వేగంగా వాడరేవు - పిడుగురాళ్ల రోడ్డు
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:05 AM
వాడరేవు, పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో తీరప్రాంత రూపుమారనుంది. రూ.1062 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరు లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది.
నిర్మాణంలో ఇసుక వినియోగంపై విమర్శలు
అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు
చీరాల, అక్టోబరు 3 : వాడరేవు, పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో తీరప్రాంత రూపుమారనుంది. రూ.1062 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరు లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. ఆ నిర్మాణాలకు కావల్సిన ఇసుకకు సంబంధించి అనుమతి పొందిన రీచ్‌ల నుంచి కాకుండా స్థానికంగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో ప్రభుత్వ ఇసుక రీచ్‌లు లేవు. మైనింగ్, రెవెన్యూ నుంచి ప్రత్యేక అనమతులు పొందిన దాఖలాలు లేవు.
వాడరేవు, పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారి పొడువు 81కి.మీ. అందులో జిల్లా పరిధిలో 35 కిలోమీటర్లు ఉంది. వాడరేవు సముద్రతీరం నుంచి పిడుగురాళ్ల వరకు జరిగే నిర్మాణంలో రెండు ఫ్లైవోవర్లు, ఒక ఆర్‌వోబీ నిర్మిస్తారు. ఆ క్రమంలో 216 జాతీయ రహదారిలో వాడరేవు క్రాస్ రోడ్స్ సమీపంలో ఓవర్ బ్రిడ్జి వస్తుంది. అందుకు సంబంధించి భారీ పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది.
రోడ్డు మార్గంతో టూరిజం అభివృద్ధి
వాడరేవు, పిడుగురాళ్ల రోడ్డు విస్తరణతో టూరిజం పరంగా అభివృద్ధికి మెరుగైన వనరులు సమకూరుతాయి. ఆ క్రమంలో మెరైన్ ప్రాజెక్టులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మత్స్యసంపద ఎగుమతులకు అనువైన వాతావరణం
మత్స్యకారులు తాము వేటాడి తెచ్చిన మత్స్య సంపదకు గిట్టుబాటు ధర పొందేందుకు అవకాశం ఏర్పడనుంది. సాధారణంగా వాడరేవు, రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు తాము వేటాడిన మత్స్య సంపదను ఎక్కువగా ఆయా ప్రాంతాల్లోని ఫిష్‌ల్యాండ్ సెంటర్లలో నిర్వహించే వేలంలో వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. నూతనంగా రూపుదిద్దుకునే 167ఏ రోడ్డు ద్వారా తమ మత్స్యసంపదను మత్స్యకారులు త్వరితగతిన ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలవుతుంది. దీంతో వ్యాపారులు ఎక్కువ మంది కొనుగోలుకు వస్తారు. తద్వారా పోటీ పెరిగి మత్స్యకారులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.
ఇసుక వినియోగంపై విమర్శలు
నూతన రోడ్డు నిర్మాణ పనులు వచ్చే ఏడాది డిసెంబరు ఆఖరులోపు పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు చెప్తున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఇసుకను ప్రభుత్వ అనుమతులు పొందిన రీచ్‌ల నుంచి మాత్రమే కాంట్రాక్టర్ కొనుగోలు చేసి వినియోగించాలి. పని జరిగే ప్రాంతానికి సమీపంలో అందుబాటులో ఉన్నచోట అక్రమార్కుల నుంచి కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి అక్రమార్కులు రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా తవ్వి, రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. చీరాల, వేటపాలెం మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించి ఎవరికి అనుమతులు లేకపోవడం గమనార్హం.