్దలూరు ప్రాంత రైతులను తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న అధిక వర్షాలు రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి అందివచ్చిన వరిపైరు పొలంలోనే నేలకొరిగి వర్షంనీటిలో తడిచి ముద్దయింది. కొమ్మదశకు వచ్చిన పప్పు శనగ వర్షం నీటిలోనే కుళ్లి పోయే పరిస్థితి వచ్చింది. తుఫాను ప్రభాంతో తొలిరోజు కురిసిన వర్షం పైర్లకు జీవం పోయగా, రెండవరోజు వర్షం నష్టాన్ని చేకూర్చలేదు. అయితే బుధ, గురు వారాల్లో కురిసిన వర్షం పైర్లకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. గిద్దలూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో గురు వారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 5215 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 67 గ్రామాల పరిధిలో 5547 మంది రైతులు పంట నష్టపోయారు. అత్యధికంగా 2800 హెక్టార్లలో శనగ, 1225 హెక్టార్లలో పొగాకు, 360 హెక్టార్లలో వరి, 246 హెక్టార్లలో మినుము, 264 హెక్టార్లలో ఉలవలు, 86 హెక్టార్లలో వరిగ, 36 హెక్టార్లలో అలసంద, 43 హెక్టార్లలో జొన్న, 131 హెక్టార్లలో నువ్వు, 24 హెక్టార్లలో రాగి పంటలు దెబ్బతిన్నాయి. మండలాల వారిగా పరిశీలిస్తే గిద్దలూరు మండలంలో 1664 హెక్టార్లు, రాచర్ల మండలంలో 410 హెక్టార్లు, కొమరోలు మండలంలో 1530 హెక్టార్లు, బేస్తవారపేట మండలంలో 1611 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. పొగాకు విషయానికి వస్తే అత్యధికంగా గిద్దలూరు మండలంలో 700 హెక్టార్లలో రైతులు నష్టపోగా బేస్తవారపేట మండలంలో 405 హెక్టార్లలో, కొమరోలు మండలంలో 120 హెక్టార్లలో రైతులు నష్టపోయారు. పప్పుశనగ, కొమరోలులో అత్యధికంగా 1100 హెక్టార్లలో, గిద్దలూరు మండలంలో 700 హెక్టార్లు, బేస్తవారపేట మండలంలో 590 హెక్టార్లు, రాచర్ల మండలంలో 410 హెక్టార్లు నష్టపోయారు. వరి పంట బేస్తవారపేట మండలంలో అత్యధికంగా 250 హెక్టార్లలో పంటనష్టం చోటుచేసుకోగా కొమరోలు మండలంలో 60 హెక్టార్లు, గిద్దలూరు మండలంలో 50 హెక్టార్లలో పంట నష్టం చోటుచేసుకొంది. మొత్తం మీద తుఫాన్‌ వర్షం రభీ సీజన్‌లోని రైతులను నట్టేట ముంచింది. ఉద్యానవన పంటల్లో మిరప పంట కూడా చాలా వరకు దెబ్బతిన్నది. ఖరీఫ్‌ సీజన్‌లో సాగైన కంది పూత దశలో ఉండగా 30 శాతంమేర ఇప్పటికే పూత రాలినట్లు సమాచారం అందు తుండగా కంది రైతుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం పంట నష్టపోయిన వైనంపై వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

గిద్దలూరు : తుఫాన్‌ కారణంగా నాలుగు రోజులుగా విడవకుండా వర్షం కురుస్తుండడంతో, పట్టణంలోని చాలా ప్రాంతాల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన ఉన్న కాలనీలను వర్షం నీరు చుట్టుముట్టింది. ఈ కాలనీలకు సరైన రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థకాని లేదు. దీంతో వర్షంపు నీరంతా రోడ్లపైన, ఇళ్ల పక్కన పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో నిలిచి ఉంటోంది. పట్టణ శివార్లలోని వివేకానంద కాలనీ, నల్లబండ బజారులో వర్షపునీరు బయటకు పోవడం లేదు. అర్భన్‌ కాలనీ తదితర ప్రాంతాలలో కూడా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం నీరంతా రోడ్లపైన ఇళ్లపక్కనే ఉంటోంది. దీంతో ప్రజలు నానా అగచాట్లకు గురవుతున్నారు.

పగిడివాగుకు భారీగా వర్షపునీరు

గిద్దలూరు : తుఫాన్‌ కారణంగా రాచర్ల మండలం లోని పగిడివాగుకు భారీగా నీరు చేరుతోంది. నీటిఉదృతి పెరిగి పాలకవీడు- సోమిదేవిపల్లి గ్రామాల మధ్యన ఉన్న రోడ్డుపైకి నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమ య్యారు. స్థానిక ఎస్సై పి.కోటేశ్వరరావు ఈరోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు వేసి గురువారం సాయంత్రం నుంచి రాకపోకలను నిలిపివేశారు. వాగుకు ఇరువైపుల ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

గిద్దలూరు టౌన్‌ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర పంచాయతీ పరిధిలోని మిట్టమీదిపల్లి సమీపంలో చెట్టు నేలకొరిగింది. దీంతో ఆ గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందు కున్న విద్యుత్‌శాఖ ఏఈ నారాయణరెడ్డి, లైన్‌మెన్‌ రహీమ్‌ ఆప్రాంతానికి చేరుకుని నేలకొరిగిన చెట్టును తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరద్దురించారు.

కొమరోలు : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో సాగుచేస్తున్న శనగ, పొగాకు, మొక్కజొన్న, జొన్న, వరి పైర్లు దెబ్బతిన్నాయి. శనగ, ఇంచుమించు సుమారు 5వేల ఎకరాల్లో సాగుచేయగా, ఇంచుమించు రూ.15కోట్లు పూర్తిగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక సమాచారం. మండల వ్యవసాయ శాఖ అధికారు గతంలో 21 గ్రామాల్లో 1200మంది రైతులు సాగుచేస్తున్న 3825ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఆయా పంటలను తిరిగి సాగు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆ మేరకు రైతుసేవా కేంద్రాల ద్వారా నూరుశాతం రాయితీపై విత్తనాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని స్ధానిక ప్రజాప్రతినిధులు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 01:10 AM