Share News

గ్రానైట్‌ అక్రమ రవాణాను నియంత్రించాలి

ABN , Publish Date - Oct 03 , 2024 | 11:19 PM

జిల్లాలో గ్రానైట్‌ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జిల్లా గ్రానైట్‌ స్లాబ్‌ల అక్రమరవాణాపై జరిగిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు

గ్రానైట్‌ అక్రమ రవాణాను నియంత్రించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 3 : జిల్లాలో గ్రానైట్‌ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జిల్లా గ్రానైట్‌ స్లాబ్‌ల అక్రమరవాణాపై జరిగిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో గ్రానైట్‌ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు రెవెన్యూ, పోలీస్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, మైన్స్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అవసరమైన మేరకు మొబైల్‌ టీంలను ఏర్పాటుతోపాటు కమిటీలో చర్చించిన విధంగా రెండు చెక్‌పోస్టులతోపాటు సీసీ టీవీలు ఏర్పాటుచేయాలని మైనింగ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రానైట్‌ స్లాబ్‌ల అక్రమ రవాణాపై ఇటీవల తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్‌ శాఖ డీడీ రాజశేఖర్‌ మాట్లాడుతూ చీమకుర్తి మండలంలోని చీమకుర్తి, బూదవాడ, ఆర్‌ఎల్‌పురంలలో 85 బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ లీజులు పనిచేస్తున్నాయని, సగటున జిల్లాకు రూ.250 కోట్ల రెవెన్యూ వస్తుందన్నారు. ఉత్పత్తి చేసే గ్రానైట్‌ మెటీరియల్‌లో 80శాతం చైనా, తైవాన్‌, యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి అవుతుందని, మిగిలిన 20శాతం స్థానిక గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ పరిశ్రమలలో ప్రాసెస్‌ చేస్తారన్నారు. గత ఐదేళ్లలో జిల్లాలో గ్రానైట్‌ స్లాబ్‌ల అక్రమ రవాణాపై 1,225 కేసులు నమోదు చేసి రూ.206.31 కోట్లు ఫెనాల్టీ విధించినట్లు ఈ సందర్భంగా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రానైట్‌ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీటీసీ సుశీల పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 11:20 PM