Share News

అక్కడంతే!

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:18 AM

సహకార శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్‌ లేఖ రాసినా అక్కడి నుంచి స్పందన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత సీఈవో కోటిరెడ్డిని సరెండర్‌ చేయాలని సూచిస్తూ పదిరోజుల క్రితం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

అక్కడంతే!
ఒంగోలులోని పీడీసీసీ బ్యాంకు

కలెక్టర్‌ సిఫార్సు చేసినా కదలరు

సహకార శాఖలో విచిత్ర పరిస్థితి

పీడీసీసీ బ్యాంకు సీఈవోపై ఉన్నతాధికారుల అమిత ప్రేమ

చర్యల విషయంలో మీనమేషాలు

అవకతవకలపై సాగే విచారణపై అనుమానాలు

సహకార శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్‌ లేఖ రాసినా అక్కడి నుంచి స్పందన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత సీఈవో కోటిరెడ్డిని సరెండర్‌ చేయాలని సూచిస్తూ పదిరోజుల క్రితం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉన్నతాధికారులకు లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న సదరు సీఈవో ఇక్కడే ఉంటే రికార్డుల తారుమారుకు అవకాశం ఉన్నందున మార్పు చేయాలని కోరారు. అయితే ఆ శాఖ ఉన్నతస్థాయి అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలు ఈ లేఖ కలెక్టర్‌ రాసే సమయంలో ప్రస్తుతం బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జిగా ఉన్న జేసీకి కాపీ మార్కు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఆ విషయంలో జిల్లా సహకార శాఖ కార్యాలయం కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఒంగోలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయిలో పాలనా యంత్రాంగానికి సర్వోన్నత అధికారైన కలెక్టర్‌ తన పరిధిలో గుర్తించిన అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే అది తక్షణం అమలవుతుంది. నేరుగా తాను చర్య తీసుకొనే అధికారం లేని విషయాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తూ లేఖ రాస్తే తక్షణం వారు దానిని అమలు చేస్తారు. అయితే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది.

వైసీపీ పాలనలో భారీగా అవినీతి, అక్రమాలు

వైసీపీ ఐదేళ్ల పాలనలో సహకార ఎన్నికలు నిర్వహించకుండా త్రిసభ్య కమిటీలుగా తమ పార్టీ నేతలను నియమించుకొని ఇష్టారీతిన పాలన సాగించారు. అలాగే పీడీసీసీ బ్యాంకులోనూ కొనసాగింది. అనేక విషయాల్లో పాలకవర్గం, అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై ప్రభుత్వానికి పలు రూపాలలో ఫిర్యాదులు వెళ్లాయి. ప్రధానంగా జగనన్న పాల వెల్లువ పథకం కింద రూ.23 కోట్లమేర రుణాలు మంజూరు చేయగా అందులో రూ.16.5 కోట్లు నాన్‌ ఫర్మామింగ్‌ అసెట్స్‌ (ఎన్‌పీఏ)లుగా చూపి దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్‌ రుణాలను బోగస్‌ వ్యక్తులకు ఇవ్వడం, జగనన్న తోడు, పొదుపు మహిళలు, ఇతర రుణ గ్రూపులకు ఇచ్చిన రూ.5 కోట్లలో సగం బినామీల పరంకావడం, ఇతర పథకాల రుణాలతోపాటు ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. 2019-24 మధ్య కాలంలో బ్యాంకు బ్రాంచిల రీమోడలింగ్‌ పనుల పేరుతో దాదాపు రూ.5కోట్ల మేర దోపిడీ జరిగిందని విమర్శలు వచ్చాయి.

సీఎం, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు

గత ఐదేళ్లలో పీడీసీసీ బ్యాంకులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, అందుకు బ్యాంకు అధికారులు ప్రధాన సూత్రధారులని పేర్కొంటూ కొందరు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అదేసమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇలా తనకు అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఈనెల తొలివారంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రాష్ట్ర సహకారశాఖ మంత్రి అచ్చన్నాయుడుకు లేఖ రాశారు. సమగ్ర విచారణ కోసం సెక్షన్‌ 51 ప్రకారం విచారణ చేయాలని కోరారు. మరికొందరు ఏసీబీ విచారణ కోరుతూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం విజిలెన్స్‌ అధికారులు బ్యాంకులో అవకతవకలపై విచారణ చేశారు. అయితే బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాల్లో ప్రస్తుత సీఈవో కోటిరెడ్డి పాత్ర కూడా ఉందని, ఆయన అదే స్థానంలో ఉంటే విచారణ సజావుగా సాగే అవకాశం ఉండదన్న ఫిర్యాదులు కలెక్టర్‌కు వెళ్లాయి.

స్పందన కరువు

ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు, ఇక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కలెక్టర్‌ అన్సారియా విచారణ కొనసాగే సమయంలో సీఈవో ఇక్కడ ఉండటం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చారు. అలా ఉంటే రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం కూడా ఉంటుందని భావించారు. అదేవిషయాన్ని ఆప్కాబ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు తెలియజేస్తూ తక్షణం పీడీసీసీ బ్యాంకు సీఈవోను ఇక్కడ సర్వీసు నుంచి తొలగించాలని కోరుతూ ఈనెల 21న లేఖ రాశారు. బ్యాంకులో అక్రమాలపై సమగ్ర విచారణ కోసం సెక్షన్‌ 51 ఎంక్వయిరీ చేయించాల్సిన రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌కు కూడా అదే లేఖను పంపారు. సాధారణంగా ఇలాంటి లేఖలు కలెక్టర్‌ రాస్తే దాదాపు అదే రోజు చర్యలు ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా పదిరోజులు గడిచినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు.


కలెక్టర్‌ను పక్కదారి పట్టించిన సహకార శాఖ అధికారులు

కలెక్టర్‌ లేఖ పంపేటప్పుడు సీఈవోపై తక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉన్న బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జికి దాన్ని మార్కు చేయలేదు. ప్రస్తుతం బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జిగా జేసీ గోపాలకృష్ణ ఉండగా కలెక్టర్‌ లేఖ కాపీ ఆయనకు కూడా వెళ్లి ఉంటే సీఈవోపై తక్షణం చర్యలు ఉండేవి. అయితే బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జికి సదరు లేఖ పంపే విషయంలో జిల్లా సహకారశాఖ కార్యాలయం అధికారులు కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారన్న విమర్శలు వస్తున్నాయి. బ్యాంకులో జరిగిన అవకతవకలు బయటకు రాకుండా ఉండేందుకే అధికారులు ఇలా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విజిలెన్స్‌ విచారణ ఏమేరకు సజావుగా సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వారంరోజులపాటు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మిన్నకున్న ఆప్కాబ్‌ ఎండీ రెండు రోజుల క్రితం బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి పరిధిలోనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచిస్తూ లేఖ రాసినట్లు తెలిసింది. తదనుగుణంగా చర్యలకు జేసీకి కలెక్టర్‌ సూచించినట్లు సమాచారం. అయితే సీఈవోపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అదేసమయంలో మొత్తం బ్యాంకు కార్యకలాపాలపై కీలకమైన సెక్షన్‌ 51 విచారణ నిర్వహించాలని సహకారశాఖ కమిషనర్‌కు అదే లేఖలో కలెక్టర్‌ కోరగా దానిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేకపోవడం ఆ శాఖ పనితీరుకు దర్పణం పడుతోంది.

Updated Date - Nov 02 , 2024 | 01:18 AM