ఆ ఇద్దరిపై ఆరోపణలు నిజమే!
ABN , Publish Date - Nov 03 , 2024 | 11:56 PM
రెండు కీలక శాఖలలో పనిచేసిన ఇద్దరు జిల్లా అదికారుల అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. విచారణ కోసం కలెక్టర్ నియమించిన అధికారులు ఈమేరకు ఆమెకు నివేదించారు. దీంతో వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా లేఖలు రాశారు.
చర్యలు కోరుతూ ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ
డీఎల్‌డీవో ఉషారాణిని సస్పెన్షన్‌తో పాటు సరెండర్‌కు సిఫార్సు
డ్వామా పూర్వ పీడీ అర్జునరావుపైనా చర్యలు
ఒంగోలు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రెండు కీలక శాఖలలో పనిచేసిన ఇద్దరు జిల్లా అదికారుల అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. విచారణ కోసం కలెక్టర్ నియమించిన అధికారులు ఈమేరకు ఆమెకు నివేదించారు. దీంతో వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా లేఖలు రాశారు. అందులో ఒకరు గతంలో ఇన్‌చార్జి డీపీవోగా పనిచేసిన ఒంగోలు డీఎల్‌డీవో ఉషారాణి కాగా, మరొకరు డ్వామా పూర్వ పీడీ అర్జునరావు. జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో జరిగిన సచివాలయ గ్రేడ్-5, గ్రేడ్-5 (సచివాలయ కార్యదర్శులు) బదిలీల్లో నిబంధనలు ఉల్లంఘించారని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఆ సమయంలో ఉషారాణి ఇన్‌చార్జి డీపీవోగా ఉన్నారు. ఆ ఫిర్యాదులపై విచారణకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కలెక్టర్ నియమించారు. ప్రాథమిక విచారణ సమయంలోనే అవకతవకలు, అవినీతి వ్యవహారాలను గుర్తించి డీపీవో కార్యాలయంలో పనిచేసే ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. అనంతరం సమగ్ర విచారణ చేపట్టి ఇన్‌చార్జి డీపీవోగా ఉన్న ఉషారాణి ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రధానంగా ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా, కలెక్టర్ ఇచ్చిన నోట్ ఆర్డర్‌కు భిన్నంగా కొన్ని బదిలీలు జరిగినట్లు తేల్చారు. బదిలీల సమయంలో, అలాగే ఇతర ప్రాంతాలకు విజిట్‌కు వెళ్లినప్పుడు అక్రమ వసూళ్లు, కొత్త డీపీవో విధుల్లో చేరాక కూడా ఉషారాణి కొన్ని ఆర్డర్లు ఇవ్వడం తదితర అంశాలను గుర్తించిన త్రిసభ్య కమిటీ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఉషారాణిని సస్పెండ్ చేయడంతోపాటు ప్రభుత్వానికి సరెండర్‌కు సిఫార్సు చేస్తూ కలెక్టర్ అన్సారియా పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. మరోవైపు డ్వామా పూర్వ పీడీ అర్జునరావుపై కూడా చర్యలు కోరుతూ లేఖ రాశారు. ఇక్కడ అర్జునరావు పనిచేసిన సమయంలో ఆయన అవినీతిని భరించలేమని, నెలనెలా మామూళ్లు ముట్టచెప్పలేమంటూ డ్వామాలో మండల స్థాయిలో పనిచేసే వారితోపాటు వివిధ విభాగాల సిబ్బంది కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ గోపాలకృష్ణ విచారణ చేపట్టారు. ఆ విచారణలో కొంత జాప్యం జరగ్గా బదిలీల్లో భాగంగా అర్జునరావు జిల్లా నుంచి మరోచోటకు వెళ్లారు. కాగా సదరు వ్యవహారంపై రెండు రోజుల క్రితం జేసీ తన నివేదికను కలెక్టర్‌కు ఇవ్వగా అందులో అర్జునరావుపై సిబ్బంది చేసిన ఆరోపణలు, అవినీతి వ్యవహారాలు వాస్తవమేనని నిర్ధారించినట్లు సమాచారం. దీంతో అర్జునరావుపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ అన్సారియా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు.