స్వల్పంగా పెరిగిన పొగాకు ధరలు
ABN , Publish Date - Apr 09 , 2024 | 01:07 AM
పొగాకు మార్కెట్ హాట్‌హాట్‌గా సాగుతోంది. వ్యాపారులు బేళ్ల కోసం పోటీపడి కొనుగోలు చేస్తున్నారు.
కిలో రూ.237 పలికిన గరిష్ఠ ధర
లోగ్రేడ్‌ను అధికంగా తెస్తున్న రైతులు
ఇప్పటికి 18.90 మిలియన్ కిలోల విక్రయం
కిలోకు రూ.220 లభించిన సగటు ధర
ఒంగోలు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పొగాకు మార్కెట్ హాట్‌హాట్‌గా సాగుతోంది. వ్యాపారులు బేళ్ల కోసం పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు గరిష్ఠ ధర కిలో రూ.232కు అటుఇటుగా ఉంటుండగా సోమవారం స్వల్పంగా పెరిగింది. కొండపిలో కిలోకు రూ.237 లభించింది. ఇతర కేంద్రాల్లో రూ.235 లేదా రూ.236 పలికింది. నెల క్రితం దక్షిణాది ప్రాంతంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజున గరిష్ఠ ప్రారంభ ధర కిలోకు రూ.230 ఇచ్చిన వ్యాపారులు అదే ధరను కొనసాగిస్తున్నారు. అదే సమయంలో మంచి ధరలు లభిస్తుండటంతో రైతులు కూడా మేలురకం కన్నా లోగ్రేడ్ పొగాకునే అధికంగా తెస్తున్నారు. ఆ రకం కూడా కిలో రూ.220కి అటుఇటుగా ధర పలుకుతోంది. గతంతో పోల్చితే లోగ్రేడ్ ధరలు ఆశాజనకంగానే ఉంటున్నాయి. అయితే ఈస్థాయి ధర ఎంతకాలం ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు ప్రస్తుతం విక్రయాలకు మూడొంతుల బేళ్లకుపైగా లోగ్రేడ్‌నే తెస్తున్నారు. ఆ గ్రేడ్‌లో గతంలో పనికిరాక ఎరువుగా దిబ్బల్లో వేసే నల్ల బొగులు రకం మినహా ఇతర రకాలను వ్యాపారులు పోటీపడే కొంటున్నారు. కాగా ఇప్పటివరకు మేలు రకం గరిష్ఠ ధర కిలో రూ.230 నుంచి రూ.233 వరకు ఉండగా సోమవారం మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. పలుచోట్ల కిలో రూ.235 నుంచి రూ.236 పలికింది. కొండపిలో రూ.237 లభించింది. ఈ సీజన్‌లో ఇదే గరిష్ఠ ధర కాగా క్రమంగా మార్కెట్ పెరుగుతుందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటివరకు దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో 18.90 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. సగటున కిలోకు రూ.220 ధర లభించింది. పొగాకు మార్కెట్‌లో గుత్తాధిపత్యం వహించే ఐటీసీ వంటి కంపెనీలు గరిష్ఠ ధర కిలో రూ.230 మించకుండా జాగ్రత్త తీసుకుంటున్నాయి. పలువురు డీలర్లు, కొందరు ఎగుమతిదారులు బేళ్ల కోసం పోటీపడుతూ స్వల్పంగా ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. కాగా మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా రైతులు ఆ తరహా బేళ్లను విక్రయాలకు తీసుకురావాలని బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావు సూచించారు. నల్లబొగులు వంటి బేళ్లను తీసుకురావద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.