వీధిలైట్లు కూడా వేయరా?
ABN , Publish Date - Oct 31 , 2024 | 12:20 AM
అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం హాట్ హాట్ గా సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మున్సిపల్ సమావేశాలకు భిన్నంగా బుధవారం నాటి కౌన్సిల్ సమావేశం జరిగింది.
కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలి
చాంబర్‌లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు ఇంకెప్పుడు పెడతారు
ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్‌లు
వాగ్వివాదానికి దిగిన వైసీపీ సభ్యులు
అద్దంకి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం హాట్ హాట్ గా సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మున్సిపల్ సమావేశాలకు భిన్నంగా బుధవారం నాటి కౌన్సిల్ సమావేశం జరిగింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నా అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పనులు చేయడంలో మాత్రం వైసీపీ పెత్తనమే సాగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని పలువురు టీడీపీ కౌన్సిలర్‌లు అన్నారు. అద్దంకి పట్టణంలో కుక్కల బెడద ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల టీడీపీ కౌన్సిలర్ మాగులూరి తిరుపతమ్మ ప్రశ్నించారు. ఇదే విషయమై మిగిలిన కౌన్సిలర్‌లు కూడా వంత కలిపారు. అదే సమయంలో వైసీపీ కౌన్సిలర్‌లు కూడా తందాన అన్నారు. ఇక పారిశుధ్యం నిర్వహణపై ప్ర త్యేక దృష్టి పెట్టాలని కోరారు. కొత్తగా పలు ప్రాంతాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా వీధి లైట్లు ఏర్పాటులో మాత్రం మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల పలువురు టీడీపీ కౌన్సిలర్‌లు ప్రశ్నించారు. అన్ని వార్డులలో వీధిలైట్లు పరిస్థితి అదే విధంగా ఉందని వైసీపీ కౌన్సిలర్‌లు అన్నారు. ఇలా చర్చ సాగే సమయంలో టీడీపీ కౌన్సిలర్ లు ప్రాతినిథ్యం వహించే వార్డులలో అభివృద్ధి పనులకు వైసీపీ పాలన లో నిధులు మంజూరు చేయకపోగా, ప్రస్తు తం కూడా అదే పంధా కొనసాగుతుందని పలువురు కౌన్సిలర్‌లు అన్నారు. దీంతో పలువురు వైసీపీ కౌన్సిలర్‌లు ఎదురు దాడికి దిగారు. అదే సమయంలో ఓ వైసీపీ కౌన్సిలర్ ఒకింత ఆవేశంగా మహిళా కౌన్సిలర్ పట్ల కఠువుగా మాట్లాడాడు. దీంతో సదరు మహిళా కౌన్సిలర్ తన వ్యక్తి గత విషయాలు, పార్టీ మారిన విషయాలు మాట్లాడడం సమంజసం కాదని ఘాటుగా చెప్పా రు. ఇలా మాటల యుద్దంగా కౌన్సిల్ సమావేశం సాగింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్నా ఇంకా సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫొటోలు పెట్టక పోవడం ఏమిటని, గత సమావేశాలలో ఈ విషయాన్ని అడిగినా స్పందించలేదని పలువురు టీడీపీ కౌన్సిలర్‌లు ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా అద్దంకి మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ కౌన్సిలర్‌లు ప్రాతినిఽథ్యం వహించే వార్డులలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంపై ప్రశ్నించారు. పార్టీ మారిన కౌన్సిలర్‌లలో నలుగురు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిుషనర్ రవీంద్ర, ఏఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.